TSRJC: టెన్త్‌ గ్రేడ్‌లతోనే ఇంటర్‌ అడ్మిషన్‌

Tsrjc Exam Cancelled 2021 Admission In Tenth Grade Marks - Sakshi

ప్రకటించిన సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ

ఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష రద్దు...

సాక్షి, హైదరాబాద్‌: ప్రవేశ పరీక్ష రద్దు చేసి పదోతరగతి గ్రేడ్‌ పాయింట్ల ఆధారంగా అడ్మిషన్లు ఇవ్వాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) నిర్ణయించింది. ఈ సొసైటీ పరిధిలో దాదాపు రెండువందల గురుకుల జూనియర్‌ కాలేజీలున్నాయి. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులంతా పదో తరగతి గ్రేడ్‌ పాయింట్లను అప్‌లోడ్‌ చేయాలని సూచించింది. ఈ మేరకు వెబ్‌సైట్‌లో ఆప్షన్లు ఇస్తూ సాంకేతిక మార్పులు చేసింది. ఈ నెల ఏడో తేదీలోగా వెబ్‌సైట్‌లో టెన్త్‌ గ్రేడ్‌ పాయింట్లు, జీపీఏ పాయింట్లు తదితర వివరాలను అప్‌లోడ్‌ చేయాలని పేర్కొంది. పాయింట్ల ఆధారంగా వడపోసి సీట్లు కేటాయించనున్నట్లు టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ స్పష్టం చేసింది.

ఇతర సొసైటీలదీ అదే దారి?
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌), మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌), తెలంగాణ మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎండబ్ల్యూఆర్‌ఈఐఎస్‌)ల పరిధిలోని జూనియర్‌ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియపై సందిగ్ధత నెలకొంది. ఈ సొసైటీలు కూడా ఏటా అడ్మిషన టెస్ట్‌ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ప్రస్తుతం టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ మాదిరిగానే ఇతర సొసైటీలు కూడా పదోతరగతి గ్రేడ్‌ పాయింట్ల ఆధారంగా ప్రవేశాలు కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నాయి. అతి త్వరలో ఈ సొసైటీలు కూడా నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

ప్రమాణాలు మెరుగుపడటంతో...
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విద్యా ప్రమాణాలు మెరుగుపడటంతో గురుకుల విద్యాసంస్థలకు ఆదరణ విపరీతంగా పెరిగింది. వీటిలో ప్రవేశాలకు పెద్దసంఖ్యలో దరఖాస్తులు వస్తుండటంతో ప్రవేశపరీక్షలు నిర్వహిస్తూ మెరిట్‌ ఆధారంగా అడ్మిషన్లు ఇస్తున్నాయి. ఈ ఏడాది కూడా రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఆర్‌జేసీ సెట్‌) నిర్వహించి ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించాయి. కానీ, కోవిడ్‌–19 వ్యాప్తి నేపథ్యంలో అడ్మిషన్‌ టెస్ట్‌ నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ప్రవేశపరీక్ష విధానాన్ని ఈసారికి రద్దు చేసింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top