ఎన్టీఆర్‌ భవన్‌ లీజును రద్దు చేయండి

Terminate NTR Building Lease: NTR Trust Bhavan Employees - Sakshi

ట్రస్టు పేరుతో లీజుకు తీసుకుని కాల్‌సెంటర్లకు అద్దెకిచ్చారు 

ప్రైవేట్‌ హోటల్, క్యాంటీన్‌ నడిపిస్తూ చంద్రబాబు సిబ్బందికి లాడ్జిగా మార్చారు 

మాకు పీఎఫ్, ఇన్సూరెన్స్‌ లేదు.. కనీసం గుర్తింపు కార్డూ లేదు 

న్యాయం చేయాలని కోరుతూ టీడీపీ లెటర్‌ప్యాడ్‌పై సీఎం కేసీఆర్‌కు లేఖ 

కలకలం రేపుతున్న తెలంగాణ ప్రాంత ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ ఉద్యోగుల లేఖ 

సాక్షి, హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ లీజును రద్దు చేయాలంటూ ఆ భవన్‌లో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగుల పేరిట వెలువడిన ఓ లేఖ కలకలం సృష్టిస్తోంది. లీజు ప్రాతిపదికన ప్రభుత్వం నుంచి తీసుకున్న ఈ భవన్‌లో లీజు నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, ఏకంగా కాల్‌ సెంటర్లకు భవన్‌లోని కొంత భాగాన్ని అద్దెకు ఇచ్చారని, వెంటనే పరిశీలించి లీజును రద్దు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరుతూ ఈ లేఖ రాశారు.

‘తెలంగాణ ఆత్మగౌరవ లేఖ’పేరిట టీడీపీ రాష్ట్ర కార్యాలయం లెటర్‌ప్యాడ్‌పై బుధవారం రాసిన ఈ లేఖ వివరాల్లోకి వెళితే.. ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం అయిన ఎన్టీఆర్‌ భవన్‌లో 15 ఏళ్లుగా పనిచేస్తున్నాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఆంధ్ర ప్రాంతం వారి పెత్తనం కొనసాగుతోంది. ట్రస్ట్‌ భవన్‌ నిర్వహణ అంతా ఆంధ్ర ప్రాంత ఉద్యోగుల చేతుల్లోనే ఉంది. తెలంగాణ నేతలకు పదవి తప్ప పవర్‌ ఉండదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణకు కూడా ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులపై అజమాయిషీ ఉండదు. దశాబ్దాలుగా పనిచేస్తున్నా తమను ట్రస్ట్‌ భవన్‌ ఉద్యోగులుగా గుర్తించడం లేదు. పీఎఫ్, ఇన్సూరెన్స్‌ సౌకర్యాలు లేవు. కనీసం ఉద్యోగులకు గుర్తింపు కార్డు కూడా ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా తీసివేసినా ఎలాంటి ఆధారాల్లేకుండా చేశారు.

ఇన్నాళ్లు రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకున్న ఈ ట్రస్ట్‌ భవన్‌ను ఇప్పుడు పరిస్థితులు బాగాలేక పోవడంతో ఆర్థిక వనరుగా, వ్యాపార కేంద్రంగా ఉపయోగించుకుంటున్నారు. భవన్‌లోని పలు విభాగాలను చంద్రబాబు సిబ్బందికి వసతి గదులుగా వినియోగిస్తున్నారు. ప్రైవేట్‌ హోటల్, క్యాంటీన్‌ నడుస్తున్నాయి. ప్రైవేట్‌ కాల్‌సెంటర్‌కు అద్దెకు ఇచ్చారు. ట్రస్టు పేరుతో లీజుకు తీసుకున్న స్థలంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించకూడదు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ట్రస్ట్‌ భవన్‌ లీజును రద్దు చేసి మాకు ఆ కార్యాలయంలోనే మెరుగైన వేతనాలతో పనిచేసే అవకాశం కల్పించాలి.’అని ఎన్టీఆర్‌ భవన్‌ తెలంగాణ ఉద్యోగుల పేరిట విజ్ఞప్తి చేయడం గమనార్హం.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top