భూపాలపల్లి అడవుల్లో మగ పులి

A Tiger is Roaming in the Forests of Bhupalpally District - Sakshi

తాడోబా, ఇంద్రావతి నుంచి వచ్చి ఉండవచ్చని  అధికారుల అంచనా

నాలుగు రోజులుగా సంచారం  

సాక్షి, భూపాలపల్లి: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా అడవుల్లో పులి సంచరిస్తోంది. నాలుగు రోజులుగా జిల్లాలోని అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పులిని.. మగపులిగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. తాడోబా లేదా ఇంద్రావతి అడవుల నుంచి రావొచ్చని అంచనా వేశారు. పులికి ఎటువంటి హాని జరగకుండా అటవీశాఖ అధికారులు అప్రమత్తం అవుతుండగా.. అటవీ గ్రామాల ప్రజలు మాత్రం ఆందోళన చెందుతున్నారు.  

17 ఏళ్ల తర్వాత 

దట్టమైన అడవులు కలిగిన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్‌ సమీప అడవుల్లో 2003లో ఏడు పులులు ఉన్నట్లుగా అప్పటి అటవీశాఖ అధికారులు గుర్తించారు. అనంతరం 2009లో పాకాల సమీపంలోని రాంపూర్‌ అడవుల్లో ఒక పులి కనిపించింది. ఆ తర్వాత ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఎక్కడా పులుల జాడ కనిపించలేదు. కాగా గత నెల 30న మహాముత్తారం మండలం యామన్‌పల్లి అడవుల్లో పులి అడుగులను జిల్లా అటవీశాఖ అధికారులు గుర్తించారు.

ఈ క్రమంలోనే నిమ్మగూడెంకు చెందిన ఓ రైతు తన ఆవు మేతకు వెళ్లి అడవిలో మృత్యువాత పడినట్లుగా గుర్తించాడు. మృతి చెందిన ఆవుపై పులి గాట్లు స్పష్టంగా కనిపించాయి. సోమవారం అదే పులి మహాముత్తారం మండలంలోని మహబూబ్‌పల్లి సమీపంలో గల బంగారుబాట మీదుగా, ఈ నెల 1న రాత్రి మరోమారు యామన్‌పల్లి–ఆజంనగర్‌ అడవుల్లో సంచరించినట్లుగా బుధవారం అటవీశాఖ అధికారులు గుర్తించారు. అయితే బుధవారం సాయంత్రం మళ్లీ అదే పులి అడుగులు మల్హర్‌ మండలంలోని కిషన్‌రావుపల్లి సమీప అటవీ ప్రాంతంలో కనిపించడంతో అటవీశాఖ అధికారులతో పాటు అటవీ గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జిల్లా అడవుల్లో పులి నాలుగు రోజులుగా సంచరిస్తుందనే వార్త దావనంలా వ్యాపించింది.  

 అప్రమత్తంగా ఉండండి: డీఎఫ్‌ఓ  

జిల్లా అడవుల్లోకి పులి రావడం సంతోషకరమని డీఎఫ్‌ఓ పురుషోత్తం అన్నారు. కొత్తగా ఎక్కడ అడుగు జాడలు కనిపించినా తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. అటవీ గ్రామాల ప్రజలు ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒకరిద్దరు అడవుల్లోకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడదని, వేట కోసం విద్యుత్‌ తీగలు, ఉచ్చులు ఎవరూ అమర్చకూడదన్నారు.

చదవండి: బొగ‌తా జ‌ల‌పాతంలో సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ గ‌ల్లంతు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top