
త్రివేణి సంగమం వద్ద పుష్కరఘాట్లను తాకిన నీరు
కాళేశ్వరం/కన్నాయిగూడెం/దోమలపెంట: మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద ప్రాణహిత వరద తాకిడితో గోదావరికి ప్రవాహం పెరుగుతోంది. శనివారం పుష్కరఘాట్లను తాకు తూ నీటిమట్టం దిగువకు ప్రవహించింది. దీంతో కాళేశ్వరం వద్ద 8.700 మీటర్ల ఎత్తులో నీటిమట్టం ప్రవహిస్తోంది.
దిగువన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్‌కి వరదనీరు చేరి 3.41 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో తరలిరాగా, మొత్తం 85 గేట్లు ఎత్తి అదేస్థాయిలో వరద నీటిని ఔట్‌ఫ్లో రూపంలో దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా, మేడిగడ్డ బరాజ్ వంతెన మీదుగా భారీ వాహనాలు రాకుండా ఇరిగేషన్‌శాఖ అధికారులు కట్టుదిట్టమైన చర్య లు తీసుకున్నారు. వరద తాకిడి పెరిగిన నేపథ్యంలో మహారాష్ట్ర మీదుగా తెలంగాణలోకి బరాజ్‌పై వంతెన ద్వారా రాకుండా గేటును వెల్డింగ్ చేశారు.
సమ్మక్క సాగర్‌కు 5,28,450 క్యూసెక్కుల నీరు
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్కసాగర్ బరాజ్‌లోకి భారీగా వరద నీరు చేరుతోంది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతంలోని వాగులు, ఒర్రెలు, చెరువుల నుంచి గోదావరిలోకి వరదనీరు వస్తోంది. దీంతో మేడిగడ్డ, సరస్వతి బరాజ్ నుంచి వరదనీరు సమ్మక్క సాగర్ బరాజ్‌లోకి చేరుతోంది.
శనివారం ఎగువ నుంచి 5,28,450 క్యూసెక్కుల నీరు వచ్చింది. దీంతో బరాజ్ వద్ద 59 గేట్లలో 44 గేట్లను ఎత్తి 5,65,100 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం బరాజ్ వద్ద నీటి మట్టం 83 మీటర్లకు 80.05 మీటర్లు కొనసాగుతోంది. బరాజ్‌త సామర్థ్యం 6.94 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.22 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
శ్రీశైలంకు కొనసాగుతున్న ప్రవాహం
జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు నీటి ప్రవాహం కొనసాగుతోంది. శనివారం రాత్రి 7 గంటలకు జూరాల స్పిల్‌వే ద్వారా 35,820 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ 34,286, సుంకేసుల నుంచి 31,928 మొత్తం 1,02,034 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి స్పిల్‌వే ద్వారా 53,764 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315, ఏపీ జెన్‌కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 30,929 మొత్తం 66,244 క్యూసెక్కుల నీటిని అదనంగా సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 882.4 అడుగుల నీటిమట్టం వద్ద 201.1205 టీఎంసీల నీటి నిల్వ ఉంది.