
అసభ్యకరంగా ప్రవర్తించిన పైఅధికారి
పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి..కేసు నమోదు
బంజారాహిల్స్: కూతురిలా ఉన్నావని ప్రారంభంలో మర్యాదగా మాట్లాడి.. చనువు పెంచుకుని మెల్లమెల్లగా తన దుర్బుద్ధిని బయటపెట్టిన సీనియర్ అధికారిపై ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. మైండ్‌స్పేస్‌లోని ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలో హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్న యువతి (26)కి తన పైఅధికారిగా పనిచేస్తున్న మృణాల్‌దాస్ (51)తో పరిచయం ఏర్పడింది. తరుచూ ఇద్దరూ మాట్లాడుకుంటూ పరిచయం పెంచుకున్నారు. తన కుమార్తెలా ఉన్నావంటూ మృణాల్‌దాస్ మొదట్లో ఆత్మయంగా వ్యవహరించేవాడని బాధిత యువతి పేర్కొంది.
ఈ ఏడాది జులై 5వ తేదీన ఆమె మృణాల్‌దాస్‌తో కలిసి జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–72లో ఉన్న ది స్విఫ్ట్ ఎలిమెంట్ స్పాకు వెళ్లినట్లు తెలిపింది. పురుషులు, మహిళలకు వేర్వేరు గదులు ఉన్నాయని చెప్పడంతో తాను వెళ్లగా తనకు మసాజ్ చేస్తున్న సమయంలో నిద్రలో ఉండగా ఒక దశలో వెనుక నుంచి వేరొకరి చేతులు తగిలాయని, గమనించి చూసేసరికి మృణాల్‌దాస్ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని గుర్తించానంది. తనపై అనుచితంగా ప్రవర్తిస్తూ అసభ్యకరంగా మాట్లాడుతుండటంతో తాను అరిచి మందలించానని తెలిపింది. ఆయన గది నుంచి వెళ్లిపోయినప్పటికీ మళ్లీ రావాలని ప్రయత్నించాడని ఆరోపించింది.
ఇటీవల ఆయన లండన్‌కు వెళ్లడం జరిగిందని, అక్కడి నుంచి కూడా వీడియో కాల్ ద్వారా అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపించింది. ఈ సంఘటనను తాను పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ సంస్థ హెచ్‌ఆర్ టీమ్‌కు కూడా తెలియజేశానని పేర్కొంది. తన భద్రత పట్ల భయంగా ఉందని, ఆయన మళ్లీ వేధించే అవకాశం ఉందంటూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. జూబ్లీహిల్స్ పోలీసులు మృణాల్‌దాస్‌పై బీఎన్‌ఎస్ సెక్షన్ 75 (1) (ఐ) (2), 78 (1)(ఐఐ)(2), 79 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.