
హైదరాబాద్, సాక్షి: నగరంలో పలుచోట్ల వర్షం దంచికొడుతోంది. సికింద్రాబాద్, బేగంపేట్, బోయిన్‌పల్లి, బంజారాహిల్స్, మోహిదీపట్నం, ఆసిఫ్‌నగర్, కార్వాన్, మలక్‌పేట్, సైదాబాద్, చాదర్ ఘాట్, మారేడుపల్లి, షేక్‌పేట్, మాదాపూర్, గచ్చిబౌలి, అత్తాపూర్, అంబర్‌పేట్, అత్తాపూర్, రాజేంద్రనగర్, నల్లకుంట, నాచారం, తార్నాక, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, ఉప్పల్, రామంతాపూర్‌లో భారీ వర్షం కురుస్తోంది.
ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని నగరం హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో బుధవారం మధ్యాహ్నాం నుంచి ఈదురు గాలులు, పిడుగులతో కూడిన వానలు పడుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ‘రెయిన్ అలర్ట్’ జారీ చేసింది.
ఉపరితల ద్రోణి ఉదయం నుంచి హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాలపై మేఘాలు కమ్ముకోగా.. మధ్యాహ్నాం నుంచి పలుచోట్ల ఈదురు గాలులతో వర్షం(Hyderabad Rains) కురుస్తోంది. కొన్ని చోట్ల చిరుజల్లులు, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వాన పడుతోంది. మలక్ పేట్, నాంపల్లి, చార్మినార్, దిల్‌సుఖ్ నగర్, కోఠి, రామంతపూర్, అబిడ్స్, అంబర్‌పేట్.. తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.
ఖైరతాబాద్, లక్డీకాపూల్, రాజ్ భవన్, ట్యాంక్ బండ్ సమీపంలో స్వల్ప వర్షంతో మొదలై.. జడి వానగా మారింది. నగర శివారు ప్రాంతాల్లో చోట్ల చిరు జల్లులు పడుతున్నాయి. మరికొన్ని గంటల్లో జంట నగరాల వ్యాప్తంగా పూర్తి స్థాయిలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. అలాగే..

రాత్రి సమయంలో హైదరాబాద్‌లో తీవ్రమైన తుఫాను(Cyclone) వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ(GHMC) అప్రమత్తం అయ్యింది. సాయంత్రం పనులు ముగించుకుని వెళ్లేవాళ్లను అప్రమత్తం చేస్తోంది. మ్యాన్ హోల్స్, కరెంట్ పోల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నగర ప్రజలకు సూచించింది.
ఇదిలా ఉంటే.. ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాజధాని నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో(Telangana Rains) ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులపాటు ఈదురు గాలులు, పిడుగులతో కూడిన భారీ వానలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది. ఇక పంట చేతికొచ్చే సమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని రైతులకు అధికార యంత్రాంగం సూచిస్తోంది.
తెలంగాణకు రెయిన్ అలర్ట్
వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర వ్యాప్తంగా రెయిన్ అలర్ట్ జారీ చేసింది. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉండడంతో.. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ముందస్తు ప్రణాళికలతో సమన్వయం చేసుకోవాలని సూచించింది. అలాగే..ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బెటాలియన్లను సైతం అందుబాటులో ఉండాలని ఆదేశించింది.
‘‘ఋతుపవనాలు ముందుగా రాబోతున్నాయి. అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలి. 2024లో కురిసిన భారీ వర్షాలకు NDRF అందుబాటులో లేకపోవడంతో గోల్డెన్ అవర్ కోల్పోయాం. 2024 సెప్టెంబర్ లాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కావొద్దు. జిల్లాల్లో కలెక్టర్లు ముందస్తు ప్రణాళికలు, సమన్వయం చేసుకోవాలి. సింగరేణి లో ప్రత్యేక శిక్షణ పొందిన రెస్క్యూ టీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి’’ అని సర్క్యులర్‌లో డిజాస్టర్స్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ పేర్కొన్నారు.
సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సీఎస్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ‘‘ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలి. కలెక్టర్లు.. కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలి.
హైదరాబాద్ సిటీలో వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వ లేకుండా చూడాలి. ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్తు సమస్యలు లేకుండా చూడాలి. జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్తు విభాగాలు సమన్వయంతో పని చేయాలి. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి’’ అని సీఎస్‌ను ఆదేశించారాయన.
ఇదీ చదవండి: సూర్యుడిపైకి సాగర మేఘాలు