మావో దాడుల్లో హిడ్మాది ప్రత్యేక శైలి
పారా మిలిటరీకి సవాల్‌గా నిలిచిన హిడ్మా ‘హిడ్మా’ వల్లే ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు
ఆయన మరణంతో సాయుధ పోరాటంపై సన్నగిల్లుతున్న ఆశలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఏపీలో ఇటీవల జరిగిన ఎదురుకాల్పుల్లో హిడ్మా మృతితో విప్లవ శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యం అలముకుంది. రాజ్యాంగ పరిధిలోని కమ్యూనిస్టు పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి కగార్‌ను ఆపేయాలంటూ లేఖ విడుదల చేశాయి. సాయుధ పోరాటం మరో కొత్త రూపం తీసుకుంటుందని చెబుతూ.. రాబోయే మార్పునకు ముందస్తు సంకేతాలను విప్లవ శ్రేణులు అందిస్తున్నాయి. ఇదే సమయాన హిడ్మా మరణంతో దేశంలో మావోయిస్టులది ముగిసిన అధ్యాయమేనంటూ కమ్యూనిస్టు వ్యతిరేకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా కగార్ మొదలయ్యాక జరిగిన నష్టాలన్నీ ఒక ఎత్తయితే.. హిడ్మా మరణం మరో ఎత్తు అన్నట్టు ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి.
మీడియాకు హాట్ టాపిక్
హిడ్మాకు ముందు తరం మావోయిస్టులు.. పోలీసులు, అటవీ శాఖతోనే ఎక్కువగా పోరాడగా, ఏకంగా పారా మిలిటరీ సైన్యానికే సవాల్ విసిరిన చరిత్ర హిడ్మాది. అంబూష్ దాడులు చేసి జవాన్లనే బందీలుగా పట్టుకున్న తీరు ఇప్పటికీ ఆశ్చర్యకరమే. ఈ బందీలను విడిపించేందుకు మరోసారి అడవిలోకి వెళ్లే సాహసం పారా మిలిటరీ బలగాలే చేసేవి కావు. మీడియా ప్రతినిధుల ద్వారానే బందీలను విడిపించుకునేవి. అందుకే మీడియా వర్గాలకు హిడ్మా ఒక హాట్ టాపిక్‌గా మారాడు. దీంతో టాస్క్‌ఫోర్స్, జాయింట్ టాస్క్‌ఫోర్స్, బస్తర్ ఫైటర్స్, కోబ్రా వంటి ప్రత్యేక దళాల అవసరం పడింది. బీఎస్‌ఎఫ్, ఐటీబీటీల వంటి మిలిటరీ విభాగాలను రంగంలోకి దించాల్సిన పరిస్థితి ఎదురైంది. అయినా పట్టు దొరక్క.. మాజీ మావోయిస్టులతో ఏర్పడిన డీఆర్‌జీ వంటి లోకల్ దళాలు కూడా యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్‌లో భాగమయ్యాయి.
మిలిటరీ అయినా జాగ్రత్తలు తప్పలేదు
హిడ్మా నేతృత్వాన చేసిన దాడులతోనే పీఎల్‌జీఏకు భారీ ఎత్తున ఆధునిక ఆయుధాలు సమకూరాయి. ఆయన అండతోనే దక్షిణ బస్తర్ సబ్‌జోన్‌గా పేర్కొనే సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దులో జనతన సర్కార్లు ఏర్పాటయ్యాయి. ఈ సర్కార్లను నిర్వీర్యం చేసేందుకు జోన్‌లో ప్రతీ నాలుగు కిలోమీటర్లకు ఒక క్యాంపు వంతున ఏర్పాటు వ్యూహాన్ని బలగాలు అమలు చేశాయి. అయితే, దేశంలో మిగిలిన క్యాంప్‌లతో పోలిస్తే అత్యంత కట్టుదిట్టమైన రక్షణ చర్యలు ఇక్కడ తీసుకోవాల్సి వచ్చింది. ప్రతీ క్యాంపు చుట్టూ ప్రహరీ, అవతల ట్రెంచ్‌తో పాటు మూడు వరుసల ముళ్ల కంచెలు ఉంటాయి.
ప్రతీ క్యాంప్ చుట్టూ నలువైపులా రెండు ఎకరాలకు విస్తీర్ణానికి తగ్గకుండా చుట్టూ దట్టంగా ఉన్న అడవిని నరికి మైదాన ప్రాంతంలా మార్చి, నలువైపులా రాత్రి పూట స్పష్టంగా కనిపించేలా ఫ్లడ్ లైట్లు వెలిగేలా ఏర్పాట్లు చేశారు. రాకెట్ లాంచర్లతో దాడి జరిగితే నష్టాన్ని తగ్గించేందుకు వీలుగా క్యాంప్‌లో ఉండే రేకుల షెడ్డు బ్యారక్‌లపైన ఇనుప జాలీలను ఏర్పాటు చేశారు. రాత్రివేళ దాడులను అరికట్టేందుకు ఆకాశంలో వెలుతురు విరజిమ్మే ఫ్లవర్ బాంబులను అందుబాటులో పెట్టారు. దాడుల్లో గాయపడిన జవాన్లకు సత్వర వైద్యసాయం అందించేందుకు వీలుగా ప్రతీ క్యాంప్‌లో ఒక హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. డ్రోన్ల సాయంతోనే కూంబింగ్‌లు చేపట్టారు. మందుపాతరలను కనిపెట్టేందుకు స్నైపర్ డాగ్స్‌ను కూంబింగ్‌లో తోడుగా తీసుకెళ్తున్నారు.
మావో బాటలో గెరిల్లా వార్
మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ హోదాలో నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌లో మరణం, పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌రావు ఆయుధాలతో సహా లొంగిపోగా.. మరో అగ్రనేత తక్కళ్లపల్లి వాసుదేవరావు ఏకంగా 210 మంది అనుచరులతో అడవిని వీడాడు. ఇలా వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నా విప్లవ శ్రేణుల్లో ఆశలు కొడిగట్టిపోకుండా ఉండడానికి ప్రధాన కారణం మడ్వి హిడ్మా. ఆయన ఉంటే చాలు సాయుధ పోరాటం మళ్లీ గాడిన పడుతుందనే నమ్మకం వారిలో ఉండేది. మార్క్స్, లెనిన్ తదితర విప్లవ గురువులు చెప్పిన కమ్యూనిజం గురించి హిడ్మాకు పెద్దగా తెలియదంటూ మాజీ మావోలు, ఛత్తీస్‌గఢ్ పోలీస్ బాస్‌లు, స్థానిక ఆదివాసీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేసేవారు. అయినప్పటికీ హిడ్మాపై విప్లవకారులు నమ్మకం కోల్పోలేదు. ఎందుకంటే మావో సేటూంగ్ చూపిన గెరిల్లా యుద్ధతంత్రాన్ని అమలుచేస్తూ సాయుధ పోరాటాన్ని దండకారణ్యంలో మరో ఎత్తులకు తీసుకెళ్లింది హిడ్మానే. అందుకే ఆయన మరణంతో సాయుధ పోరాటం రూపురేఖలు, దశాదిశ మారిపోయే పరిస్థితి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


