యువకుడి ఆత్మహత్య
వాకాడు: మండలంలోని వెంకటరెడ్డిపాళెంకు చెందిన యువకుడు విషపు గుళికలు తిని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన చెరుకూరు రామారావు(35) భార్య వివిధ కారణాలతో పిల్లలను తీసుకుని రెండు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. రామారావు పలుమార్లు పిలిచినా భార్య కాపురానికి రాలేదు. దీంతో మనస్తాపం చెందిన అతను గురువారం రాత్రి విషపు గుళికలు తిన్నాడు. అస్వస్థతకు గురైన అతన్ని కుటుంబ సభ్యులు నెల్లూరులోని ఒక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరిస్థితి విషమించి శుక్రవారం మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ
● వ్యక్తికి తీవ్ర గాయాలు
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్) : రేణిగుంట మండలం కేఎల్‌ఎం హాస్పిటల్ కూడలిలో శుక్రవారం రాత్రి తమిళనాడుకు చెందిన వ్యక్తి ద్విచక్ర వాహనంపై వస్తుండగా లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో లారీ డ్రైవర్ పరారు కాగా లారీని, క్లీనర్‌ను అదుపులోకి తీసుకొని రేణిగుంట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గాయాలైన వ్యక్తిని విమానాశ్రయం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
టీటీడీకి పది టన్నుల కూరగాయలు
పలమనేరు: పట్టణానికి చెందిన మార్కెట్ మండీ యజమాని ఓకేఆర్ రెడ్డెప్పరెడ్డి టీటీడీ నిత్యాన్నదాన సత్రానికి పది టన్నుల వివిధ రకాల కూరగాయలను టీటీడీ ప్రత్యేక వాహనంలో స్థానిక మార్కెట్ నుంచి శుక్రవారం పంపించారు. ఈ సందర్భంగా ఆ వాహనంలో కూరగాయలు నింపి, పూజలు చేసి, గోవిందనామ స్మరణల నడుమ వాహాన్నిన్ని తిరుమలకు పంపారు. ఇందులో స్థానిక శ్రీవారి సేవకుడు కాబ్బల్లి రవీంద్రారెడ్డితోబాటు ఆయన మిత్రబృందం పాల్గొన్నారు.
కాణిపాకంలో పోటెత్తిన భక్తులు
కాణిపాకం: వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో శుక్రవారం భక్తులు పోటెత్తారు, సెలవు దినం కావ డంతో ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీ కొనసాగింది. ఉచిత, శీఘ్ర, అతి శీఘ్రదర్శనంతో పాటు వీఐపీ దర్శన క్యూలు భక్తులతో కిటకిటలాడాయి. దర్శన ఏర్పాట్లను ఆలయాధికారులు పర్యవేక్షించారు.
ప్రబంధకారణి కమిటీ ఎంపిక
శ్రీకాళహస్తి: పట్టణంలోని సరస్వతి శిశుమందిర్‌లో నూతన ప్రబంధకారిణి కమిటీని శుక్రవారం ఎంపిక చేశారు. జిల్లా అధ్యక్షుడు గల్లా సురేష్, కార్యదర్శి రవికుమార్ పాఠశాల నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. కమిటీ మూడేళ్ల పాటు కొనసాగుతుందన్నారు. పాఠశాల అభివృద్ధికి ఈ కమిటీ సహకరించాలని వారు కోరారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు మంగిరెడ్డి, సుబ్రహ్మణ్యంరెడ్డి, ఉమాశంకర్, ప్రకాష్, సోమశేఖర్‌రెడ్డి, పద్మావతి, పుష్పలత, డాక్టర్ లక్ష్మీనారాయణ, రాజేష్, నాగేశ్వరరావు, కమిటీ సభ్యులు, మాతాజీ (ఉపాధ్యాయులు) పాల్గొన్నారు.


