Kaleshwaram : మూడో సీజన్‌లో ముందస్తుగానే...

Water Upliftment Started In Third Season Kaleswaram Upliftment Project - Sakshi

కాళేశ్వరం ఎత్తిపోతలు షురూ

కాళేశ్వరం: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా మూడో సీజన్‌లో నీటి ఎత్తిపోత ప్రారంభమైంది. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలోనే నీటిని తరలించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఇంజనీరింగ్‌ అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ పూర్‌ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో కన్నెపల్లి లక్ష్మీ పంపుహౌస్‌లోని 17 మోటార్లకు గాను నాలుగింటిని ప్రారంభించారు.

తొలుత 1, ఆపై 2, 5, 7 నంబర్‌ మోటార్లు ప్రారంభించగా, ఎనిమిది పంపుల ద్వారా నీరు గ్రావిటీ కాల్వలో ఎత్తిపోస్తున్నారు. ఈ నీరు అన్నారం బ్యారేజీకి తరలుతోంది. 5 రోజులుగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో కాళేశ్వరం వద్ద గోదావరిలోకి ప్రాణహిత నది వరద చేరుతోంది. బుధవారం ఇక్కడ గోదావరిలో 5.54 మీటర్ల మేర నీటిమట్టం పెరిగింది. మరో రెండు రోజుల్లో వరద తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో లక్ష్మీ పంపుహౌస్‌ ద్వారా నీటి ఎత్తిపోతల ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.  ప్రస్తుతం జూన్‌ నుంచే ఖరీఫ్‌ అవసరాలకు నీటిని తలించడానికి చర్యలు తీసుకుంటున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top