లారీ బీభత్సం | Two Ends Life In Lorry Accident in Yadadri Bhuvanagiri | Sakshi
Sakshi News home page

లారీ బీభత్సం

Aug 4 2025 3:29 AM | Updated on Aug 4 2025 3:29 AM

 Two Ends Life In Lorry Accident in Yadadri Bhuvanagiri

భువనగిరి: భువనగిరి పట్టణంలోని జగదేవ్‌పూర్‌ చౌరస్తాలో లారీ బీభత్సం సృష్టించింది. లారీ ఢీకొని ఇద్దరు మృతి చెందగా.. ఒకరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సంగారెడ్డి జిల్లా కోహిర్‌ మండలం పోతిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన చిలమామిడి రామకృష్ణ(35), చిలమామిడి సాయి కుమార్‌(22) హైదరాబాద్‌లోని సూరారం కాలనీలో కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. రామకృష్ణ ప్రైవేట్‌ కంపెనీలో మేనేజర్‌గా, సాయికుమార్‌ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం భువనగిరి పట్టణంలోని సంతోషనగర్‌లో నిశ్చితార్థం వేడుకకు బంధువులతో కలిసి వచ్చారు. 

నిశ్చితార్థం జరుగుతున్న క్రమంలో స్వీట్స్‌ కోసం రామకృష్ణ, సాయికుమార్‌ ఇద్దరూ కారులో పట్టణంలోని జగదేవ్‌పూర్‌ చౌరస్తాకు బయలుదేరారు. కారును రోడ్డు పక్కన పార్కింగ్‌ చేసి షాపు దగ్గరకు వెళ్తున్నారు. ఇదే సమయంలో రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన లారీ ఉత్తరప్రదేశ్‌ నుంచి జగదేవ్‌పూర్‌ రోడ్డు మార్గం నుంచి చెన్నైకు వెళ్తున్న లారీ వేగంగా దూసుకువచ్చి అక్కడే ఉన్న పాదచారులు, ద్విచకవ్రాహనదారులను ఢీకొట్టింది. దీంతో అక్కడే నిలబడి ఉన్న రామకృష్ణ మృతి చెందగా, సాయికుమార్‌తో పాటు రామన్నపేట మండలం తుమ్మలగూడెం గ్రామానికి చెందిన బీమారి శివసాయికుమార్, లారీ డ్రైవర్, క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

 వీరిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం సాయికుమార్‌తో పాటు శివకుమార్‌ను సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో సాయికుమార్‌ మృతి చెందాడు. మృతుల బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ రమేష్‌ తెలిపారు. మృతుడు రామకృష్ణకు భార్య ఇద్దరు కుమార్తెలు, సాయికుమార్‌కు భార్య, కుమార్తె ఉన్నారు. 

ధ్వంసమైన షాపులు, బైకులు
లారీ వేగంగా దూసుకురావడంతో రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్, పాన్‌ షాప్‌లు, అక్కడే ఉన్న మూడు బైకులు ధ్వంసమయ్యాయి. మృతుడు లారీ, గోడ మధ్యన ఇరుక్కుపోవడంతో పోలీసులు క్రేన్‌ సాయంతో లారీని తొలగించి మృతదేహాన్ని బయటకు తీశారు. జిల్లా కేంద్ర ఆస్పత్రి వద్ద మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement