ప్రాణాలు తీసిన పుచ్చకాయ! | Sakshi
Sakshi News home page

ప్రాణాలు తీసిన పుచ్చకాయ!

Published Sat, Apr 3 2021 5:28 AM

Two Childrens Die After Eating Poisoned Water Milon - Sakshi

రామగుండం: ఎలుకలు కొరికిన పుచ్చకాయ తినడం ఆ కుటుంబం పాలిట శాపంగా మారింది. ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం విసంపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. విసంపేట గ్రామానికి చెందిన దారబోయిన కొమురయ్య, సారమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు.. వృద్ధాప్యం కారణంగా పెద్ద కొడుకు శ్రీశైలం, కోడలు గుణవతి వద్ద ఉంటున్నారు. శ్రీశైలం దంపతులకు ఇద్దరు కుమారులు శివానంద్‌ (12), శరణ్‌ (10) ఉన్నారు. గత సోమవారం గ్రామానికి వచ్చిన వ్యక్తి వద్ద పుచ్చకాయలు కొనుగోలు చేశారు.

సాయంత్రం కుటుంబ సభ్యులంతా సగం పుచ్చకాయ తిన్నారు. మిగతా సగం ఇంట్లోని సెల్ఫ్‌లో ఉంచారు. అదేరోజు రాత్రి కొమురయ్య ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉన్నాయని తవుడులో విషం కలిపి పెట్టాడు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు మిగతా సగం పుచ్చకాయ తినగా, కొమురయ్య మాత్రం తినలేదు. ఆ రోజు ఇంట్లో ఎల్లమ్మ పూజలు చేసుకోవడంతో మాంసాహారం తిన్నారు. కాగా, సాయంత్రం నుంచి పుచ్చకాయ తిన్న వారికి మాత్రమే వాంతులు, విరేచనాలు కావడంతో అస్వస్థతకు గురయ్యారు.

తొలుత మాంసాహారంతోనే అస్వస్థతకు గురైనట్లు భావించి స్థానికంగా ఆర్‌ఎంపీ వద్ద చికిత్స చేయించుకున్నారు. ఎల్లమ్మ పూజల నేపథ్యంలో శ్రీశైలం కుటుంబంతోపాటు అతని సోదరులు కనకరాజు, ప్రభాకర్‌ కుటుంబాలు సైతం భోజనం చేశాయి. వారికి ఎలాంటి అస్వస్థత లేకపోగా, శ్రీశైలం తండ్రి కొమురయ్య సైతం ఆరోగ్యంగా ఉండడంతో, పుచ్చకాయతోనే అనారోగ్యం బారిన పగినట్లు గుర్తించారు. విషం తిన్న ఎలుకలు పుచ్చకాయను కొరకవడంతో అది విషపూరితమైనట్లు భావిస్తున్నారు. అస్వస్థతకు గురైనవారి పరిస్థితి క్షీణిస్తుండడంతో గురువారం ఉదయం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు పిల్లల ఆస్పత్రిలో శివానంద్, శరణ్‌లను చేర్పించారు.

శ్రీశైలం, గుణవతి మరో ఆస్పత్రిలో చేరారు. చిన్నారుల పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి శివానంద్, శుక్రవారం వేకువజామున శరణ్‌ మృతిచెందారు. శ్రీశైలం, గుణవతిలకు శ్వాస సంబంధ సమస్య తీవ్రం కావడంతో బంధువులు వారిని హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు వైద్యులు చెప్పారని బంధువులు తెలిపారు. శ్రీశైలం తల్లి సారమ్మ సైతం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఆమె ఆరోగ్యం కూడా నిలకడగా ఉందని తెలిసింది. 

Advertisement
Advertisement