నువ్వా.. నేనా!
తిరునగరిలో శృతిమించిన కూటమి ఆగడాలు! ఆటో స్టాండ్ల వద్ద కూటమి నేతల వసూళ్ల దందా కూటమి నేతల తీరుపై ప్రజలు, యాత్రికులు ఆగ్రహం
సాక్షి ప్రతినిధి, తిరుపతి/తిరుపతి కల్చరల్: కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఆ పార్టీ నేతల ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి ధనార్జనే ధ్యేయంగా కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. చిరు వ్యాపారులు, ఆటో కార్మికుల నుంచి నాకింత, నీకింత అంటూ పోటీపడుతున్నారు. తేడా వచ్చిన చోట ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు తెగబడుతూ భక్తులు, యాత్రికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పవిత్రతకు, ప్రశాంతతకు ప్రతీకగా నిలిచే తిరుపతిలో రాజకీయ వర్గ పోరు ఇటు స్థానికులు, అటు భక్తులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రతో పాటు దేశ విదేశాల నుంచి భక్తులు వచ్చే తిరుపతిలో ఇటువంటి ఘటనలు జరగడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతి బస్టాండ్ పరిసరాల్లో ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో టీడీపీ, జనసేన పార్టీ వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొనడమే ఇందుకు తాజా ఉదాహరణే నిదర్శనం. ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్ సమీపంలోని మంజూనాథ హోటల్ వద్ద ఏర్పాటు చేసిన జనసేన ఎమ్మెల్యే ఫ్లెక్సీ వివాదానికి కారణమైంది. సమీపంలోని పార్కింగ్ స్థలానికి ఫ్లెక్సీ అడ్డుగా ఉందని టీడీపీ నాయకుడు హోటల్ యజమానిని కోరినట్లు తెలిసింది. అయితే ఎంతకూ తొలగించకపోవడంతో టీడీపీ నాయకుడు ఆ ఫ్లెక్సీని తొలగించడంతో ఇరు వర్గాల మధ్య వివాదం మొదలైంది. ఈ వివాదం హింసాత్మకంగా మారడంతో ఆ ప్రాంతంలో ఉన్న భక్తులు, యాత్రికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ వివాదంపై టీడీపీ, జనసేన శ్రేణులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఒక్క వివాదమే కాదు.. నగరంలో రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న పార్కింగ్ స్థలం, శ్రీనివాసం, మాధవం, బైరాగిపట్టెడ, ఇలా అనేక ప్రాంతాల్లో టీడీపీ, జనసేన నేతల మధ్య తరచూ వివాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. తమ పార్టీ వారు తోపుడు బండ్లు ఏర్పాటు చేసుకునేందుకు టీడీపీ, జనసేన నేతలు పోటీపడి చిరు వ్యాపారులపై దౌర్జన్యాలు దిగుతున్నట్ల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటో స్టాండ్‌లో తమ వారి ఆటోల కోసం టీడీపీ, జనసేన నేతలు పోటీ పడుతున్నట్లు తెలిసింది. ఆటో స్టాండ్‌లో ఆటో ఏర్పాటు చేయాలంటే సుమారు రూ.2.50 లక్షలు మామూళ్లు చెల్లించాలని ఓ డ్రైవర్ ఆందోళన వ్యక్తం చేయటం గమనార్హం.
తిరుపతి ప్రతిష్ట దెబ్బతీస్తున్న కూటమి కుమ్ములాటలు
తిరుపతిలో దోపిడీయే ధ్యేయంగా కూటమి నేతలు గూండాలుగా గ్రూపులు కడుతూ అరాచకాలతో బాహాటకంగా ఘర్షణలకు పాల్పడుతూ తిరుపతి ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని వైఎస్సార్ సీపీ నేతలు ధ్వజమెత్తారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆరే.అజయ్‌కుమార్, జిల్లా అధికార ప్రతినిధి పసుపులేటి సురేష్, వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసుయాదవ్ మాట్లాడుతూ తిరుపతిలో కూటమి నేతల గూండాగిరి తీరుపై తీవ్ర స్థాయిలో ఉందని ధ్వజమెత్తారు. తిరుపతిలో కూటమి పార్టీల నేతలు బహిరంగ బాహాబాహిగా తలపడుతున్న సంఘటనలతో నగరంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి చేస్తారనే నమ్మకంగా ఓట్లు వేసి అధికారం కట్టపెడితే అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి తమ స్వార్థ సంపాదనల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ, ప్రధానంగా జనసేన నేతలు క్షేత్రస్థాయిలో చిరు వ్యాపారాలు చేసుకునే వారి నుంచి వసూళ్లు, భూ దందాలు, వివాదస్పద స్థలాలకు సంబంధించి సెటిల్‌మెంట్ల వంటి వ్యవహారాల్లో వాటాల్లో తేడాలు రావడంతో వారికి వారే గొడవలకు దిగుతూ ప్రజల్ని భయాందోళనలకు గురి చేస్తున్నారని తెలిపారు. నగరంలో గత 18 నెలలుగా కూటమి నేతలు బరి తెగించి చేస్తున్న సిగ్గుమాలిన చర్యలకు దిగుతూ రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని సాగిస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం రాత్రి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ప్లెక్సీల విషయంలో టీడీపీ, జనసేన నేతలు బహిరంగంగా కొట్టుకోవడం చూసిన ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేసిందని తెలిపారు. అక్కడ బహిరంగంగా ఘర్షణలకు దిగుతూ తాము ఎమ్మెల్యే అనుచరులమని బాహాటకంగా చెప్పుకోవడం బరితెగింపు కాదా అని ప్రశ్నించారు. తిరుపతిలో సనాతన ధర్మం గురించి ప్రబోధించిన పవన్ కల్యాణ్ ప్రస్తుతం తిరుపతిలో జరుగుతున్న పరిణామాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి నేతలు వర్గాలుగా విడిపోయి రౌడీయిజం చేసే వారిని వెంటబెట్టుకుని తమ కార్యకలాపాలు జరుపుకోవడంతో నగర ప్రజలు గొడవలు ప్రత్యక్షంగా చూసే పరిస్థితి దాపురించిందన్నారు. ఈ సమావేశంలో కార్పొరేట్ కోటూరి ఆంజనేయులు, వైఎస్‌ఆర్‌సీపీ నేతలు కోటి, అమరనాథ్‌రెడ్డి, తాళ్లపాక మహేష్ పాల్గొన్నారు.


