సంఘ విద్రోహులతో ప్రాణహాని
పెళ్లకూరు: నియమ నిబంధనల ప్రకారం చట్టానికి లోబడి వ్యాపారం చేసుకుంటున్నప్పటికీ చట్టాలను కాపాడాల్సిన కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతూ బలవంతపు వసూళ్లు చేస్తున్న వారిని అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టిస్తే చీకటి వ్యాపారం చేసుకునే పొరికి బ్యాచ్‌కి ఉలికిపాటు ఎందుకని కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి అన్నారు. మంగళవారం చిల్లకూరులోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. అవినీతి సీఐ బాబీ, హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్‌రాజు కలిసి చేస్తున్న అనుచిత ఒత్తిళ్లను తట్టుకోలేక ఉన్నతాధికారులను ఆశ్రయించి ఏసీబీకి పట్టించామన్నారు. ఈ క్రమంలో షాపులో పని చేస్తున్న ఓ గుమస్తాని అక్రమంగా అరెస్టు చేసి, పోలీస్‌స్టేషన్‌లో నిర్భంచి దుర్భాషలాడడంతోపాటు ప్రతి నెలా మాముళ్లు భారీగా ఇవ్వాలంటూ డిమాండ్ చేసి పూచీకత్తుపై విడుదల చేశారన్నారు. సీఐ బాబీ చేస్తున్న తీవ్ర ఒత్తిడిని తట్టుకోలేక అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించినట్టు వెల్లడించారు. అయితే ఏసీబీకి పట్టుబడిన సీఐ సహకారంతో చీకటి వ్యాపారాల ద్వారా లబ్ధి పొందుతున్న నాయుడుపేట, విన్నమాల ప్రాంతాలకు చెందిన షేక్ రఫీ, దార్ల రాజేంద్ర అనే సంఘ విద్రోహులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యక్తిగత దూషణలు చేయడం, పరుష పదజాలంతో దుర్భాషలాడం, వీడియోల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. వీరికి అండగా ఉంటూ తెర వెనుక నుంచి నడిపిస్తున్న మరి కొందరు స్మగ్లర్లు వల్ల ప్రాణహాని ఉందన్నారు. ఎందుకంటే ఏసీబీకి పట్టుబడిన సీఐ బాబీ, హెడ్‌కానిస్టేబుల్ రామ్మోహన్‌రాజులకు చాలా కాలంగా రౌడీషీటర్లు, దొంగలు, గంజాయి వ్యాపారులతో సత్సంబంధాలున్నాయని, ఈ క్రమంలోనే ఇరువురు జైల్‌లో ఉంటూ రఫీ, రాజేంద్రతో బెదిరింపు వీడియోలు గ్రూపుల్లో పెడుతున్నట్లు చెప్పారు. ఈ విషయమై సీఎం చంద్రబాబుకు, హోమ్‌మంత్రి అనిత, డీజీపి, ఐజీ, జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు, ఏసీబీ ఉన్నతాధికారులకు, ఇంటెలిజెన్స్ అధికారులకు ఫిర్యాదు చేసి, తనకు పూర్తి స్థాయి భద్రత కల్పించాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నట్లు విన్నవించారు.


