అత్తింటి ఎదుట ఇల్లాలు దీక్ష  

Wife Protest For Justice In Front Of Husband House In Warangal - Sakshi

సాక్షి, హన్మకొండ చౌరస్తా(వరంగల్‌): ‘నా భర్త నాకు కావాలి’అంటూ ఓ ఇల్లాలు అత్తింటి ఎదుట దీక్షకు దిగింది. వరంగల్‌ నగరంలోని పెరుకవాడకు చెందిన అనూషకు హన్మకొండ యాదవనగర్‌ కు చెందిన హేమంత్‌తో 2015 మార్చి 31న వివాహం జరిగింది. పెద్దల సమక్షంలో జరిగిన ఈ పెళ్లికి అనూష తల్లిదండ్రులు రూ.20 లక్షల నగదు, 50 తులాల బంగారాన్ని కట్నకానుకలుగా ఇచ్చారు. వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అయిన హేమంత్‌తో పెళ్లి అయిన తర్వాత బెంగళూరుకు వెళ్లారు. అక్కడ వారికి కొడుకు సాత్విక్‌ జన్మించాడు. అన్న, వదినల చెప్పుడు మాటలతో అనుమానం పెంచుకున్న హేమంత్‌.. కొడుకు సాత్విక్‌ తనకు పుట్టలేదంటూ అనూషను బెంగళూరు నుంచి వరంగల్‌కు పంపించాడు. అప్పటి నుంచి ఆమె కోర్టు ద్వారా పోరాటం చేస్తోంది.

కోర్టు అనుమతితో బాబుకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించగా.. హేమంత్‌ వారసుడే అని నివేదిక వచ్చింది. అయినా కోర్టు తీర్పును సైతం లెక్క చేయడం లేదని అనూష విలపిస్తోంది. తోటి కోడళ్లు, అత్తమామ, ఆడపడుచుల చెప్పుడు మాటలు విని తన భర్త దూరం పెడుతున్నాడని కన్నీటి పర్యంతమైంది. మూడు రోజులుగా భర్త ఇంటి ఎదుట న్యాయ పోరాటం చేస్తున్న అనూషకు పలు మహిళా సంఘాలు, టీఆర్‌ఎస్‌ నాయకులు మంచాల జ్యోత్స్న, తరాలపల్లి రాజమణి, కళ, ఆశ, జ్యోతి మద్దతుగా నిలిచారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top