breaking news
TSRJC
-
జూన్ 6న టీఎస్ఆర్జేసీ సెట్–22
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని 35 గురుకుల జూనియర్ కాలేజీల్లో 2022–23 విద్యా సంవత్సరానికి ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు సంబంధించి జూన్ 6న అర్హత పరీక్ష టీఎస్ఆర్జేసీ సెట్–22 నిర్వహించనున్నట్లు సొసైటీ కార్యదర్శి సీహెచ్ రమణకుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్ష రాసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 40,281 మంది అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారని, ఈనెల 28 నుంచి హాల్‌టికెట్లు వైబ్‌సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష జరుగుతుందని, మరిన్ని వివరాలకు సొసైటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొన్నారు. 24 నుంచి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ స్థాయి పరీక్షలు (10 ప్లస్ టు) ఈ నెల 24 నుంచి దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారత దేశంలోని రాష్ట్రాల అభ్యర్థులకు పరీక్షలు ఆన్లైన్ విధానంలో జరుగుతాయి. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 24 నుంచి జూన్ 10 వరకూ జరగనున్నాయి. -
TSRJC: టెన్త్ గ్రేడ్‌లతోనే ఇంటర్ అడ్మిషన్
సాక్షి, హైదరాబాద్: ప్రవేశ పరీక్ష రద్దు చేసి పదోతరగతి గ్రేడ్ పాయింట్ల ఆధారంగా అడ్మిషన్లు ఇవ్వాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) నిర్ణయించింది. ఈ సొసైటీ పరిధిలో దాదాపు రెండువందల గురుకుల జూనియర్ కాలేజీలున్నాయి. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులంతా పదో తరగతి గ్రేడ్ పాయింట్లను అప్లోడ్ చేయాలని సూచించింది. ఈ మేరకు వెబ్సైట్లో ఆప్షన్లు ఇస్తూ సాంకేతిక మార్పులు చేసింది. ఈ నెల ఏడో తేదీలోగా వెబ్సైట్లో టెన్త్ గ్రేడ్ పాయింట్లు, జీపీఏ పాయింట్లు తదితర వివరాలను అప్లోడ్ చేయాలని పేర్కొంది. పాయింట్ల ఆధారంగా వడపోసి సీట్లు కేటాయించనున్నట్లు టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ స్పష్టం చేసింది. ఇతర సొసైటీలదీ అదే దారి? తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎండబ్ల్యూఆర్‌ఈఐఎస్)ల పరిధిలోని జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియపై సందిగ్ధత నెలకొంది. ఈ సొసైటీలు కూడా ఏటా అడ్మిషన టెస్ట్ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ప్రస్తుతం టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ మాదిరిగానే ఇతర సొసైటీలు కూడా పదోతరగతి గ్రేడ్ పాయింట్ల ఆధారంగా ప్రవేశాలు కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నాయి. అతి త్వరలో ఈ సొసైటీలు కూడా నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రమాణాలు మెరుగుపడటంతో... తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విద్యా ప్రమాణాలు మెరుగుపడటంతో గురుకుల విద్యాసంస్థలకు ఆదరణ విపరీతంగా పెరిగింది. వీటిలో ప్రవేశాలకు పెద్దసంఖ్యలో దరఖాస్తులు వస్తుండటంతో ప్రవేశపరీక్షలు నిర్వహిస్తూ మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు ఇస్తున్నాయి. ఈ ఏడాది కూడా రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఆర్జేసీ సెట్) నిర్వహించి ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించాయి. కానీ, కోవిడ్–19 వ్యాప్తి నేపథ్యంలో అడ్మిషన్ టెస్ట్ నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ప్రవేశపరీక్ష విధానాన్ని ఈసారికి రద్దు చేసింది. -
భవిష్యత్‌కు తొలిమలుపు.. గురుకులాలు
పదో తరగతి తర్వాత విద్యార్థుల భవిష్యత్‌కు చుక్కానిలా నిలుస్తోన్న కోర్సు.. ఇంటర్మీడియెట్.. ఈ కోర్సులో చూపే ప్రతిభ భవిష్యత్ అవకాశాలకు బాటలు వేస్తుంది.. కాబట్టి మెరుగైన వి్యను అందించే ఇన్స్టిట్యూట్లను ఎంపిక చేసుకోవాలి.. ఈ కోవలోకి వస్తాయి తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ (టీఎస్ఆర్జేసీ)లు.. నాణ్యమైన ఇంటర్మీడియెట్ విద్యను ఉచితంగా అందించడంతోపాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతున్నాయి ఈ గురుకులాలు.. ఈ కాలేజీల్లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో ప్రవేశం కోసం ఏటా నిర్వహించే టీఎస్ఆర్జేసీ-కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీఆర్జేసీసెట్)- 2015కు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో సంబంధిత వివరాలు.. ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించి నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్షన్ సొసైటీ (టీఆర్ఈఐ) నాలుగు రెసిడెన్షియల్ కాలేజీలను నిర్వహిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ, పేద,మధ్య తరగతి విద్యార్థులకు ఇవి చక్కని వేదికలు. అతి స్వల్ప ఖర్చుతో గురుకుల తరహా విద్యను అందుకోవచ్చు. కాలేజీల వివరాలు జనరల్ జూనియర్ కళాశాలలు (ఇంగ్లిష్ మీడియం)గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీబాలురు-తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాల-సర్వేల్ (నల్లగొండ జిల్లా)బాలికలు-తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాల- హసన్‌పర్తి (వరంగల్ జిల్లా)ఈ రెండు కాలేజీలకు తెలంగాణలోని అన్ని జిల్లాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.మైనారిటీ జూనియర్ కళాశాలలు (ఉర్దూ-ఇంగ్లిష్ మీడియం, బాలురు మాత్రమే)గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, సీఈసీతెలంగాణ గురుకుల జూనియర్ కళాశాల-ఎల్బీ నగర్, నాగోల్ (హైదరాబాద్ జిల్లా).హైదరాబాద్, రంగారెడ్డి. నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాల-నాగారం (నిజామాబాద్ జిల్లా)ఈ కాలేజీకి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశం ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. తెలుగు/ఇంగ్లిష్, ఉర్దూ/ఇంగ్లిష్ భాషల్లో ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తారు. పదో తరగతి సిలబస్ ఆధారంగా ప్రశ్నలు వస్తా యి. ఎంచుకున్న గ్రూపును బట్టి మూడు సబ్జెక్ట్‌లలో పరీక్షను నిర్వహిస్తారు. మొత్తం 150 ప్రశ్నలు ఇస్తారు. వివరాలు.. గ్రూప్ సబ్జెక్టులు ఎంపీసీ ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ బైపీసీ ఇంగ్లిష్, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్ సీఈసీ/ ఎంఈసీ ఇంగ్లిష్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్ ప్రతి సబ్జెక్ట్‌కు 50 ప్రశ్నలు 50 మార్కులు ప్రతి పేపర్‌కు సమయం: రెండున్నర గంటలు (150 నిమిషాలు) ప్రతి పేపర్‌కు మార్కులు: 150 ప్రిపరేషన్ ఇంగ్లిష్: కీలకమైన సబ్జెక్ట్ ఇంగ్లిష్. ఎందుకంటే అన్ని గ్రూపులకు నిర్వహించే పరీక్షల్లో ఇంగ్లిష్ తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి ఈ సబ్జెక్ట్‌లో సాధించే మార్కులే కీలకపాత్ర పోషిస్తాయని చెప్పొచ్చు. ఇందుకు నిర్దేశిత సిలబస్ అంటూ ఏమి లేదు. ఇంగ్లిష్ భాషలో విద్యార్థుల ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. పదో తరగతి స్థాయి వరకు ఉండే గ్రామర్ అంశాలను నేర్చుకోవాలి. ఈ క్రమంలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, రీడింగ్ కాంప్రెహెన్షన్, ఐడియమ్స్, సినానిమ్స్, సెంటెన్సెస్ వంటి అంశాలపై దృష్టి సారించాలి. ఇందుకోసం ఆబ్జెక్టివ్ బిట్స్‌ను, గత ఏపీఆర్జేసీ ప్రశ్నపత్రాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. సబ్జెక్ట్‌లు సబ్జెక్ట్‌ల విషయానికొస్తే.. మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజీ, సోషల్ స్టడీస్‌ల నుంచి 10వ తరగతి స్థాయి సిలబస్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఇంపార్టెంట్, దృష్టి సారించాల్సిన అంశాలు అంటూ ఏమీ ఉండవు. అన్ని అంశాలను సమగ్రంగా చదవాల్సిందే. ఎందుకంటే ఇది అకడమిక్ పరీక్ష కాదు పోటీ పరీక్ష. విపరీతమైన పోటీ ఉండే ఈ పరీక్షలో ప్రతి మార్కూ కీలకమే. కాబట్టి సమగ్ర ప్రిపరేషన్ సాగించాలి. సంబంధిత పాఠ్యపుస్తకాలను ఆమూలగ్రం చదవాలి. ప్రతి పాఠ్యాంశం చివర్లో ఉన్న ముఖ్యాంశాలు, ఖాళీలు, బహుళైచ్ఛిక ప్రశ్నలు, అతి స్వల్ప సమాధాన ప్రశ్నలను బాగా ప్రాక్టీస్ చేయాలి. ముఖ్యమైన అంశాలను నోట్స్ రూపంలో పొందుపరుచుకోవడం ప్రయోజనకరం. మ్యాథమెటిక్స్: ప్రశ్నలు అప్లికేషన్ తరహాలో ఉండే అవకాశం ఉంది. మ్యాథమెటిక్స్‌లో అన్ని అంశాలకు సమప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి అన్ని అంశాలను సమగ్రంగా చదవాలి. క్షేత్రమితి, త్రికోణమితి, రేఖాగణితం, నిరూపక రేఖాగణితం చాప్టర్లు క్లిష్టమైనవి. కాబట్టి వీటిపై ఎక్కువ దృష్టి సారించాలి. అంతేకాకుండా సాధ్యమైనన్నీ షార్ట్‌కట్ మెథడ్స్, ఎలిమినేషన్ టెక్నిక్స్ నేర్చుకోవాలి. సాధారణ స్థాయి మొదలుకొని కఠిన స్థాయి ప్రశ్నలను సాధన చేయాలి. ఫిజికల్ సైన్స్: ఇందుకోసం కొంత విశ్లేషణాత్మకంగా ప్రిపేర్ కావాలి. కాబట్టి ముందుగా ప్రాథమిక భావనలపై పట్టు సాధించాలి. వివిధ భావనలకు సూత్రాలను అన్వయించి సమస్యలను సాధించడం నేర్చుకోవాలి. ప్రతి అధ్యాయంలోని సూత్రాలు, స్థిరాంకాలు, ముఖ్య రసాయన ఫార్ములాలను ఒక చోట చేర్చుకొని నిత్యం చదవడం ప్రయోజనకరం. పాఠ్యపుస్తకంలో ఉన్న వివిధ పట్ట్టికలను పరిశీలించాలి. జీవశాస్త్రం: జీవశాస్త్రంలో అన్ని అంశాలను సమగ్రంగా చదవాలి. అందులోని భావనలను, విషయాలను పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాలి. కీలక భావనలు, సమీకరణాలు, పదజాలాన్ని నోట్స్‌గా రాసుకోవాలి. ఈ క్రమంలో ప్రతి పాఠ్యాంశం చివర్లో ఉన్న ముఖ్యాంశాలు, ఖాళీలు, బహుళైచ్ఛిక ప్రశ్నలు, అతి స్వల్ప సమాధాన ప్రశ్నలను బాగా ప్రాక్టీస్ చేయాలి.సోషల్ స్టడీస్: ఇందులో జాతీయవాద ఉద్యమాలు, సామ్రాజ్యవాదం, సమకాలీన ప్రపంచం, భారతదేశ సాంస్కృతిక వారసత్వం, భారత స్వాతంత్య్రోద్యమం, భారతదేశ ఉనికి, క్షేత్రీయ అమరిక, భౌతిక రూపురేఖలు, శీతోష్ణస్థితి, భారత ప్రజాస్వామ్యం, ఐక్యరాజ్యసమితి, భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణం మొదలు అన్ని అంశాలను సమగ్రంగా చదవాలి. పుస్తకాల్లో ఇచ్చిన కీలక పదాలపై అవగాహన ఏర్పర్చుకోవాలి. ఎంపిక విధానం ప్రవేశ పరీక్షలో చూపిన ప్రతిభ, రిజర్వేషన్, స్పెషల్ కేటగిరీ, లోకల్ ఏరియా వంటి అంశాల ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు. ఎంఈసీ, సీఈసీ విద్యార్థులకు కంబైన్డ్ ర్యాంక్ ఇస్తారు. ఇద్దరూ విద్యార్థులకు సమానమైన మార్కులు వచ్చిన నేపథ్యంలో ఎంపీసీ గ్రూపు కోసం మ్యాథమెటిక్స్‌లో ఎక్కువ మార్కులు, బైపీసీ గ్రూపు కోసం బయాలజీలో ఎక్కువ మార్కులు, ఎంఈసీ/సీఈసీ గ్రూపుకోసం సోషల్ స్టడీస్‌లో ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు ప్రాధాన్యతనిస్తారు. అయినప్పటికీ సమాన మార్కులు వస్తే ఫిజికల్ సైన్స్‌లో ఎక్కువ స్కోర్ (ఎంపీసీ/బైపీసీ), మ్యాథమెటిక్స్‌లో ఎక్కువ స్కోర్ (ఎంఈసీ/సీఈసీ) చేసిన విద్యార్థిని పరిగణనలోకి తీసుకుంటారు. ఈ సందర్భంలో కూడా సమాన మార్కులు ఉంటే ఎక్కువ వయసు ఉన్న విద్యార్థికి ప్రాధాన్యతనిస్తారు. ఇదే సందర్భంలో బాలురు, బాలికలు ఉంటే బాలికలకు ప్రాధన్యత ఉంటుంది. ఇలా కూడా వీలుకాని పక్షంలో కమ్యూనిటీ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. ఎంఈసీని ఎంచుకున్న విద్యార్థికి ఎంఈసీలో ప్రవేశం లభించకపోతే, సీఈసీ గ్రూపు కోసం అతన్ని పరిగణనలోకి తీసుకుంటారు. సీఈసీ గ్రూపు కోసం కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తారు. అన్ని వసతులు తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలలో ప్రవేశం పొందిన విద్యార్థులు సంవత్సరానికి రూ. 1000 నిర్వహణ ఖర్చులను చెల్లించాల్సి ఉంటుంది. వీరికి నాణ్యమైన లేబొరేటరీలు, చక్కటి లైబ్రరీలు, విశాలమైన రీడింగ్ రూమ్‌లు వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా అన్ని వసతులతో కూడిన ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. ఇక్కడి విద్యార్థులకు క్రీడలు, యోగా తదితర అంశాల్లో శిక్షణనిస్తారు. భవిష్యత్‌కు సిద్ధం క్రమశిక్షణ, విలువలను నేర్పడంతో ఈ విద్యాసంస్థలు ఎప్పూడు ముందంజలో ఉంటాయి. విద్యార్థులను కేవలం ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్‌కే పరిమితం చేయకుండా.. వారిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దే విధంగా మరెన్నో అనుబంధ కోర్సుల్లో శిక్షణ కూడా లభిస్తుంది. వాటిలో.. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఎంసెట్, జేఈఈ వంటి జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు తొలిరోజు నుంచే సిద్ధం చేస్తారు. అదేవిధంగా ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులను సీఏ, ఐసీడబ్ల్యూఏ వంటి కోర్సుల్లో రాణించే తరహాలో శిక్షణనిస్తారు. ఎంఈసీ, సీఈసీ విద్యార్థులకు సీపీటీ (ఇ్కఖీ) మాదిరి పరీక్షలను కూడా నిర్వహిస్తారు. నిరంతర పర్యవేక్షణ నిరంతర పర్యవేక్షణ కోసం కార్పొరేట్ తరహాలో ప్రతి అధ్యాపకుడి(లోకో పేరెంట్‌గా వ్యవహరిస్తారు)కీ 15-20 మంది విద్యార్థులను కేటాయిస్తారు. వారి చదువు, క్రమశిక్షణ, వెనుకబడిన విద్యార్థులను ప్రోత్సహించడం, అసైన్మెంట్లు, మూ ల్యాంకనం, స్టడీ మెటీరియల్ అందించడం ఇవన్నీ ఆ అధ్యాపకుడే చూసుకుంటారు. ప్రతిరోజూ నిర్దేశిత సమయాల్లో స్టడీ అవర్స్ నిర్వహిస్తారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడానికి అధ్యాపకులు నిరంతరం అందుబాటులో ఉంటారు. ఫిజికల్, స్పోర్ట్స్ యాక్టివిటీస్‌కు తగినంత ప్రాధాన్యత ఉంటుంది. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విభాగాలనూ నిర్వహిస్తారు. నోటిఫికేషన్ సమాచారం అర్హత: 10వ తరగతి మొదటి ప్రయత్నంలోనే మార్చి/ఏప్రిల్, 2015 పరీక్షలలో ఉత్తీర్ణులై ఉండాలి. ఓసీ విద్యార్థులు 6 జీపీఏ, బీసీ/ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు 5 జీపీఏ సాధించాలి. ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లో అందరూ విద్యార్థులు 4 జీపీఏ సాధించి ఉండాలి. గతంలో ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 18, 2015. దరఖాస్తు రుసుం: రూ. 150. హాల్ టికెట్ల డౌన్లోడ్: మే 1 నుంచి 6 వరకు. పరీక్ష తేదీ: మే 10, 2015. వెబ్సైట్: http://tsrjdc.cgg.gov.in, http://tresidential.cgg.gov.in గ్రూప్ ఎంపికలో జాగ్రత్త టీఎస్ఆర్జేసీ-2015 పదో తరగతి కొత్త సిలబస్ ఆధారంగా ఉంటుంది. కానీ పరీక్ష స్వరూపంలో ఎలాంటి మార్పులు లేవు. టీఎస్ఆర్జేసీ ఔత్సాహిక అభ్యర్థులు ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి చేసే సమయంలో గ్రూప్ ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అభ్యర్థులు తాము ఎంచుకున్న గ్రూప్ ఆధారంగా సంబంధిత సబ్జెక్ట్లలోనే ప్రశ్నలుంటాయి. కాబట్టి గ్రూప్ ఎంపికలో ఆసక్తికి ప్రాధాన్యం ఇవ్వడం ముఖ్యం. టీఎస్ఆర్జేసీ ప్రాంగణాలు అన్నింటిలోనూ అన్ని గ్రూప్‌లలోనూ బోధన, ఇతర అకడమిక్ సదుపాయాలు ఎంతో మెరుగ్గా ఉంటాయి. అంతేకాకుండా నాగార్జునసాగర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించడంతో నల్గొండ జిల్లాలోని సర్వేల్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో విస్తృత సదుపాయాలు, వసతులు అందించే విధంగా కృషి చేస్తున్నాం. ఈ క్యాంపస్‌లో కేవలం ఇంటర్మీడియెట్ కోర్సు బోధనే కాకుండా భవిష్యత్తులో జేఈఈ, ఎంసెట్ వంటి ఇంజనీరింగ్, మెడికల్ పోటీ పరీక్షలు, సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యుఏ వంటి కామర్స్ ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించిన శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ క్యాంపస్‌ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్దే దిశగా కృషి చేస్తున్నాం. అందుకే ఈ క్యాంపస్‌కు తెలంగాణలోని అన్ని జిల్లాల అభ్యర్థులకు అర్హత కల్పించాం. - బి. శేషు కుమారి, సెక్రటరీ, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ. ఇన్పుట్స్: నాగరాజశేఖర్, కరుణాకర్ రెడ్డి, కట్టా కవిత.