స్టార్స్‌.. మెమ్స్‌! 

Telangana State To Introduce English Medium In Tribal Schools 2022 23 - Sakshi

గిరిజన సంక్షేమ పాఠశాలలకు కొత్త రూపు 

ఆశ్రమ పాఠశాలలు స్టార్స్‌గా, ప్రాథమిక పాఠశాలలు మెమ్స్‌గా పేరు మార్పు 

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం అందుబాటులోకి  

ప్రాథమిక సౌకర్యాలకు 25 కోట్లు

సాక్షి, హైదరాబాద్‌: గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని పాఠశాలలు కొత్త రూపును సంతరించుకోబోతున్నాయి. ఈ శాఖ పరిధిలోని ఆశ్రమ, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం (2022–2023) నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినందున ఈ స్కూళ్లను మరింత ఆధునీకరించబోతున్నారు. నాణ్యమైన బోధన, మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలను అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకు రూ. 25 కోట్లు అవసరమవుతాయని గుర్తించారు.

గురుకుల పాఠశాలల స్థాయిలో ఆశ్రమ పాఠశాలలు 
గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో 326 ఆశ్రమ పాఠశాలలున్నాయి. వీటిల్లో మూడు నుంచి పదో తరగతి వరకు బోధిస్తున్నారు. 1.05 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీళ్లకు ఉచిత వసతి, భోజన సౌకర్యము కల్పిస్తారు. ఇవిగాక 1,432 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 30 వేల మంది పిల్లలున్నారు. ఈ పాఠశాలన్నీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తిస్థాయి ఆంగ్ల మాధ్యమంలోకి మారనున్నాయి.

ఈ నేపథ్యంలో ఆశ్రమ పాఠశాలల పేర్లను ‘ఎస్టీ అడ్వాన్స్‌డ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ (స్టార్‌)’గా, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను మోడల్‌ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్స్‌ (మెమ్స్‌)గా పేరు మార్చనున్నారు. ఆశ్రమ పాఠశాలలన్నింటినీ గురుకుల పాఠశాల మాదిరి నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు.

విడతల వారీగా టీచర్లకు శిక్షణ 
ఆశ్రమ, గిరిజన ప్రభుత్వ పాథమిక పాఠశాలలను ఆంగ్ల మాధ్యమ పాఠశాలలుగా మార్చే క్రమంలో అన్ని రకాల వసతులు సమకూర్చాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. లైబ్రరీ, ప్రయోగ శాలలు, ఆట వస్తువులు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్, టీచర్లలో బోధన సామర్థ్యం పెంపు, బ్రిడ్జి కోర్సులను నిర్వహించాలని నిర్ణయించింది.

ప్రాథమిక సౌకర్యాల కోసం కనీసం రూ.25 కోట్లు అవసరమని గిరిజన సంక్షేమ శాఖ గుర్తించింది. మరింత లోతుగా ప్రణాళిక తయారు చేస్తోంది. మరోవైపు ఆశ్రమ, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల టీచర్లకు శిక్షణ తరగతులను గిరిజన సంక్షేమ శాఖ ప్రారంభించింది. విడతల వారీగా అన్ని కేటగిరీల్లోని టీచర్లకు శిక్షణ ఇవ్వనుంది. ఇందుకోసం రూ.5 కోట్లు కేటాయించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top