Passport: పాస్‌పోర్టులో ఇంటి పేరు ఉండాల్సిందే

UAE Bars Entry of Travelers With Single Name on Indian Passport - Sakshi

యూఏఈ సర్కార్‌ తాజా నిబంధన

మోర్తాడ్‌ (బాల్కొండ): తమ దేశానికి వచ్చే పర్యాటకులు, వర్క్‌ వీసా పొందినవారు పాస్‌పోర్టులలో ఇంటిపేరును తప్పనిసరిగా జత చేయించుకోవాలని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ప్రభుత్వం నిర్దేశించింది. యూఏఈకి వచ్చేవారి వివరాలు స్పష్టంగా ఉండాలనే ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

ఈ నిర్ణయం మేరకు భారతీయులు ఎవరైనా తమ పాస్‌పోర్టులో ఇంటిపేరు లేకపోతే నమోదు చేసుకోవడానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని యూఏఈలోని భారత విదేశాంగ శాఖ అధికారులు చెప్పారు. కొందరి పాస్‌పోర్టులలో ఆధార్, పాన్‌కార్డు, ఓటర్‌ కార్డులలో ఇంటి పేరు ఉండకుండా  పేరు మాత్రమే ఉంటుంది. పేరు ఒక్కటే ఉండటం వల్ల ఆయా వ్యక్తుల స్పష్టమైన వివరాలు తెలియడం లేదనే ఉద్దేశంతో యూఏఈ ప్రభుత్వం ఈ సవరణలను చేపట్టింది. 

ఇదిలా ఉండగా ఎవరైనా పెళ్లి చేసుకోక ముందు పాస్‌పోర్టు తీసుకుని ఉంటే అందులో భర్త లేదా భార్య(స్పౌస్‌) పేరు ఉండదు. అలాంటివారు కూడా తమ జీవిత భాగస్వామి పేరును నమోదు చేయించుకోవాలని దుబాయ్‌లోని భారత కాన్సులేట్‌ జనరల్‌ కోరారు. గతంలో ఇలాంటి నిబంధనలు లేకపోవడంతో అనేక మంది పాస్‌పోర్టులలో వివరాలు స్పష్టంగా లేవు. కొత్త నిబంధనల వల్ల పాస్‌పోర్టులలో పూర్తి వివరాలను నమోదు చేసుకునే అవకాశం ఉంది. 

యూఏఈలో రెన్యువల్‌కు ఇక్కడ విచారణ 
యూఏఈలో ఉపాధి పొందుతున్నవారు తమ పాస్‌పోర్టు రెన్యువల్‌కు అక్కడి భారత రాయబార కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే ఇక్కడ ప్రత్యేక పోలీసు విభాగం(స్పెషల్‌ బ్రాంచ్‌) అధికారులు విచారణ జరుపుతున్నారు. విదేశాల్లో ఉన్న వారు పాస్‌పోర్టు రెన్యువల్‌కు గడువు సమీపిస్తే తాము ఉండే దేశంలోని భారత రాయబార కార్యాలయంలో రెన్యువల్‌ చేసుకునేవారు. 

పాత పాస్‌పోర్టునే రెన్యువల్‌ చేసుకోవడం వల్ల ఎలాంటి విచారణ నిర్వహించకపోయేవారు. కానీ ఇప్పుడు మాత్రం భారత రాయబార కార్యాలయం ఇచ్చిన సమాచారంతో పాస్‌పోర్టు రెన్యువల్‌ చేసుకునేవారి ఇంటి వద్దకు ఎస్‌బీ అధికారులు వచ్చి వివరాలను నమోదు చేసుకుంటుండటం గమనార్హం. పాస్‌పోర్టుల జారీ పారదర్శకంగా ఉండాలన్న కారణంతోనే ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. (క్లిక్ చేయండి: హైదరాబాద్‌లోని కొత్త అమెరికా కాన్సులేట్‌ ఇదే..)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top