కనిపించని ‘జీవా’  | Sakshi
Sakshi News home page

కనిపించని ‘జీవా’ 

Published Sat, Mar 4 2023 2:21 AM

What happened to RTC's own water brand - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బ్రాండెడ్‌ మంచినీటి సీసాల వినియోగంతో సాలీనా రూ.కోట్లలో అవుతున్న వ్యయాన్ని నియంత్రించడంతోపాటు అదనపు ఆదాయాన్ని పొందే ఉద్దేశంతో ఎంతో ఘనంగా ప్రారంభించిన ఆర్టీసీ సొంత నీటి బ్రాండ్‌ ఎక్కడా కానరావడం లేదు. జీవా బ్రాండ్‌ను ఆర్టీసీ నెలన్నర క్రితం ఎంతో అట్టహాసంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎంజీబీఎస్‌లో కార్పొరేట్‌ పద్ధతిలో ఆ బ్రాండ్‌ను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ లాంఛనంగా ప్రారంభించారు.

దాదాపు ఆరు నెలలు శ్రమించి రెండు సంస్థలతో ఒప్పందం చేసుకుని ఈ నీటిని మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు ఆర్టీసీ కృషి చేసింది. కానీ ఇప్పటివరకు ఇటు బస్టాండ్‌లలో కాని, ఆర్టీసీ బస్సుల్లో కానీ ఎక్కడా అది కనిపించటం లేదు. ఇప్పటికీ ప్రైవేటు బ్రాండెడ్‌ నీటినే వినియోగిస్తున్నారు. భారీగా వ్యయం చేయటంతోపాటు ప్రసార మాధ్యమాల ద్వారా ముమ్మరంగా ప్రచారం జరిగి ప్రజల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొన్న తర్వాత ఆ బ్రాండ్‌ కనిపించకపోవటం విశేషం. 

కేవలం బస్టాండ్లలోని దుకాణాల్లోనే కాకుండా క్రమంగా, మార్కెట్‌లోని ఇతర దుకాణాల్లో కూడా అందుబాటులోకి తెచ్చేలా చూడాలని నిర్ణయించారు. కానీ మార్కెట్‌లోని దుకాణాల్లో కాదు కదా కనీసం ఆర్టీసీ బస్సుల్లో కూడా అవి కనిపించడం లేదు. ఇక ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్‌భవన్‌లో అధికారులకు కూడా అవి అందుబాటులో లేకుండా పోయాయి. 

బస్సులు, ఆర్టీసీ కార్యాలయాల్లో ప్రైవేట్‌ బ్రాండ్‌ నీళ్లే.. 
ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు ఉచితంగా 500 మి.లీ. వాటర్‌ బాటిళ్లను అందిస్తారు. ఆర్టీసీ సొంతంగా జీవా పేరుతో నీటిని మార్కెట్‌లోకి తీసుకురావటంతో, ఇక బస్సుల్లో అవే నీళ్లు పంపిణీ జరుగుతాయని ప్రచారం చేసింది. కానీ తాజాగా బస్సుల్లో పంపిణీకి ఓ బడా బ్రాండెడ్‌ నీటి సీసాలు పెద్ద ఎత్తున డిపోలకు చేరాయి.

ఇంతకాలం స్థానికంగా తయారయ్యే ఓ బ్రాండ్‌ సీసాలు పంపిణీ జరుగుతుండగా, తాజాగా ఓ అంతర్జాతీయ కంపెనీకి చెందిన బ్రాండ్‌ సీసాలు డిపోలకు చేరాయి. ప్రైవేటు బ్రాండెడ్‌ కంపెనీ నుంచి నీటి సీసాల కొనుగోలుకు సాలీనా రూ.5 కోట్ల వరకు ఖర్చవుతున్నట్టు సమాచారం. 

డిమాండ్‌ ఉన్నా కానరావడం లేదు.. 
♦ ప్రకాశం, కాంతి అన్న అర్ధంలో వినియోగించే జీవా (జెడ్‌ఐవీఏ) అన్న హిబ్రూ భాష నుంచి పుట్టిన పేరును ఖరారు చేసిన ఆర్టీసీ ఆ నీటి సీసాల డిజైన్‌లో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఇప్పటి వరకు ఏ కంపెనీ వినియోగించని రీతిలో డైమర్‌ కటింగ్స్‌ డిజైన్‌ ఉన్న సీసా ఆకృతిని ఎంపిక చేసింది.

చూడగానే ఆకట్టుకునేలా ఉన్నందున, ఆర్టీసీ బ్రాండ్‌ తోడు కావటంతో సాధారణ ప్రజలు కూడా దాని మన్నికపై నమ్మకంతో కొనే అవకాశం ఏర్పడుతుందని దీంతో ఈ నీటి విక్రయాల ద్వారా సాలీనా రూ.20 కోట్ల ఆదాయం పొందే వీలుందని ఆర్టీసీ అంచనా వేసింది. ప్రస్తుతం వేసని ప్రారంభం కావటంతో వాటర్‌ బాటిళ్ల విక్రయం ఊపందుకుంది. ఆర్టీసీ ప్రయాణికులు బస్టాండ్లలో నీటి సీసాలు కొని బస్కెక్కుతున్నారు. ఇలా మంచి డిమాండ్‌ ఉన్న సమయంలో కూడా ఆర్టీసీ నీళ్లు కనిపించడం లేదు. 

తయారీ కంపెనీల నిర్వాకంతోనే.. 
ఎంతో గొప్పగా జీవా బ్రాండ్‌ను ప్రారంభించినప్పటికీ, ఆ నీటిని, సీసాలను రూపొందించేందుకు ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీల నిర్వాకం వల్లనే సమస్యలు తలెత్తాయని సమాచారం. సీసాల ఆకృతి గొప్పగా ఉన్నప్పటికీ, వాటి నాణ్యత అత్యంత తీసికట్టుగా ఉన్నట్టు తెలిసింది. దీంతో ఆ బ్రాండ్‌పై చెడ్డపేరు వస్తుందనే వాటి మార్కెటింగ్‌ను ఆపేసినట్టు తెలిసింది. నాణ్యమైన సీసాలు, నీళ్లు అందుబాటులోకి వచ్చిన తర్వాతనే ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement