దేశంలోని అతి భారీసంపన్నుల్లో మన వాటా 6.3%
నైట్‌ఫ్రాంక్ ఇండియావెల్త్ రిపోర్ట్‌లో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలో ‘అతి భారీ సంపన్నుల’సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 30 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపద కలిగిన వ్యక్తులను అల్ట్రా హైనెట్‌వర్త్ ఇండివిడ్యుయల్స్‌గా (యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐ) వ్యవహరిస్తారు. భారత్‌లో ఈ అల్ట్రా శ్రీమంతుల జనాభాలో హైదరాబాద్ వాటా 6.3 శాతంగా ఉంది. 2015లో ఇది 5 శాతంగా ఉంది. ఇలాంటి సంపన్నుల్లో అత్యధికంగా ముంబై వాటా 35.4 శాతంగా ఉందని గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్‌ఫ్రాంక్ గురువారం విడుదల చేసిన ‘ది వెల్త్ రిపోర్ట్’20వ ఎడిషన్‌లో వెల్లడించింది.
భారత్‌లో శ్రీమంతులు
ప్రపంచవ్యాప్తంగా అల్ట్రా శ్రీమంతుల ర్యాంకింగ్స్‌లో భారత్ ఆరో స్థానంలో ఉంది. అల్ట్రా శ్రీమంతులు మన దేశంలో ఈ ఏడాది 19,877 మంది ఉండగా.. 2031 నాటికి 27 శాతం వృద్ధి రేటుతో 25,217కు చేరుతుందని అంచనా. 2021లో ఈ సంఖ్య 12,161గా ఉంది. మన దేశంలో సంపన్నుల సంఖ్య పెరగడం దాని ఆర్థిక పరిణామాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రైవేట్ మూలధన నిధులు, అధునాతన ఆర్థిక మార్కెట్లు, వ్యవస్థీకృత పెట్టుబడిదారుల సంఖ్య పెరగడం, డిజిటలైజేషన్, లిస్టెడ్ ఈక్విటీలు, కుటుంబ యాజమాన్యంలోని వ్యాపారాలు వంటివి ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.

నగరంలో 1 మిలియన్ డాలర్లతో 498 చ.మీ. స్థలం
హైదరాబాద్‌లో విలాసవంతమైన గృహాల మార్కెట్ గణనీయంగా పెరుగుతోంది. నైట్‌ఫ్రాంక్ ప్రైమ్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ ఇండెక్స్ (పీఐఆర్‌ఐ) ప్రకారం.. హైదరాబాద్‌లో రూ.9.4 కోట్ల (1 మిలియన్ డాలర్లు)తో 498 చ.మీ. నివాస స్థలాన్ని కొనుగోలు చేయొచ్చని అధ్యయనంలో తేలింది. 2024లోని ఇది 503 చ.మీ.గా ఉంది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన నివాస నగరంగా ఉన్న మొనాకోలో 1 మిలియన్ డాలర్లతో కేవలం 16 చ.మీ. నివాస స్థలాన్ని మాత్రమే కొనుగోలు చేయొచ్చు. ఆ తర్వాతి స్థానాల్లో హాంకాంగ్ 23 చ.మీ., జెనీవా 28 చ.మీ. ఉన్నాయి.


