పేట..ఏటోత్సవంతో శోభిల్లే
స్వర్ణముఖి నది వద్ద సందడే సందడి రెండో రోజు పోటేత్తిన జనాలు
నాయుడుపేటటౌన్: సంక్రాంతి పండగలను పురస్కరించుకుని నాయుడుపేట స్వర్ణముఖి నదిలో జరుగుతున్న ఏటి పండగ వేడుకల్లో రెండో రోజు శనివారం కూడా జనాలు పోటెత్తారు. నది వద్దకు అధిక సంఖ్యలో జనాలు తరలివచ్చి ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ కనిపించారు. పట్టణం నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వేలాది మంది హాజరై ఏటోత్సవంలో పాల్గొని, సందడి చేశారు. నది వద్ద చిన్ననాటి స్నేహితుల పలకరింపులు, కొత్తగా పెళ్లయిన యువజంటల కేరింతలు, మహిళల ఆటల పోటీలు, చిన్నారులు సందడి చేస్తు కనిపించారు. నది వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఉన్న దుకాణాలు, రంగుల రాట్నాలు తదితర ప్రాంతాల వద్ద జనాలు ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు. చిన్నారులు పోటాపోటీగా గాలిపటాలను ఎగురవేస్తూ ఎంతో ఆనందంగా కనిపించారు. నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో సీఐ బాబి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఉల్లాసంగా... ఉత్సాహంగా....
ఏటి పండగ సంధర్భంగా శనివారం రాత్రి ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రజలు ఉల్లాసంగా..ఉత్సాహంగా గడిపారు. నిస్సీ ఈవెంట్స్‌కు చెందిన మేర్లపాక హరి అర్గనైజేషన్ వారు రాత్రి ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ప్రముఖ యాంకర్లు, బుల్లితెర నటులు తదితరులు చేసిన సందడి అందరిని ఆకట్టుకుంది. పలువురు చిన్నారులు చేసిన భారత నాట్యం, సాంస్కృతిక కార్యక్రమాలను ఆకర్షిణీయంగా నిలిచింది. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులూల్లా , మేనేజర్ ఉరుకుందమ్మ, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పేట..ఏటోత్సవంతో శోభిల్లే


