
భర్త అంత్యక్రియలు నిర్వహిస్తున్న శ్యామల
కామారెడ్డి టౌన్: అనారోగ్యంతో కన్నుమూసిన భర్తకు అతని భార్య తలకొరివి పెట్టింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లికి చెందిన నాగల్ల రమేశ్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కాంపౌండర్‌గా పని చేస్తున్నాడు. ఈనెల 20న గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శస్త్రచికిత్స కోసం రూ.8 లక్షలు అవసరమని వైద్యులు చెప్పారు.
పేద కుటుంబానికి చెందిన రమేశ్ దుస్థితిపై ‘సాక్షి’ప్రచురించిన కథనానికి పలువురు స్పందించి ఆర్థిక సాయం అందించారు. కానీ అప్పటికే శస్త్రచికిత్స ఆలస్యం కావడంతో రమేశ్ శనివారం మరణించాడు. సంతానం ఇద్దరూ కూతుళ్లే కావడంతో భార్య శ్యామలే ఆదివారం దేవునిపల్లిలో భర్త చితికి నిప్పు పెట్టి అంత్యక్రియలు పూర్తి చేసింది.