గ్రూప్‌–2 తుది జాబితా విడుదల | TSPSC Group 2 final list released in telangana | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–2 తుది జాబితా విడుదల

May 23 2025 1:58 AM | Updated on May 23 2025 1:58 AM

TSPSC Group 2 final list released in telangana

783 ఉద్యోగాలకు 777 మంది ఎంపిక 

టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అభ్యర్థుల జాబితా 

జూన్‌ 10 వరకు ధ్రువపత్రాల పరిశీలన

గైర్హాజరైతే తదుపరి చాన్స్‌ లేనట్లే: టీజీపీఎస్సీ

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–2 ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థుల తుది జాబితాను తెలంగాణ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ గురువారం విడుదల చేసింది. మొత్తం 783 ఉద్యోగాలకు గాను 777 మంది మాత్రమే ఎంపికయ్యారు. ఇందులో ఇద్దరు స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థులున్నారు. అభ్యర్థుల జాబితాను కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. తుది  జాబితాలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈనెల 29 నుంచి జూన్‌ 10వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికొలస్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ పరిశీలన కొనసాగుతుంది. పెండింగ్‌ ధ్రువపత్రాల సమర్పణకు జూన్‌ 11వ తేదీని కమిషన్‌ రిజర్వ్‌ చేసింది.  

సురవరం వర్సిటీలో ధ్రువపత్రాల పరిశీలన 
నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌ సమీపంలో ఉన్న సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ (పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ)లో ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని టీజీపీఎస్సీ వెల్లడించింది. అభ్యర్థుల హాల్‌టిక్కెట్‌ నంబర్ల వారీగా పరిశీలన షెడ్యూల్‌ను ఈనెల 26న వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది. అభ్యర్థులు పూర్తిస్థాయి సరి్టఫికెట్లతో హాజరు కావాలని, ఏవైనా కారణాలతో పరిశీలనకు గైర్హాజరైతే తదుపరి అవకాశం ఉండదని  స్పష్టం చేసింది. ఉద్యోగాలకు అభ్యర్థులు తగ్గితే (షార్ట్‌ఫాల్‌) తదుపరి మెరిట్‌ నుంచి ఎంపిక చేసి పరిశీలన ప్రక్రియ పూర్తి చేస్తామని వివరించింది. ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియకు సమాంతరంగా వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ జరుగుతుంది.  

2022లో నోటిఫికేషన్‌ 
గ్రూప్‌–2 సర్విసులకు సంబంధించి 18 కేటగిరీల్లో 783 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ 2022 డిసెంబర్‌ 29న నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2023 జనవరి 18నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు... దాదాపు నెలరోజుల పాటు ఆన్‌లైన్‌ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించింది. 5,51,855 మంది దరఖాస్తు చేసుకోగా పరీక్షలు దాదాపు మూడుసార్లు వాయిదా పడ్డాయి. చివరకు గతేడాది డిసెంబర్‌ 15, 16 తేదీల్లో.. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో ఏర్పాటు చేసిన 1,368 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించింది. అయితే 2,49,964 మంది అభ్యర్థులు మాత్రమే నాలుగు పేపర్లు రాశారు. అయితే 777 మంది మాత్రమే ఉద్యోగాలకు ఎంపికయ్యారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement