మరమ్మతులు పూర్తయ్యాకే కాళేశ్వరం బ్యారేజీల నిర్వహణ | Uttam Kumar Reddy On Management of Kaleshwaram Project Barrages | Sakshi
Sakshi News home page

మరమ్మతులు పూర్తయ్యాకే కాళేశ్వరం బ్యారేజీల నిర్వహణ

Jul 4 2026 10:41 PM | Updated on Jul 4 2026 10:41 PM

Uttam Kumar Reddy On Management of Kaleshwaram Project Barrages

నాగార్జునసాగర్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు పూర్తిగా పూర్తయి, జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ (NDSA), కేంద్ర జల సంఘం (CWC) సాంకేతిక అనుమతులు ఇచ్చిన తర్వాతే వాటిని తిరిగి నిర్వహిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ విజయవిహార్‌లో సాగునీటి శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

"ప్రజల ప్రాణ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. రాజకీయాల కంటే ప్రజల భద్రత, ప్రభుత్వ ఆస్తుల సంరక్షణకే మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. అన్ని లోపాలను సరిదిద్దిన తర్వాత, NDSA, CWC పూర్తిస్థాయిలో పరిశీలించి అనుమతి ఇచ్చిన తరువాతే బ్యారేజీలను నిర్వహిస్తాం" అని మంత్రి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రూ.1.10 లక్షల కోట్లకు పైగా ప్రజాధనం ఖర్చయిందని, ఆ ఆస్తిని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని మంత్రి అన్నారు.
మరమ్మతులు పూర్తికాకముందే బ్యారేజీలను నిర్వహించడం ప్రమాదకరమని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో భద్రాచలం పట్టణంతో పాటు దిగువన ఉన్న సుమారు 40 గ్రామాల ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు.

బ్యారేజీల పునరుద్ధరణ పనులను పూర్తిగా శాస్త్రీయ విధానంలో చేపడుతున్నామని మంత్రి వివరించారు. భూగర్భ సాంకేతిక పరీక్షలు, నాన్-డిస్ట్రక్టివ్ టెస్టులు, గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ సర్వేలు, డ్రోన్ సర్వేలు, వందకు పైగా బోర్ హోల్స్ ద్వారా నిర్మాణాల పరిస్థితిని పరిశీలిస్తున్నామని తెలిపారు.

ప్రస్తుతం NDSA సూచనల మేరకు బ్యారేజీల అన్ని గేట్లను ఎత్తి ఉంచి, నీటి ఒత్తిడి లేకుండా నిర్వహిస్తున్నామని చెప్పారు. కేంద్ర జల మరియు విద్యుత్ పరిశోధన సంస్థ (CWPRS), కేంద్ర జల సంఘం (CWC), అంతర్జాతీయ నిపుణులు కలిసి పునరుద్ధరణ నమూనాలను పరిశీలిస్తున్నారని, భద్రతపై పూర్తి నమ్మకం వచ్చిన తర్వాతే బ్యారేజీలను తిరిగి వినియోగంలోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ డ్యామ్ భద్రతకు అత్యంత ప్రాధాన్యం
నాగార్జునసాగర్ డ్యామ్ భద్రత, నిర్వహణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

అవసరమైన అన్ని మరమ్మతుల అంచనాలను వెంటనే సిద్ధం చేసి పరిపాలనా అనుమతులకు పంపాలని అధికారులను ఆదేశించారు.లైనింగ్ అవసరమైన కాలువలను గుర్తించి వెంటనే పనులు ప్రారంభించాలని సూచించారు. పట్టణ ప్రాంతాల గుండా వెళ్లే ఓపెన్ కాలువలను దశలవారీగా కప్పివేసే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. దీనివల్ల చెత్త వేయడాన్ని అరికట్టడంతో పాటు పరిశుభ్రత మెరుగుపడుతుందని చెప్పారు.

ప్రతి సాగునీటి పనిలో నాణ్యత, వేగం అనే రెండు అంశాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు. నిర్ణీత గడువులోనే పనులు పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని అధికారులకు సూచించారు.

అంతకుముందు మిర్యాలగూడలో ఎగుమతులకు అనువైన ఆధునిక రైస్ మిల్లును మంత్రి ప్రారంభించారు. అనంతరం గుల్లపోతులగండి, కేశవాపూర్, నెల్లికల్లు ఎత్తిపోతల పథకాల పనులను పరిశీలించి, వాటిని వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

గత ప్రభుత్వంలో ప్రకటించిన అనేక సాగునీటి పథకాలు కాగితాలకే పరిమితమయ్యాయని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని భూమిపై అమలు చేస్తూ రైతులకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, సాగునీటి శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement