సీఐ సార్‌ చొరవ.. కేంద్రం మెచ్చిన చంద్రగిరి ఠాణా | Sakshi
Sakshi News home page

సీఐ సార్‌ చొరవ.. కేంద్రం మెచ్చిన చంద్రగిరి ఠాణా

Published Tue, Jul 18 2023 4:30 AM

నేమ్‌ బోర్డులను ఏర్పాటు చేసిన చంద్రగిరి పోలీస్‌ స్టేషన్‌  - Sakshi

నాడు: చుట్టూ ముళ్లపొదలు.. ఏ మూల చూసినా పాముల పుట్టలు.. దశాబ్దాలుగా గుట్టలుగా పడి శిథిలావస్థకు చేరుకున్న వాహనాలు.. అస్తవ్యస్త పార్కింగ్‌.. కళావిహీనంగా చెట్లు.. సరైన బోర్డు కూడా లేని పోలీస్‌ స్టేషన్‌...రంగులు వెలిసి పాత భవనాలను తలపించే దుర్గంధంతో సిబ్బంది ఇబ్బందిగా పనిచేసేవారు. అస్తవ్యస్తంగా ఉండేది తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్‌ స్టేషన్‌.

నేడు : ఒక అధికారి బదిలీపై అక్కడికి వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కేవలం 20 రోజుల్లోనే స్టేషన్‌ రూపురేఖలు మార్చారు. భవనాలకు అందమైన రంగులు వేయించా డు. ప్రాంగణంలో పిచ్చి మొక్కలను తీయించాడు. చెట్లను ట్రిమ్మింగ్‌ చేయించారు. వాహనాలను స్టేషన్‌ వెనుక పార్కింగ్‌ చే యించారు. స్టేషన్‌కు వచ్చేవారు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేలా చిన్నసైజు పార్క్‌ను తీర్చిదిద్దారు. స్టేషన్‌లో రికార్డు రూమును డిటలైజ్‌ చేసి అందమైన ర్యాక్‌లతో వాటిని ముస్తాబు చేశారు. సిబ్బందికి విశ్రాంతి గదినీ ఏర్పాటు చేశారు.

తిరుపతి రూరల్‌: చంద్రగిరి పీఎస్‌లో నూతనంగా సీఐగా బాధ్యతలు స్వీకరించిన రాజశేఖర్‌ స్టేషన్‌ రూపురేఖలను మార్చేశారు. ఇది చూసి చంద్రగిరి డీఎస్పీ యశ్వంత్‌, తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి ఆయన్ను అభినందించారు. రాష్ట్ర డీజీపీ ద్వారా సమాచారం అందుకున్న ఢిల్లీకి చెందిన బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌(బీపీఆర్‌డీ) బృందం ఇటీవల చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించింది.

స్టేషన్‌ ప్రాంగణం, వివిధ సమస్యలపై వచ్చే అర్జీదారులకు అందిస్తున్న సేవలు, రికార్డుల మెయింటెనెన్స్‌ వంటి అంశాలను పరిశీలించింది. ఇతర స్టేషన్లతో పోల్చితే ఇక్కడ ఏర్పాట్లు, పరిసరాల శుభ్రత, రికార్డుల నిర్వహణ భేషుగ్గా ఉన్నాయని బీపీఆర్‌డీ బృందం పర్యవేక్షణాధికారి బాలచంద్రన్‌ చంద్రగిరి సీఐ రాజశేఖర్‌ను అభినందించారు. త్వరలో బీపీఆర్‌డీ జాతీయస్థాయిలో పోలీస్‌ స్టేషన్లకు ర్యాంకులు కేటాయించనున్నారు.

అయితే అద్భుతంగా తీర్చిదిద్దిన చంద్రగిరి పోలీస్‌ స్టేషన్‌కు అత్యత్తుమ ర్యాంకు వచ్చే అవకాశం ఉందని తిరుపతి జిల్లా పోలీస్‌ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మనసు పెడితే స్టేషన్లను అద్భుతంగా తీర్చిదిద్దవచ్చని నిరూపించిన సీఐ రాజశేఖర్‌ను పలువురు పోలీస్‌ అధికారులు అభినందిస్తున్నారు.

Advertisement
Advertisement