‘పిప్పల్‌కోటి’ వద్ద మళ్లీ పులి

Tiger Spotted In Adilabad District - Sakshi

తాంసి: ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం తాంసి(కె), గొల్లఘాట్‌ గ్రామాల శివారు అటవీప్రాంతంలో కూలీలకు శనివారం అర్ధరాత్రి పులి కనిపించింది. దీంతో భయాందోళనకు గురైన వారంతా కేకలు వేయడంతో పులి అక్కడి నుంచి అడవి వైపు వెళ్లింది. పిప్పల్‌కోటి రిజర్వాయర్‌ నిర్మాణ పనుల కోసం కూలీలు అక్కడే ఉంటున్నారు. తమకు సమీపంలోనే పులి కనిపించడంతో పనులను నిలిపివేసిన కూలీలు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్‌ సెక్షన్‌ అధికారి ప్రేమ్‌సింగ్‌ బేస్‌క్యాంపు సిబ్బందితో వచ్చి పులి సంచరించిన ప్రదేశాలను పరిశీలించారు.

పాదముద్రలను చూసి, కూలీలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సీసీ కెమెరాలను పరిశీలించగా పులి ఆ ప్రాంతాల్లోనే సంచరించినట్లు రికార్డయి ఉంది. ఐదు రోజుల క్రితం పిల్లలతో కలసి సంచరించిన పులి ప్రస్తుతం ఒక్కటే కనిపించడంతో పిల్లలను వదిలేసిందా.. లేక ఇది వేరే పులా అని నిర్ధారించాల్సి ఉంది. మరోవైపు అటవీ సమీప గ్రామాల ప్రజలు, రిజర్వాయర్‌ నిర్మాణం వద్ద ఉన్న కూలీలు అప్రమత్తంగా ఉండాలని సెక్షన్‌ అధికారి ప్రేమ్‌సింగ్‌ సూచించారు. ఆయన వెంట యానిమల్‌ ట్రాకర్స్‌ కృష్ణ, సోనేరావు, బేస్‌క్యాంపు సిబ్బంది ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top