మళ్లీ ‘కు.ని.’ కలకలం.. పేట్ల బురుజు ఆసుపత్రిలో ఘటన? | Sakshi
Sakshi News home page

Hyderabad: మళ్లీ ‘కు.ని.’ కలకలం.. పేట్ల బురుజు ఆసుపత్రిలో ఘటన?

Published Fri, Sep 9 2022 1:14 AM

Woman Dies In Osmania Hospital After Giving Birth - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/దూద్‌బౌలి/షాద్‌నగర్‌రూరల్‌: పేట్లబురుజు ప్రభుత్వ ఆధునిక ప్రసూతి ఆసుపత్రిలో డెలివరీ కోసం వచ్చిన మహిళ ప్రసవానంతరం తీవ్ర అనారోగ్యంతో ఉస్మానియా ఆసుపత్రిలో మృతి చెందింది. దీంతో బంధువులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ వికటించి మృతి చెందిందంటూ గురువారం అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే మహిళకు సిజేరియన్‌ మాత్రమే జరిగిందని, కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయలేదని ఆస్పత్రి వైద్యులు, ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నం ఘటన మరవకముందే ఈ ఉదంతం చోటు చేసుకోవడం కలకలం సృష్టించింది. వివరాలు ఇలా ఉన్నాయి.  

రెండురోజులు ఆరోగ్యంగానే.. 
రంగారెడ్డి జిల్లా ఫారూఖ్‌నగర్‌ మొగలిగిద్ద గ్రామానికి చెందిన సురేందర్‌ భార్య అలివేలు (26) ఈ నెల 4వ తేదీన  ప్రసవం కోసం పేట్లబురుజు ప్రభు త్వ ఆసుపత్రిలో చేరింది. అదే రోజు సాయంత్రం ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. శిశువు కాళ్లు అడ్డం తిరిగి ఉండటంతో వై ద్యులు సిజేరియన్‌ ఆపరే షన్‌ నిర్వహించగా మగ శిశు వుకు జన్మనిచ్చింది. ప్రసవానంతరం 2 రోజులు ఆరోగ్యంగానే ఉన్న అలివేలుకు జ్వరం వచ్చి తగ్గింది.

7వ తేదీన తిరిగి జ్వరం, వాంతులు, విరోచనాలతో తీవ్ర అనారోగ్యానికి గు రి కావడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించా రు. అక్కడ చికిత్స పొందుతూ అదేరోజు సాయంత్రం మృతి చెందింది. అయితే పేట్లబురుజు ఆసు పత్రిలో సిబ్బంది.. ప్రసవానంతరం అలివేలుకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేసేందుకు భర్త సంతకాలు తీసుకోవడంతో, ఆ ఆపరేషన్‌ వల్ల నే ఆమె మరణించిందంటూ బంధువులు ఆ ఆసుపత్రి వైద్యులను నిలదీశారు. 

కు.ని ఆపరేషన్‌ జరగలేదు: ఆసుపత్రి సూపరింటెండెంట్‌  
అలివేలుకు వైద్యులు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించారని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మాలతి తెలిపారు. ప్రసవానంతరం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని, అలివేలుకు కు.ని శస్త్రచికిత్స చేయలేదని స్పష్టం చేశారు. అయితే రెండురోజుల తర్వాత అనారోగ్యానికి గురైందని, ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వివరించారు.

అలివేలుకు కోవిడ్‌ పరీక్ష కూడా నిర్వహించగా నెగెటివ్‌ వచ్చినట్లు తెలిపారు. అదే రోజు 40 ప్రసవాలు కాగా.. అందులో 16 ఆపరేషన్లు జరిగినట్లు ఆమె తెలిపారు. అలివేలు మృతికి వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణం అయి ఉండవచ్చునని ఉస్మానియా వైద్యులు పేర్కొన్నారు. మహిళ మృతి కలకలం సృష్టించడంతో గురువారం డీఎంఈ రమేశ్‌రెడ్డి ఆసుపత్రిని సందర్శించి వైద్యులతో మాట్లాడారు. 

కు.ని ఆపరేషన్‌ కారణం కాదు 
ఆ మహిళ డెలివరీ కోసం ఆసుపత్రిలో జేరింది. సిజేరియన్‌ సెక్షన్‌లో వైద్యులు ఆపరేషన్‌ చేశారు. అంతే తప్ప ఆమెకు కు.ని ఆపరేషన్‌ చేయలేదు. అయితే రెండవరోజు కొన్ని అనారోగ్య సమస్యలు రావడంతో ఉస్మానియాకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.      
– డా.కె.రమేశ్‌రెడ్డి, వైద్య విద్య సంచాలకుడు 

Advertisement
Advertisement