Panchayat Secretary: ఉద్యోగమా.. చాకిరా?

Woman Panchayat Secretary Employee Facing Problems In Karimnagar - Sakshi

ఆమె ఓ పంచాయతీ కార్యదర్శి. ఇద్దరు పిల్లల తల్లి. చీకటిలోనే పనులు ముగించు  కున్నారు. ఈలోపు భారీ వర్షం. అయినా.. తడుస్తూనే విధులకు వెళ్లారు. కార్యాలయానికి చేరుకొని ఫొటో తీసుకుని యాప్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఇదంతా ఎందుకంటే     కేవలం అటెండెన్స్‌ కోసమే.

సాక్షి, కరీంనగర్‌: ఉదయాన్నే 8 గంటలకు విధుల్లో చేరామన్న సందేశం చేరితేనే ఆ రోజు పనిచేసినట్లు లెక్క. పోనీ అంత ఉదయం వెళ్లినా.. ఎప్పుడు తిరిగి వస్తారో తెలియనంతగా పనులు. ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో తీవ్ర పని ఒత్తిడి మధ్య పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులకు పల్లెప్రగతి యాప్‌ వచ్చాక వేధింపులు పెరిగిపోయాయి. ముఖ్యంగా తాము ఉదయాన్నే అది కూడా ఉదయం 8 గంటల్లోపే గ్రామపంచాయతీ కార్యాలయాన్ని చేరుకొని, కార్యాలయం కనిపించేలా సెల్ఫీ తీసుకుని దాన్ని అప్‌లోడ్‌ చేయాలి.

ఏదైనా కారణం చేత కాస్త లేటైనా.. ఆ రోజు జీతం హుష్‌కాకి. ఇటీవల బుగ్గారంలో ఓ ఎంపీడీవో తన పరిధిలోని తొమ్మిది మంది పంచాయతీ కార్యదర్శులకు మెమో జారీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. తాను వాట్సాప్‌ గ్రూపులో పెట్టిన సందేశానికి స్పందించలేదన్న కారణానికే ఆగ్రహించిన అధికారి ఏకంగా 9 మందికి మెమో జారీ చేశారు. ఈ విషయం పలువురు నెటిజన్లు మంత్రి కేటీఆర్‌కు, జగిత్యాల కలెక్టర్‌ రవి దృష్టికి తీసుకెళ్లారు.

సెల్ఫీ తీసుకుంటేనే మస్టర్‌..

► ఉదయాన్నే ఎనిమిది గంటలకు పంచాయతీ కార్యాలయానికి రావాలి. అక్కడ జీపీ లైవ్‌ లొకేషన్‌తోపాటు, లాంగిట్యుడ్, లాటిట్యూడ్‌ వివరాలు, పంచాయతీ భవనం కనిపించేలా సెల్ఫీ దిగి పల్లె ప్రగతి పీఎస్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి.
 పల్లెప్రగతి పీఎస్‌ యాప్‌.. ఎంపీవో (మండల పంచాయతీ ఆఫీసర్‌) అనే రెండు రకాల లాగిన్‌లు పంచాయతీ కార్యదర్శులకు ఉంటాయి. ప్రతీ పంచాయతీ కార్యదర్శి విధిగా రోజూ రెండు కాలువలు, రెండు రోడ్లు, ఏదైనా ఒక ప్రభుత్వ సంస్థల భవనాలను క్లీన్‌ చేయించాలి. 
 ఈ ఐదు పనులకు సంబంధించి ఐదు ఫొటోలు విత్‌ డేట్‌ అండ్‌ టైం ప్రకారం.. అప్‌లోడ్‌ చేస్తేనే ఆ రోజు పనిచేసిట్లు లెక్క. ఈ విధంగా నెలలో మొత్తం 24 పనిదినాలు ఇదే రకంగా విధులు నిర్వహించాలి. పాత ఫొటోలు అప్‌లోడ్‌ కావు.
 దీనికితోడు వీధి బల్బులు మార్చడం, ఇళ్ల నుంచి చెత్త సేకరణ వివరాలు కూడా రోజూ రిపోర్టు అప్‌లోడ్‌ చేయాలి.
► ఏ ఉద్యోగికైనా ఇంట్లో కనీస బాధ్యతలు ఉంటాయి. పిల్లలను స్కూలుకు పంపడం, మహిళలైతే ఇంట్లో వంట, పిల్లలు తదితర పనులు ఉంటాయి. కానీ.. కొత్త నిబంధన కారణంగా ఉదయాన్నే 7 గంటలకు బయల్దేరాలి. పిల్లలు నిద్రలేవక ముందే వదిలేసి రావడం చాలా బాధగా ఉందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
► పోనీ, 5 గంటలకు ఉద్యోగం ముగుస్తుందా.. అంటే అదీ లేదు. వీడియో కాన్ఫరెన్స్‌లు, టెలీకాన్ఫనెన్స్‌లు జరిగితే గంటల కొద్దీ సమయంపాటు అక్కడే ఉండాలి. అవి పూర్తయ్యాక ఏ అర్ధరాత్రో అపరాత్రో ఇల్లు చేరాలి. మళ్లీ ఉదయాన్నే విధులకు హాజరవ్వాలి.
► పంచాయతీ కార్యదర్శులపై మండలస్థాయిలో ఎంపీవో, ఎంపీడీవో, డివిజనల్‌ స్థాయిలో డీఎల్‌పీవో, ఏపీడీ, పీడీ జిల్లాస్థాయిలో ఏపీవో, డీపీవో వరకు ఇంతమంది సూపర్‌విజన్‌ ఉంటుంది. వీరందరూ ఏం పనిచెప్పినా ఎదురుచెప్పకుండా చేయాల్సిందే. 
 ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి. జనన మరణ రికార్డులు, ఇంటి పన్నులవసూళ్లు, రెవెన్యూ రికార్డుల నమోదు, పరిపాలనపరమైన విధులన్నీ వీరే నిర్వహించాలి.
►  పొరపాటున ఎదురుతిరిగినా, చేయలేమని చెప్పినా, టైమ్‌కు విధులకు రాలేకపోయినా మెమోలు జారీ చేస్తూ మానసికంగా తీవ్రంగా వేధిస్తున్నారు.
  హరితహారం మొక్కలు పెరగకపోయినా, ఊర్లో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ వేసుకోకపోయినా, చిన్న చెత్త కనిపించినా వెంటనే మెమో జారీ చేస్తారు.
►  ఇవి చాలవన్నట్లుగా గ్రామంలో సర్పించి, వార్డుమెంబర్లు, ప్రతిపక్ష నాయకులు, ఊర్లో ఉన్న పెద్దమనుషులు అంతా ప్రతీ పనికి వీరి మీదే పడుతున్నారు. 
►  ఈ ఉద్యోగాలు చేస్తున్న వారిలో దాదాపు 99 శాతం మంది పీజీలు చదివిన వారే. కరోనాకు ముందు ఈ ఉద్యోగాన్ని చాలామంది మానేద్దామనుకున్నారు. కానీ.. బయట కూడా పరిస్థితి బాగాలేకపోవడంతో విధిలేక ఈ కొలువులోనే కొనసాగుతున్నారు. 

చదవండి: 50 వేల టీచర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వాలి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top