కోడెగిత్తల జోరు.. యువత హుషారు
చంద్రగిరి: మండలంలోని దోర్నకంబాల, మండపంపల్లి, మల్లయ్యపల్లి గ్రామాల్లో శనివారం పశువుల పందేలు(జల్లికట్టు)ను ఘనంగా నిర్వహించారు. పశువుల యజమానులు ఎడ్ల కొమ్ములకు రంగులు వేసి, నడుముకు నల్లధారం కట్టి, వాటి కొమ్ములకు పలకలను కట్టి సిద్ధం చేశారు. ఒక్కసారిగా ఎడ్లను బరికిలోకి ఉసిగొల్పడంతో పరుగులు తీసిన ఎడ్లను నిలువరించేందుకు యువకులు పోటీ పడ్డారు. అయితే మదమెక్కిన ఎడ్లను నిలువరించేందుకు యువకులు పోటీ పడినా అవి లెక్క చేయకుండా జనం మధ్య దూసుకెళ్లాయి. కొంత మంది యువకులు ఎడ్లను నిలువరించి వాటి కొమ్ములకు కట్టిన పలకలను సొంత చేసుకుని విజయ గర్వంతో ఊగిపోయారు.
ప్రత్యేక ఆకర్షణగా వైఎస్ జగన్ దళపతి
కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్న ప్రజల్లో మాత్రం వైఎస్సార్‌సీపీపై అభిమానం ఇసుమంతైనా తగ్గలేదు. మల్లయ్యపల్లి నుంచి మండపంపల్లి వరకు ఎక్కడ చూసిన వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలు, నేతల ఫొటోలతో స్వాగత తోరణాలే కనిపించాయి. మల్లయ్యపల్లిలో బీసీ నేత బొమ్మగుంట రవికు చెందిన కోడెగిత్త ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కోడెగిత్తను ఏర్పాటు చేసేందుకు సుమారు రూ.లక్ష వెచ్చించి ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేశారు. వివిధ రకాల పుష్పగుచ్చాలతో మండపాన్ని అలంకరించడంతో పాటు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటోలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్ ఫొటోతో కూడిన దళపతి పలకను ఎద్దు కొమ్ములకు కట్టి, ప్రదర్శనగా నిలిచారు. ఎద్దును చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఆపై బరిలోకి దిగిన కోడెగిత్తను పట్టుకోవడానికి యువకులు పోటీ పడినా, నిలువరించడంలో విఫలమయ్యారు.
కోడెగిత్తల జోరు.. యువత హుషారు
కోడెగిత్తల జోరు.. యువత హుషారు


