ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల వద్దే టీకాలు..!

Vaccination For All Students Over 18 Years Near Colleges In Telangana - Sakshi

18 ఏళ్లు నిండిన విద్యార్థులందరికీ వ్యాక్సినేషన్‌

మొబైల్‌ కేంద్రాల ఏర్పాటుకు వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయం

పాఠశాల, కాలేజీ బస్సు ఎక్కితే మాస్క్‌ ధరించాల్సిందే

తాజా మార్గదర్శకాలు జారీ 

సాక్షి, హైదరాబాద్‌: కళాశాలలు తెరిచిన నేపథ్యంలో 18 ఏళ్లు నిండిన విద్యార్థులకు కరోనా టీకాలు వేయడంపై ప్రభుత్వం దృష్టి సారిం చింది. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు గాను ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల వద్దే మొబైల్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి వ్యాక్సిన్లు వేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. దేశంలో థర్డ్‌వేవ్‌పై నిపుణుల హెచ్చరికలు కొనసాగుతు న్నాయి. మరోవైపు రాష్ట్రంలో విద్యాసంస్థలు బుధవారం నుంచి ప్రారంభమ య్యాయి. దీంతో తల్లిదండ్రులు, విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే మెడికల్, ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ తదితర ఉన్నత విద్యా సంస్థల వద్ద విద్యార్థులకు టీకాలు అందు బాటులోకి తేనున్నారు. అలాగే అన్ని యూని వర్సిటీల్లోనూ ఈ మేరకు ఏర్పాట్లు చేయను న్నారు. ఉన్నత విద్యా సంస్థల్లో 18 ఏళ్లు నిండిన వారు దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు ఉంటారని అంచనా. కాగా ఇప్పటివరకు టీకాలు తీసుకోనివారికి వీలైనంత త్వరగా టీకాలు వేయాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.  

అన్ని వసతిగృహాల్లోనూ వ్యాక్సినేషన్‌
యూనివర్సిటీలు, ఇంజనీరింగ్, మెడికల్‌ కాలేజీలు, ఇతర ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించిన హాస్టళ్లలోనూ టీకాలు వేయాలని నిర్ణయించారు. 20–30 మంది ఉన్న వసతిగృహాలు, ప్రైవేట్‌ హాస్టళ్లలోనూ టీకాలు వేస్తారు. ఏదైనా ప్రైవేట్‌ కాలేజీకి అనుబంధంగా హాస్టల్‌ ఉన్నా, సమాచారం ఇస్తే అక్కడకు కూడా మొబైల్‌ వాహనంలో వెళ్లి వ్యాక్సినేషన్‌ చేపడతారు. ఎక్కడ వీలైతే అక్కడ వ్యాక్సిన్‌ అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

వైద్య ఆరోగ్య శాఖ తాజాగా జారీ చేసిన మరికొన్ని మార్గదర్శకాలు 

  • పాఠశాల, కాలేజీ బస్సు ఎక్కే విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి.
  • వీలైతే ఒక సీటులో ఒకరు మాత్రమే కూర్చునేలా చూడాలి. హాస్టళ్లలో విద్యార్థులు గుమికూడకుండా, ఒకే రూములో ఎక్కువమంది ఉండకుండా చూడాలి. 
  • భోజనాలకు వేర్వేరు సమయాలు పెట్టాలి. తద్వారా విద్యార్థులు గుంపులుగా ఏర్పడకుండా చూడాలి.  ప్రతిరోజూ అన్ని హాస్టళ్లలో శానిటైజేషన్‌ ప్రక్రియ చేపట్టాలి. 
  • జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఏమాత్రం కన్పించినా తక్షణమే ఆయా హాస్టళ్లలోని ఐసోలేషన్‌ గదుల్లో ఉంచాలి. అవసరమైతే ప్రభుత్వ ఆసుపత్రికి సమాచారం ఇవ్వాలి.  
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top