బీఏసీ సమావేశంలో స్పీకర్ ప్రసాద్‌కుమార్, శ్రీధర్‌బాబు, భట్టి, పొన్నం, హరీశ్, మహేశ్వరరెడ్ది, అక్బరుద్దీన్ తదితరులు
బీఏసీ భేటీలో స్పీకర్ ప్రకటన!
అవసరమైతే మరో వారం పొడిగిస్తామని వెల్లడి
కానీ 2, 3, 5 తేదీల్లో మరో 3 రోజులు నిర్వహణకు మాత్రమే సర్కారు సుముఖత?
సమావేశాల నిర్వహణ తీరుపై బీఏసీ భేటీలో సుదీర్ఘ చర్చ
15 రోజుల పాటు జరపాలని బీఆర్‌ఎస్ పట్టు
వీలైనన్ని ఎక్కువ రోజులు జరపాలన్న బీజేపీ, ఎంఐఎం
కృష్ణా నదీ జలాలు, ఈజీఎస్ పేరు మార్పుపై చర్చించే అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలను వారం రోజుల పాటు నిర్వహించాలని సోమవారం జరిగిన అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అవసరమయ్యే పక్షంలో మళ్లీ బీఏసీ సమావేశం నిర్వహించి మరో వారం పాటు పొడిగించాలని భావిస్తున్నట్లు తెలిసింది.
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన సోమవారం బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. స్పీకర్ చాంబర్‌లో ఆయన అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు టి.హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో పాటు అసెంబ్లీ కార్యదర్శులు రెండ్ల తిరుపతి, నరసింహాచార్యులు పాల్గొన్నారు.
ఎన్ని రోజులు నిర్వహిద్దాం..?
శాసనసభ నిర్వహణ తీరుతెన్నులతో పాటు సభను ఎన్ని రోజుల పాటు జరపాలనే అంశంపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని బీఆర్‌ఎస్ పట్టుబట్టింది. బీజేపీ, ఎంఐఎం నేతలు కూడా సభను వీలైనన్ని ఎక్కువ రోజులు నిర్వహించాలని కోరారు. అయితే బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పాటించిన సభా సంప్రదాయాలను కొనసాగిస్తున్నామని ప్రభుత్వం వాదించగా, బీజేపీ, ఎంఐఎం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.
కాగా సమావేశాలు వారం రోజుల పాటు నిర్వహించి, అవసరమైన పక్షంలో మరో వారం పొడిగిస్తామని స్పీకర్ ప్రకటించారు. అయితే జనవరి 2, 3, 5 తేదీల్లో మరో 3 రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. ఈ 3 రోజుల పాటు జరిగే సమావేశాలకు సంబంధించిన షెడ్యూలు ఖరారు చేసి సభ్యులకు అందజేయనున్నారు.
ఎజెండాపైనా సుదీర్ఘ చర్చ
సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలకు సంబంధించిన ఎజెండాపై కూడా బీఏసీలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటా, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై చర్చను అధికార పక్షం ప్రతిపాదించినట్లు తెలిసింది. అయితే 15 అంశాలపై చర్చించాలని బీఆర్‌ఎస్, 23 అంశాలపై చర్చించాలని బీజేపీ ప్రతిపాదించాయి.
అయితే ప్రస్తుత సమావేశాల్లో బీఆర్‌ఎస్ ఇచ్చిన జాబితాలోని ఒకటి, రెండు అంశాలపై మాత్రమే చర్చించేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు తెలిసింది. నదీ జలాలపై చర్చ సందర్భంగా అధికార పక్షానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు అవకాశం ఇస్తే తమకు కూడా అవకాశం ఇవ్వాలని బీఆర్‌ఎస్ కోరింది. ఈ మేరకు స్పీకర్‌కు పార్టీ నేతలు లిఖిత పూర్వకంగా లేఖను సమర్పించారు.
ప్రతిరోజూ క్వశ్చన్ అవర్ ఉండాలి: హరీశ్‌రావు
బీఏసీ భేటీ ముగిసిన తర్వాత బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘నదీ జలాలపై పీపీటీ కోసం స్పీకర్‌ను కోరాం. ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సభ నిర్వహణపై మా అభిప్రాయాలను చెప్పాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో కేవలం ఆరు రోజులు మాత్రమే ప్రశ్నోత్తరాలు నడిచాయి. సమావేశాలు జరిగినన్ని రోజులు క్వశ్చన్ అవర్ నిర్వహించాలని కోరాం. అలాగే 2025లో కేవలం 15 రోజులు మాత్రమే సభ నడిచిందనే విషయాన్ని దృష్టికి తీసుకెళ్లాం. శాసనసభ కమిటీల ఏర్పాటు, ప్రోటోకాల్ ఉల్లంఘనల గురించి ప్రస్తావించాం. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డికి సమాచారం లేకుండా బాల్కొండలో అధికారికంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించడాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాం..’అని హరీశ్‌రావు తెలిపారు.
బీఆర్‌ఎస్ ప్రతిపాదించిన అంశాలు ఇవే..!
యూరియా కొరత, రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్, రైతు ఆత్మహత్యలు.. వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమల్లో వైఫల్యం, ఫ్యూచర్ సిటీ పేరిట భూములు ధారాదత్తం, కొత్త థర్మల్ ప్రాజెక్టుల్లో అవినీతి, బీసీలకు 42% రిజర్వేషన్లలో ప్రభుత్వ తప్పిదాలు, జాబ్ కేలండర్..ఉద్యోగ నోటిఫికేషన్లలో ఆలస్యం, ఉద్యోగుల సమస్యల పరిష్కారం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, హిల్ట్ పాలసీ, గురుకుల విద్యా సంస్థల్లో సమస్యలు, జీహెచ్‌ఎంసీలో మున్సిపాలిటీల విలీనం, హైడ్రా, ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్పు, శాంతిభద్రతలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చించాలని బీఆర్‌ఎస్ కోరింది.


