అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
చంద్రగిరి: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం మండలంలోని ఏ.రంగంపేటలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మునిరత్నం(46) తోపుడు బండిపై పానీపూరి విక్రయించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మునిరత్నానికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో మూడు నెలల కిందట మునిరత్నం భార్య తన భర్తను వదిలేసి, పెద్ద కుమార్తెను తీసుకుని వెళ్లిపోయింది. దీంతో తీవ్ర వేదనకు లోనైన మునిరత్నం మద్యానికి బానిసగా మారాడు. తన భార్య వదిలి వెళ్లిపోవడంతో నిత్యం మద్యం సేవించి తీవ్ర మనోవేదనకు లోనవుతూ వచ్చాడు. ఈ క్రమంలో గురువారం తన భార్య తిరిగి ఏ.రంగంపేటకు వచ్చింది. ఇంటికి వెళ్లిన కాసేపటికి మునిరత్నం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ రవిప్రకాష్ రెడ్డి క్లూస్‌టీం సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికళ్ కళాశాలకు తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ తెలిపారు.


