‘తృణ’ధాన్యమే..! రాష్ట్రంలో అంతంతమాత్రంగానే సాగు

Whole Grains limited Cultivation In Telangana - Sakshi

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే దిగుబడుల్లో భారీగా వెనుకబాటు

గత నాలుగేళ్లుగా క్రమంగా పెరుగుతున్నా...  పొరుగుతో పోటీ కష్టమే

2017–18లో రాష్ట్రంలో సగటున 83.67 మెట్రిక్‌ టన్నుల దిగుబడి

ఆ తర్వాత క్రమంగా పెరిగి 2021–22 నాటికి 108.13 మెట్రిక్‌ టన్నులు

అత్యధికంగా రాజస్తాన్‌లో 4290 మెట్రిక్‌ టన్నుల తృణధాన్యాల దిగుబడి

సాక్షి, హైదరాబాద్‌: తృణ ధాన్యాలు...చిరు­ధాన్యాలుగా పేరొందిన వీటిలో ఎన్నో పోషకాలుంటాయి. కోవిడ్‌–19 తర్వాత పరిస్థితులతో వీటికి క్రమంగా డిమాండ్‌ పెరుగుతోంది. సమృద్ది పోషకాలతో పాటు రోగ నిరోదక శక్తిని పెంపొందించడం, జీర్ణవ్యవస్థను గాడిలో ఉంచడంతో పాటు మానవ శరీరానికి పలు రకాల మేలు చేయగల ఈ తృణధాన్యాల సాగు రాష్ట్రంలో మాత్రం అంతంతమాత్రంగానే ఉంది.

నాలుగైదేళ్లుగా ఈ ధాన్యాల సాగు రాష్ట్ర స్థాయిలో కాస్త పెరుగుతున్నట్లు కనిపిస్తున్నా ఇతర రాష్ట్రాల దిగుబడులతో పరిశీలిస్తే తెలంగాణ చాలా వెనుకబడి ఉందని చెప్పొచ్చు. తృణ ధాన్యాల్లో ఎక్కువగా వినియోగించేవి జొన్నలు, సజ్జలు, రాగులు. వీటితో పాటు కొర్రలు, అరికెలు, సామలు తదితరాలు తృణధాన్యాల కేటగిరీలోకే వస్తాయి. కానీ తొలి మూడింటి కంటే వీటి వినియోగం అంతంత మాత్రమే.

ఆరోగ్య సూత్రాల్లో భాగంగా తృణ ధాన్యాల వినియోగంపై వైద్య రంగ నిపుణులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ సూచనలిస్తున్నప్పటికీ రాష్ట్రంలో వీటి సాగు అత్యల్పమే. ఇటీవల పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో రాష్ట్రాల వారీగా తృణధాన్యాల దిగుబడులపై కేంద్ర ప్రభుత్వం ఒక నివేదిక విడుదల చేసింది. ఈక్రమంలో రాష్ట్రాల వారీగా దిగుబడుల్లో తెలంగాణ అత్యంత వెనుకబడి ఉంది. 2021–22 అంచనాలను బట్టి రాష్ట్రంలో తృణ ధాన్యాల దిగుబడి 180.13 మెట్రిక్‌ టన్నులుగా ఉంది. సరిగ్గా 2017–18 వార్షికంలో ఈ దిగుబడులు కేవలం 83.67 మెట్రిక్‌ టన్నులు మాత్రమే.

ప్రథమ స్థానంలో రాజస్తాన్‌...
చిరుధాన్యాల దిగుబడుల్లో దేశంలోనే రాజస్తాన్‌ రాష్ట్రం అగ్రభాగాన ఉంది. రాజస్తాన్‌లో ఏటా సగటున 4290.95 మెట్రిక్‌ టన్నుల తృణధాన్యాల దిగుబడి వస్తోంది. ఆ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర 2,296 మెట్రిక్‌ టన్నుల దిగుబడి రాగా...ఉత్తర్‌ప్ర­దేశ్‌లో 2223.86 మెట్రిక్‌ టన్నుల దిగు­బడి­తో మూడో స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్, ఉత్తరా­ఖండ్, గు­జ­రాత్, హరియాణా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్య­ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలన్నీ ముందు వరుసలో ఉన్నాయి.

దేశవ్యాప్తంగా సగ­టున 15921 మెట్రిక్‌ టన్నుల తృణ ధాన్యాలు దిగుబడి వస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పోషకాలు ఎక్కువగా ఉండి ఆరోగ్యాని అత్యంత మేలుచేసే తృణధాన్యాల సాగును విస్తృతం చేయా­లని కేంద్రం సూచించింది. రాష్ట్రంలో తృణధాన్యాల సాగుకు వాతావరణం అనుకూలతతో పాటు ఇక్కడి నేలలు సైతం ఎంతో అనుకూలమైనప్పటికీ వ్యవ­సాయ శాఖ మాత్రం ఈ అంశంపై ఎలాంటి దృష్టి సారించలేదనిపిస్తోంది. వినియోగం పెరిగితే దిగు­మతి చేసుకునే కంటే స్థానికంగా సాగు విస్తీర్ణాన్ని పెంచితే సరసమైన ధరలకే అందుబాటులోకి తీసుకురా­వొచ్చని కేంద్ర వ్యవసాయ శాఖ రాష్ట్రాలకు సూచించింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top