చర్చలు విఫలం కావడంతో సమ్మె ప్రకటన చేస్తున్న ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు
చర్చలు విఫలం.. నేడు తొలి షిఫ్ట్ నుంచి ఆర్టీసీ బస్సులు బంద్
సమ్మె నోటీసు ఇచ్చిన జేఏసీకి మద్దతు ప్రకటించిన రెండో జేఏసీ
భారీగా తాత్కాలిక సిబ్బందిని సమకూర్చుకుంటున్న ఆర్టీసీ
యథావిధిగా తిరగనున్న ఎలక్ట్రిక్ బస్సులు సహా ఆరీ్టసీలోని అద్దె బస్సులు
తాత్కాలిక సిబ్బందితో మరో 2 వేల బస్సులు తిప్పే యత్నం
సగానికిపైగా బస్సులు రోడ్డెక్కేలా ఆర్టీసీ యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు..
బస్సులు తిరగకుండా అడ్డుకునే ప్రయత్నంలో సంస్థ కండక్టర్లు, డ్రైవర్లు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంతో జరిగిన చర్చ లు విఫలం కావటంతో ఆర్టీసీ కారి్మక సంఘాలు సమ్మె ప్రారంభించాయి. బుధవారం తెల్లవారుజాము తొలి సరీ్వసు నుంచి బస్సులను స్తంభింపజేయాలని నిర్ణయించాయి. మరోవైపు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు చర్యలు ప్రారంభించింది.
రవాణా శాఖ సహాయంతో తాత్కాలిక పద్ధతిలో పనిచేసేందుకు డ్రైవర్లు, కండక్టర్లను ఆర్టీసీ సిద్ధం చేసుకుంటోంది. ఈ ప్రత్యామ్నాయ చర్యలు పూర్తిస్థాయిలో కొలిక్కి వచ్చేందుకు సమయం కావాల్సి ఉన్నందున, సమ్మె తొలిరోజైన బుధవారం ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి.
నాలుగు వారాల గడువుకు ససేమిరా...
బుధవారం తెల్లవారుజాము తొలి సరీ్వసు నుంచి సమ్మెకు వెళ్తున్నామని ఆరీ్టసీలో ఓ జేఏసీ వారం క్రితమే ప్రకటించినప్పటికీ, ప్రభుత్వం చర్చలకు సిద్ధం కాలేదు. మంగళవారం సాయంత్రం హడావుడిగా నలుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసి కారి్మక సంఘాలతో చర్చించాలని ఆదేశించింది.
రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కూడిన కమిటీ మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు సచివాలయంలో కారి్మక సంఘాలతో చర్చలు ప్రారంభించింది. సంఘాల వారీగా దాదాపు మూడు గంటలపాటు వారి డిమాండ్లపై అభిప్రాయాలు సేకరించిన అనంతరం, వాటి పరిష్కారం విషయంలో ప్రభుత్వానికి కొంత సమయం కావాలని కమిటీ సభ్యులు వెల్లడించారు.
ఇందుకు నాలుగు వారాల సమయం అవసరమవుతుందని, గడువు నాటికి ప్రభుత్వం నుంచి స్పందన ఉంటుందన్నారు. దీనికి కార్మిక సంఘాలు అంగీకరించలేదు. సమ్మె నోటీసు ఇచి్చన థామస్‌రెడ్డి, ఈదురు వెంకన్నతో కూడిన జేఏసీ ప్రతినిధులు వెంటనే సమావేశ మందిరం నుంచి వెలుపలికి వచ్చి, చర్చలు విఫలమయ్యాయని, యథావిధిగా సమ్మె ప్రారంభమవుతుందని ప్రకటించారు.
అశ్వత్థామరెడ్డి, నరేందర్‌తో కూడిన రెండో జేఏసీ నేతలు కాసేపు అంతర్గతంగా చర్చించుకుని, చివరకు తాము కూడా సమ్మెకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. రెండు జేఏసీల్లో లేని మిగతా సంఘాలు కూడా సమ్మెకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించాయి. దీంతో అన్ని సంఘాలు బుధవారం తెల్లవారుజాము నుంచి సమ్మె ప్రాంభిస్తున్నట్టు రాత్రి పదింటికి ప్రకటించాయి.
ప్రభుత్వమే సమ్మెకు వెళ్లేలా చేసింది: థామస్‌రెడ్డి, ఈదురు వెంకన్న
‘సమ్మె డిమాండ్లలో ఉంచిన 32 అంశాలు చాలాకాలంగా కొనసాగుతూ వస్తున్నవే. వాటిని పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తెచ్చాం. ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వం స్పందించలేదు. ఆ తర్వాత రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో మాట్లాడగా, ప్రభుత్వం సానుకూలంగా స్పందింస్తుందని చెప్పటంతో వేచి చూశాం.
కానీ, ఆయన కూడా స్పష్టమైన హామీకి ముందుకు రాకపోవటంతో విధిలేని పరిస్థితిలో సమ్మెకు సిద్ధమయ్యాం. ప్రభుత్వం కూడా స్పందించలేదు. సమ్మెకు కొన్ని గంటల ముందు ఆదరాబాదరాగా అధికారుల కమిటీ వేసి ప్రభుత్వం కాలయాపన ప్రయత్నం చేసింది. మా డిమాండ్లపై ఎలాంటి హామీ ఇవ్వకుండా నాలుగు వారాల గడువు కావాలని కోరటం దారుణం. సమ్మె చేస్తే చేస్కోండి అన్న తరహాలో సంస్థ వ్యవహరిస్తోంది.
మేం చాలా సమయం ఇచ్చినా స్పందించకుండా ప్రభుత్వమే తమను సమ్మెకు వెళ్లేలా చేసింది. కారి్మకులంతా సమ్మెకు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం ఎంత బెదిరింపులకు దిగినా సమ్మె ఆగదు, కొనసాగుతుంది. ‘ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి కొన్ని ప్రధాన డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇస్తే మేం పునరాలోచిస్తాం’ అని రెండో జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, నరేందర్ తదితరులు తెలిపారు.
వేగంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు...
డ్రైవర్లు, కండక్టర్లు సమ్మె విషయంలో గట్టిగా ఉన్నప్పటికీ, మెకానిక్ సిబ్బంది కొంత ఊగిసలాటలో ఉన్నారు. దీంతో శ్రామిక్‌లు, మెకానిక్‌లలో ఎక్కువ మంది విధులకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇక సిబ్బందిని సరఫరా చేసే ఏజెన్సీల నుంచి ఎనిమిది వేల మందిని తాత్కాలిక పద్ధతిలో పనిచేసేందుకు ఆర్టీసీ సమకూర్చుకుంది.
ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,100 అద్దె బస్సులు యథావిధిగా తిరగనున్నాయి. మరో 500 ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కుతాయి. తాత్కాలిక సిబ్బంది సహకారంతో మరో 2 వేల బస్సులను తిప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వెరసి సగానికిపైగా బస్సులను తిప్పటం ద్వారా ప్రయాణికులకు పెద్దగా ఇబ్బంది లేకుండా చూసేందుకు ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది.
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ వసతి అందుబాటులోకి వచ్చిన తర్వాత బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో బాగా పెరిగిన విషయం తెలిసిందే. గతంలో నిత్యం ఆర్టీసీ బస్సుల్లో 35 లక్షల మంది ప్రయాణించగా, ఈ పథకం ప్రారంభమయ్యాక ఆ సంఖ్య 60 లక్షలను మించింది. ఇందులో 43 లక్షల మంది మహిళలే ఉంటున్నారు.
గతంలో సమ్మె జరిగినప్పుడు ఆ 35 లక్షల మందికే ఇబ్బంది కలగగా ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపు కానుంది. మళ్లీ ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలకు గిరాకీ పెరగనుంది. దీంతో వాటి చార్జీ కూడా పెరగనుంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లను అడ్డుకునేందుకు ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు ప్రయత్నిస్తున్నారు.


