కొత్త లిఫ్టులతో 62 వేల ఎకరాలకు సాగునీరు | Uttam Kumar Reddy orders fast tracking of SLBC tunnel works: Telangana | Sakshi
Sakshi News home page

కొత్త లిఫ్టులతో 62 వేల ఎకరాలకు సాగునీరు

Oct 17 2024 6:16 AM | Updated on Oct 17 2024 6:16 AM

Uttam Kumar Reddy orders fast tracking of SLBC tunnel works: Telangana

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడి

దేవరకొండ, మిర్యాలగూడ నియోజకవర్గాల్లోని సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: దేవరకొండ, మిర్యాలగూడ నియోజక వర్గాల్లోని కొత్త ఎత్తిపోతల పథకాలతో మొత్తం 62,742 ఎక రాలకు సాగునీరు అందుతుందని సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కృష్ణా, మూసీ నుండి నీళ్లను తరలించడం ద్వారా కొత్త ఆయకట్టు సృష్టించడంతో పాటు ఉన్న ఆయకట్టు స్థిరీకరణకు ఈ ప్రాజెక్టులు దోహదప డతాయని చెప్పారు. ఈ నియోజకవర్గాల్లోని సాగునీటి ప్రాజెక్టులపై బుధవారం ఆయన జలసౌధలో సమీక్ష నిర్వ హించారు. కొత్త ఎత్తిపోతల జాబితాలో దేవర కొండలోని పొగిళ్ల, కంబాలపల్లి, అంబభవాని, ఏకేబీఆర్, పెద్దగట్టు లిఫ్టులు, మిర్యాలగూడలో దున్నపోతులగండి– బాల్నేపల్లి – చంప్లతండా, టోపుచెర్ల, వీర్లపాలెం, కేశవాపూర్‌ – కొండ్రాపూర్‌ ఉన్నాయని మంత్రి తెలిపారు. వీటితో 47,708 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు లభిస్తుందని చెప్పారు. 

2026 నాటికి ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పూర్తి చేయాలి
శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పనుల ను 2026 డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని ఉత్తమ్‌ ఆదేశించారు. 30 టీఎంసీలను తరలించడానికి వీలుగా సొరంగం పనులను వేగవంతం చేయాలన్నారు. మొత్తం 44 కి.మీ సొరంగంలో 9.55  కి.మీలు ఇంకా పెండింగ్‌లో ఉందని, టన్నెల్‌ బోర్‌ మిషన్‌కు అవసరమైన విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటామని నిర్మాణ సంస్థ జేపీ అసోసియేట్స్‌ ప్రతినిధులు ఈ సందర్భంగా మంత్రికి తెలి పారు. ఉత్తమ్‌ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే మధ్యవర్తిత్వ పర్యవేక్షణ లేకుండా నిర్మించిన అతిపెద్ద సాగునీటి సొరంగంగా ఇది మారుతుందని చెప్పారు. ప్రాజెక్టును పూర్తి చేయడానికి రూ.4,637 కోట్లతో సవరించిన అంచనాలకు పరిపాలన అనుమతి జారీ చేశామని చెప్పారు. ఈ ప్రాజెక్టుతో ఫ్లోరైడ్‌ ప్రభావిత నల్లగొండ జిల్లాకు మేలు జరుగుతుందన్నారు. 

చెక్‌డ్యామ్‌ల కుంభకోణంపై విచారణ
గత ప్రభుత్వంలో చెక్‌డ్యామ్‌ల నిర్మాణంలో అవకతవకతలు జరిగాయని, పెద్ద సంఖ్యలో చెక్‌డ్యామ్‌లు దెబ్బతిన్నాయని వచ్చిన ఆరోపణలపై విచారణకు మంత్రి ఉత్తమ్‌ ఆదేశించారు. నీటి లభ్యత, సామర్థ్యంపై సరైన అంచనా లేకుండా చెక్‌డ్యామ్‌లు నిర్మించడంతో అవి దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు. కాగా సాగర్‌ ఎడమ కాల్వ మరమ్మతులను పూర్తి చేసి పటిష్టం చేయాలని మంత్రి  ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు బాలునాయక్, బి.లక్ష్మారెడ్డి, నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్‌ దాస్, కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ఈఎన్‌సీ అనిల్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement