రైతులు ఫ్రంట్‌లైన్‌ వారియర్లు కాదా

Workshop On Agriculture Held In Hyderabad - Sakshi

రైతు నేతలు, మేధావుల ప్రశ్న

పంటలను ఎగుమతి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే

రైతు సమస్యలపై త్వరలో కార్యాచరణ 

భారతీయ రైతుసంఘాల కూటమి ఆధ్వర్యంలో జాతీయ వర్క్‌షాప్‌  

సాక్షి, హైదరాబాద్‌: వరి ఎగుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భారతీయ రైతు సంఘాల కూటమి (సిఫా) ఆరోపించింది. తెలంగాణలో యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయబోమని చెప్పడం... రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల ను వరి వేయొద్దని చెప్పడంతో సమస్య మొదలైం దని స్పష్టం చేసింది. ఒకప్పుడు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కరువు కాటకాలు ఉండగా ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టుల వల్ల నీటి వసతి ఏర్పడిందని వెల్లడించింది.

దీంతో వరివైపు రైతులు మళ్లారని సిఫా వివరించింది. కరోనా కాలంలో ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు అంటూ వైద్య సిబ్బంది, పోలీసులు తదితరులను గుర్తించారే కానీ రైతులను ఆ కేటగిరీలో చూపించలేదని విమర్శించింది. సిఫా ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో ‘అగ్రికల్చర్‌ యాజ్‌ ఫోకస్‌ ఏరియా ఆఫ్‌ రీజినల్‌ అప్రోచెస్‌ ఫర్‌ నేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఎజెండా’ అంశంపై జాతీయ వర్క్‌షాప్‌ జరిగింది. ఈ వర్క్‌షాప్‌కు సిఫా ముఖ్య సలహాదారు పి.చెంగల్‌రెడ్డి, ప్రొఫెసర్‌ దేవీప్రసాద్‌ జువ్వాడి సంధానకర్తలుగా వ్యవహరించారు. 

సాగుకు మద్దతేదీ..? 
వ్యవసాయం రాష్ట్ర జాబితాలో ఉన్నా ధాన్యం సేకరణ, ఎగుమతులు కేంద్రం చేతిలో ఉన్నాయని చెంగల్‌రెడ్డి తన ప్రసంగంలో పేర్కొన్నారు. కేంద్రం కరోనా సమయంలో పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహకాలు ఇచ్చిందే తప్ప వ్యవసాయానికి మద్దతివ్వలేదన్నారు. డాక్టర్లు, శాస్త్రవేత్తలకు ఉన్న గౌరవం వ్యవసాయాధికారులకు లేదన్నారు. కేంద్రం వ్యవసాయ విధానాల్లో విఫలమైందన్నారు. తెలంగాణ రైతులకు సంబంధించి కేంద్రం బాధ్యత వహించాలన్నారు. రైతు సమస్యలపై కార్యాచరణ రూపొందిస్తామన్నారు.

వరిపై కేంద్రం వైఖరి సరికాదు: బి. వినోద్‌ 
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ ఫోన్‌ ద్వారా తన సందేశం వినిపిస్తూ కేంద్రం వరి కొనుగోలు విషయంలో అనుసరిస్తున్న వైఖరి సరైంది కాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం అనేక రంగాల్లో ముందుకు సాగుతోందని, వైద్య రంగంలో కేరళ, తమిళనాడు తర్వాత తెలంగాణ మూడో స్థానంలో ఉందన్నారు. ‘సాక్షి’ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ ఆర్‌.దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో బ్యాంకులు ప్రైవేటీకరణ బాటపడితే రైతులకు రుణాలు కలగానే మిగులుతుందన్నారు.

సంప్రదాయ పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమ్మిళితం చేస్తేనే వ్యవసాయ రంగం బాగుంటుందన్నారు. స్వామినాథన్‌ సిఫార్సులను అమలు చేయాలన్న తీర్మానం చేయాల్సిన అవసరం ఉందని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.

పాలీహౌస్‌ పద్ధతిలో వ్యవసాయం చేసినా ప్రభత్వం రుణాలు, వడ్డీ రాయితీ కల్పించకపోవడంతో సమస్యలు వస్తున్నాయని రైతు రఘురాంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వర్క్‌షాప్‌లో వార్త ఎడిటర్‌ సాయిబాబా, ఆలిండియా అగ్రికల్చర్‌ స్టూడెంట్‌ అసోసియేషన్‌ నేత సాయికాంత్, సిఫా తెలంగాణ అధ్యక్షుడు సోమశేఖర్‌రావు ప్రసంగించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top