
హైదరాబాద్‌లో 131 ఎకరాల ఇరిగేషన్ భూముల కబ్జా
వాటి స్వాధీనానికి ఇరిగేషన్, హైడ్రా, రెవెన్యూ శాఖలు కలిసి పనిచేయాలి
క్వార్టర్లలో అక్రమంగా తిష్టవేసిన వారినీ ఖాళీ చేయించాలి
ప్రాజెక్టుల స్థలాల్లో సౌరవిద్యుత్ ప్లాంట్ల ఏర్పాటును పరిశీలించాలి
నీటిపారుదల శాఖ భూముల పరిరక్షణపై సమీక్షలో మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: ఆక్రమణలకు గురైన తమ శాఖ భూముల్లో అంగుళం స్థలాన్ని కూడా వదలిపెట్టకుండా యుద్ధప్రాతిపదికన స్వాదీనం చేసుకుంటామని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. రూ. వందల కోట్ల విలువైన భూములు కబ్జాలకు గురయ్యాయని.. దీన్ని ఉపేక్షించకుండా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. భవిష్యత్తులో ఆక్రమణలకు చెక్ పెట్టేందుకు ఆ భూముల చుట్టూ కంచెల ఏర్పాటుతోపాటు చట్టపరమైన చర్యలూ తీసుకుంటామని చెప్పారు.
నీటిపారుదల శాఖ భూముల పరిరక్షణపై సచివాలయంలో గురువారం ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి, ఈఎన్సీ (జనరల్) అంజాద్ హుస్సేన్, ఈఎన్సీ అడ్మిన్ రమేశ్ బాబు, భూసేకరణ కమిషనర్ శివకుమార్ నాయుడు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌తో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. కాల్వలకు ఇరువైపులా ఉన్న భూములతోపాటు ప్రాజెక్టుల స్థలాల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు.
కోర్టుల్లో వాదనలకు ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది..
హైదరాబాద్‌లోని గండిపేట, రాజేంద్రనగర్ పరిధిలోని హిమాయత్‌సాగర్, కిస్మత్‌పుర, వాలంతరి, ఇంజనీరింగ్ ల్యాబ్ (టీజీఈఆర్‌ఎల్)కు చెందిన 426.3 ఎకరాలకుగాను 131.31 ఎకరాలు కబ్జాకు గురైనట్లు గుర్తించామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఐటీఐఆర్ అ«దీనంలోని 81.26 ఎకరాల స్థలంపై కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా మిగిలిన 50.13 ఎకరాలు కబ్జాకు గురయ్యాయన్నారు.
వాటిపై జిల్లా కోర్టులో 20 కేసులు, హైకోర్టులో 2 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు వివరించారు. భూముల పరిరక్షణలో న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదిని నియమించాలని నిర్ణయించామన్నారు. ఈ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు నీటిపారుదల శాఖ, హైడ్రా, రెవెన్యూ, ఆర్ అండ్ ఆర్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించామని చెప్పారు.
నీటిపారుదల భూముల్ని గుర్తించండి..
నీటిపారుదల శాఖ ప్రాజెక్టులకు సంబంధించిన క్వార్టర్లలో అక్రమంగా నివసిస్తున్న వారిని ఖాళీ చేయించి తక్షణమే సమగ్ర సమాచారం తన ముందు ఉంచాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా నీటిపారుదల శాఖ భూములను సత్వరం గుర్తించాలన్నారు. తమ శాఖ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై ఇటీవలి మంత్రివర్గ సమవేశంలో చర్చించామన్నారు. దీంతో రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలకు అవసరమైన విద్యుత్‌ను నీటిపారుదల శాఖ స్వయంగా ఉత్పత్తి చేసుకోవచ్చని చెప్పారు.