రైతు ఆందోళనలకు సంఘీభావంగా కరీంనగర్‌లో ట్రాక్టర్‌ ర్యాలీ

tractor rally held in karimnagar in solidarity of farmers protest in delhi under auspices of cpi, cpm parties - Sakshi

కరీంనగర్‌: నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ ఆందోళనకు సంఘీభావంగా కరీంనగర్‌లో కమ్యూనిస్టులు కదంతొక్కారు. జిల్లా నలుమూలల నుంచి సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ట్రాక్టర్లతో కరీంనగర్‌కు చేరుకొని నగరంలో భారీ ర్యాలీని నిర్వహించారు. నగర పురవీధుల గుండా సాగిన ర్యాలీలో.. కమ్యూనిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని, కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను విడనాడి, నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

నెలల తరబడి ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతోనే నేడు ఢిల్లీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో జరిగిన ఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. రైతుల ఆందోళన ప్రజా ఉద్యమంగా మారితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇప్పటికైన కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని నూతన వ్యవసాయ చట్టాలు మూడింటిని రద్దు చేయాలని ఉభయ కమ్యునిస్టులు డిమాండ్‌ చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top