టీఆర్‌ఎస్‌ ఎదురుదాడి | TRS Counters With Statistics Over Opposition Parties Critisism On Government Jobs | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ ఎదురుదాడి

Feb 27 2021 3:44 AM | Updated on Feb 27 2021 3:44 AM

TRS Counters With Statistics Over Opposition Parties Critisism On Government Jobs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, వేతన సవరణ (పీఆర్‌సీ) వంటి అంశాల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీఆర్‌ఎస్‌.. ప్రస్తుతం జరుగుతున్న శాసనమండలి పట్టభద్రుల కోటా ఎన్నికల్లో ప్రతి విమర్శలకు సిద్ధమవుతోంది. తెలం గాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గడిచిన ఆరున్నరేళ్లలో యువత, నిరుద్యోగుల కోసం ఉద్యోగాల భర్తీ, వేతనాల పెంపు వంటి అంశాలపై రోజుకో నివేదిక విడుదల చేయడం ద్వారా విపక్షాల విమర్శలకు చెక్‌ పెట్టాలని భావిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, వేతనాల పెంపు వంటి అంశాలు పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకం కానుండటంతో ఆయా అంశాలకు సంబంధించిన గణాంకాలను ఎన్నికల ప్రచార ఎజెండాగా మార్చుకోవాలని నిర్ణయిం చింది.

ఇందులో భాగంగానే 2014 జూన్‌ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 1.32 లక్షల ప్రభుత్వ ఉద్యో గాలు భర్తీ చేశామని, దీనిపై ఎవరికైనా సందేహాలు ఉంటే చర్చకు సిద్ధమని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె. తారక రామారావు రెండు రోజుల క్రితం నిర్వహించిన మీడియా సమావేశంలో సవాల్‌ చేశారు. దీనిపై చర్చకు సిద్ధమంటూ కాంగ్రెస్, బీజేపీ నుంచి ప్రతిస్పందన రావడంతో 1.32 లక్షల ఉద్యోగాల కల్పనకు సంబంధించిన గణాంకాలను ప్రభుత్వ విభాగాలవారీగా విడుదల చేసిన కేటీఆర్‌... సందేహాలుంటే సంబంధిత విభాగాల్లో సరిచూసుకోవాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీపాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై శ్వేతపత్రం, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తా మంటూ గతంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు, ప్రభుత్వరంగ సంస్థలను నిర్వహించలేమనే ప్రధాని ప్రకటనలు తదితరాలపై టీఆర్‌ఎస్‌ అటు మీడియా, ఇటు సోషల్‌ మీడియాలో ఎదురుదాడి చేస్తోంది.

ప్రచారాస్త్రంగా వేతనాల పెంపు...
వేతన సవరణ కమిషన్‌ (పీఆర్‌సీ) సిఫార్సులపై విమర్శలతోపాటు వేతన సవరణపై ప్రభుత్వ ప్రకటనలో జాప్యంపై ప్రభుత్వ ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తి పట్టభద్రుల ఎన్నికలపై ప్రభావం చూపకుండా టీఆర్‌ఎస్‌ జాగ్రత్తలు తీసుకుంటోంది. తమది ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వమని ప్రకటించిన పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌... తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులతో తమకున్న అనుబంధాన్ని మరోమారు తెరమీదకు తెచ్చారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారం చేపట్టిన తర్వాత అత్యధికంగా 43 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేయడంతోపాటు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న చిరుద్యోగులకు వేతనాలు సవరించిన తీరుపై తాజాగా గణాంకాలు విడుదల చేశారు.

అంగన్‌వాడీ కార్యకర్తలు, పారిశుద్ధ్య సిబ్బంది, హోంగార్డులు, జీహెచ్‌ఎంసీ కార్మికులు తదితరులతో సీఎం స్వయంగా భేటీ కావడంతోపాటు వేతనాలు పెంచిన విషయాన్ని ఎన్నికల ప్రచారంలో గుర్తుచేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. చిరుద్యోగుల జీతాలను రెట్టింపు చేయడంతోపాటు ప్రతి నెలా వేతనాలు అందేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేయడాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల ఓట్లను కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వేతనాలు రెట్టింపు చేసిన విషయాన్ని ఎన్నికల ప్రచారాంశాల్లో చేర్చాలని పార్టీ నిర్ణయించింది.

హోంగార్డుల నుంచి పారిశుద్ధ్య కార్మికుల దాకా...
రాష్ట్ర ఆవిర్భావానికి పూర్వం రూ. 9 వేలుగా ఉన్న హోంగార్డుల వేతనం ప్రస్తుతం రూ. 23,250కి చేరగా, 108 సిబ్బందికి రూ. 4 వేలు చొప్పున పెరిగింది. వీఆర్‌ఏలకు రూ. 10,500, వీఏఓలకు రూ. 5 వేలు, కాంట్రాక్టు లెక్చరర్లకు రూ. 37,100 వేతనాలు ఇస్తున్న విషయాన్ని తాజా నివేదికలో టీఆర్‌ఎస్‌ పేర్కొంది. వీరితోపాటు ప్రధానంగా అటెండర్లు, ఉపాధి హామీ ఉద్యోగులు, సెర్ప్, ఆశా వర్కర్లు, అర్చకులు, సీఆర్‌టీలు, పీఈటీలు, ఏఎన్‌ఎంలు తదితరులకు ఆరున్నరేళ్లలో వేతనాలు పెంచిన తీరును గణాంకాలతో సహా ప్రసంగాలు, కరపత్రాలు, సామాజిక మాధ్యమాల ద్వారా ఓటర్లకు వివరించాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. దీంతోపాటు ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కల్పనకు సంబంధించి పారిశ్రామిక, ఐటీ రంగాల్లో పెరిగిన ఉద్యోగ అవకాశాలపైనా గణాంకాలను విడుదల చేయాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement