హోటల్ సిబ్బంది దాడిలో టూరిస్ట్ గైడ్ మృతి
హైదరాబాద్: రూ. 600 కోసం హోటల్ సిబ్బంది దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన టూరిస్ట్ గైడ్ చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ సైదిరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లా, వెల్దండ గ్రామానికి చెందిన విస్లావత్ శంకర్ నాయక్ టూరిస్ట్ గౌడ్‌గా పని చేసేవాడు. టూరిస్ట్‌లను హైదరాబాద్ తీసుకొచ్చి సిటీని చూపిస్తుంటాడు.
ఈనెల 21న గుజరాత్ నుంచి వచ్చిన టూరిస్టుల కోసం కర్మన్‌ఘాట్‌లోని ఎన్ సెవెన్ హోటల్‌లో 22 ఏసీ రూంలు బుక్ చేశాడు. మర్నాడు ఉదయం గదులు ఖాళీ చేసే సమయంలో శంకర్‌నాయక్ బిల్లులో రూ. 600 తక్కువ ఇచ్చాడు. ఈ విషయమై హోటల్ సిబ్బందికి శంకర్ గొడవ జరిగింది. మాటా మాటా పెరగడంతో ఆగ్రహానికి లోనైన హోటల్ సిబ్బంది నూర్, కమలుద్దీన్, ఇస్లాంజహీదుల్, రహీం అతడిపై దాడి చేశారు.
ఈ క్రమంలో నూర్ అనే వ్యక్తి పక్కనే ఉన్న కుర్చీతో శంకర్ తలపై మోదడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతను సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని ఇంటికి వెళ్లాడు. సోమవారం పరిస్థితి విషమించి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం మృతి చెందాడు. మృతుడి కుమారుడు వంశీకృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన హోటల్ సిబ్బంది ఒడిశాకు చెందిన వారిగా గుర్తించారు. నిందుతులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.


