గ్రావెల్ అక్రమ రవాణాపై గ్రామస్తుల తిరుగుబాటు
వరదయ్యపాళెం: మండలంలోని బత్తలవల్లం చెరువు సమీపంలో గ్రావెల్‌ను అక్రమంగా తవ్వకాలు జరిపి తమిళనాడుకు తరలించడంపై స్థానిక గ్రామస్తులు తిరుగుబాటు చేశారు. దీంతో గ్రావెల్ మట్టితో తమిళనాడుకు తరలిపోతున్న లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. అయితే అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ నుండో వచ్చి గ్రావెల్ మాఫియా వ్యాపారం చేయడమేమిటని స్థానికులు వారిని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా గ్రావెల్ అక్రమ రవాణాను నియంత్రించాలని ప్రభుత్వాన్ని కోరారు. రెండు రోజులుగా ప్రభుత్వాధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి గ్రావెల్ మాఫియాను నియంత్రించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రధానంగా లారీల తాకిడికి రోడ్లు ధ్వంసం కావడం, దుమ్ముధూళితో అవస్థలు పడుతున్నట్లు వారు ఆవేదన చెందుతున్నారు.
ఎర్రచందనం కేసులో ఒకరికి ఐదేళ్ల జైలు
తిరుపతి లీగల్: ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో తమిళనాడు, తిరువణ్నామలై జిల్లా, పోలూరు తాలూకా, పులియాన్ కుప్పం గ్రామానికి చెందిన పి శేఖర్‌కు ఐదేళ్లు జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి మంగళవారం తీర్పు చెప్పారు. కోర్టు లైజనింగ్ అధికారి హరి ప్రసాద్, కానిస్టేబుల్ పళని కథనం మేరకు.. కార్వేటినగరం పోలీసులకు 2017 జనవరి 5వ తేదీ వచ్చిన సమాచారంతో కార్వేటినగరం మండలం, గురువరాజు గుంట సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ఐదుగురు అటవీ ప్రాంతంలో ఎర్రచందనం చెట్లను నరికి ఐదు దుంగలుగా మార్చి తరలిస్తున్నట్టు గుర్తించారు. 163 కిలోల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఐదుగురిని అరెస్టు చేసి, పుత్తూరు సెషన్స్ కోర్టులో హాజరు పరిచారు. కేసు విచారణ దశలో నిందితుడు శేఖర్ కోర్టుకు హాజరు కాకపోవడంతో అతనిపై విచారణ తప్పించి మిగిలిన నలుగురిపై కేసు విచారణ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఎర్రచందనం కేసుల విచారణ కోర్టు తిరుపతిలో ఏర్పాటు కావడంతో కేసు తిరుపతికి బదిలీ అయింది. పోలీసులు నిందితుడు శేఖర్‌ని అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు. నేరం అతనిపై రుజువు కావడంతో న్యాయమూర్తి నిందితుడు శేఖర్‌కు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.
ఏపీఎస్పీడీసీఎల్‌లో పలువురికి ఉద్యోగోన్నతులు
తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో విధులు నిర్వహించే అధికారుల్లో పలువురికి పదోన్నతులు కల్పిస్తూ సీఎండీ శివశంకర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కార్పొరేట్ కార్యాలయంలో జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న సీహెచ్ రామచంద్రరావుకు చీఫ్ జనరల్ మేనేజర్‌గా ఉద్యోగోన్నతి కల్పించారు. అలాగే గతంలో హెచ్‌ఆర్‌డీ విభాగం చీఫ్ జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎన్. శోభా వాలెంటీనా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో ఆ బాధ్యతలను కూడా సీహెచ్ రామచంద్రరావుకు అప్పగించారు. అలాగే ఏపీఎస్పీడీసీఎల్‌లో పి–ఎంఎం విభాగం చీఫ్ జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వహించిన పీహెచ్ జానకిరామ్ గత నెల 31వ తేదీన ఉద్యోగ విరమణ చేయడంతో ప్రాజెక్ట్స్ విభాగం చీఫ్ జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న జె.రమణాదేవికి పి–ఎంఎం విభాగం చీఫ్ జనరల్ మేనేజర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.. కర్నూలు సర్కిల్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా విధులు నిర్వహించే బి.లతకు జనరల్ మేనేజర్ (ఐటీ– ఎస్‌ఏపీ)గా, కార్పొరేట్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న కె. హేమలతకు సూపరింటెండింగ్ ఇంజినీర్ (డీపీఈ)గా ఉద్యోగోన్నతి కల్పించారు. అలాగే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా విధులు నిర్వహిస్తున్న ఎన్. డేవిడ్ లివింగ్ స్టోన్, ఎల్. ప్రసాద్, ఎస్. కళ్యాణ్ చక్రవర్తికి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా ప్రమోషన్ ఇచ్చారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎస్.లలితకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ఉద్యోగోన్నతి కల్పించారు.


