‘పన్ను’లపైనే గంపెడాశలు! | Telangana Revenue from Taxes | Sakshi
Sakshi News home page

‘పన్ను’లపైనే గంపెడాశలు!

Jul 26 2024 5:46 AM | Updated on Jul 26 2024 5:46 AM

Telangana Revenue from Taxes

బడ్జెట్‌ రాబడుల్లో 50 శాతానికిపైగా 

పన్నుల ఆదాయం నుంచే చూపిన ప్రభుత్వం

గత ఏడాది సవరించిన అంచనాలు రూ.1.35 లక్షల కోట్లు.. ఈసారి ప్రతిపాదన రూ.1.64 లక్షల కోట్లు

ఏకంగా రూ.29 వేల కోట్లు అదనంగా రాబట్టుకోవడంపై దృష్టి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం వివిధ పన్నుల ఆదాయంపైనే గంపెడాశలు పెట్టుకుంది. ప్రజల నుంచి వసూలు చేసే పన్నుల ద్వారా  ఆదాయం రాబట్టుకోవడంపై కాంగ్రెస్‌ సర్కారు దృష్టిపెట్టినట్టు బడ్జెట్‌ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తం రూ.2.91లక్షల కోట్లతో బడ్జెట్‌ పెట్టిన ప్రభుత్వం.. అందులో ఏకంగా రూ.1.64 లక్షల కోట్లను (50 శాతానికిపైగా) పన్నుల రూపంలోనే సమీకరించుకుంటామని పేర్కొంది. ఇది గత ఏడాది సవరించిన అంచనాలతో పోలిస్తే.. రూ.29 వేల కోట్లు (20 శాతం) అదనం కావడం గమనార్హం. ఇందులో కేంద్ర పన్నుల్లో వాటా కింద వచ్చే రూ.26,216 కోట్లు పోను మిగతా రూ.1.38 లక్షల కోట్లను అమ్మకపు పన్ను, ఎక్సైజ్, ఇతర పన్నుల రూపంలో సమకూర్చుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది.

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా గత ఏడాది రూ.14,295.56 కోట్లురాగా.. ఈసారి రూ.18,228.82 కోట్లు వస్తాయని అంచనా వేశారు. దీన్ని బట్టి ఈ ఏడాదిలోనే భూముల విలువల సవరణ చేసే అవకాశం ఉంది. ఇక ఎక్సైజ్‌ ఆదాయాన్ని గత ఏడాది సవరించిన అంచనాల్లో రూ.20.298 కోట్లుగా చూపగా.. ఈసారి రూ.5వేల కోట్లు అదనంగా రూ.25,617 కోట్లు వస్తుందని ప్రతిపాదించారు. ఎక్సైజ్‌ ఆదాయ లక్ష్యం పెంపు నేపథ్యంలో.. ఈసారి మద్యం ధరలు పెరగొచ్చన్న చర్చ జరుగుతోంది. మొత్తమ్మీద అమ్మకపు పన్ను ద్వారా గత ఏడాది రూ.57,394.46 కోట్లురాగా, ఈసారి 18శాతం అదనంగా రూ.68,273.73 కోట్లు వస్తాయని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. జీఎస్టీ, ఎక్సైజ్, అమ్మకపు పన్ను, వాహనాలు, సరుకులు, ప్రయాణికుల రవాణా, ఇతర పన్నుల రూపంలో ఈ మొత్తం సమకూరనుంది.

భూముల అమ్మకంపై చర్చ!
ఈసారి పన్నేతర ఆదాయం ఏకంగా రూ.35,208.44 కోట్ల మేర వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో పేర్కొంది. గత ఏడాది ఇది రూ.23,819.50 కోట్లుకాగా.. ఈసారి 50శాతం అదనంగా ప్రతిపాదించారు. అంతకుముందు 2022–23 ఆర్థిక సంవత్సరంలో పన్నేతర ఆదాయం రూ.8,857.42 కోట్లు మాత్రమే. అప్పుడు పన్నేతర ఆదాయం పెంచిన తరహాలోనే ఇప్పుడూ పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ భూముల అమ్మకాలకు కాంగ్రెస్‌ సర్కారు సిద్ధమవుతోందనే చర్చ జరుగుతోంది. దీనిపై ఆర్థిక మంత్రి భట్టిని ప్రశ్నించగా.. భూములు అమ్ముతామని తాము ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఆదాయం పెంపు కోసం తమకు అనేక మార్గాలున్నాయని, అవన్నీ ఇప్పుడు వెల్లడించలేమని పేర్కొన్నారు.

ఆశల పల్లకి దిగని ‘గ్రాంట్లు’
కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ నిధులపైనా రాష్ట్ర ప్రభుత్వం భారీగానే ఆశలు పెట్టుకున్నట్టు బడ్జెట్‌ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రాంట్ల కింద ఈసారి రూ.21,636 కోట్లు వస్తాయని చూపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏడెనిమిదేళ్లుగా గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ నిధులను ఆశించడం, కేంద్రం మొండిచేయి చూపడం రివాజుగా మారింది. గత ఏడాది కేంద్రం రూ.13,179.21 కోట్లు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద ఇస్తుందని బడ్జెట్‌లో అంచనా వేయగా.. రూ.9,729.91 కోట్లు మాత్రమే వచ్చాయి. అంతకు ముందు ఏడాది రూ,.8,619.26 కోట్లు మాత్రమే అందాయి. అయినా ఈసారి భారీగా అంచనా వేయడం గమనార్హం.    

(నోట్‌: పన్నుల ఆదాయంతోపాటు పన్నేతర ఆదాయం, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌లను కలిపి మొత్తం రాబడుల కింద పరిగణిస్తారు. తాజా బడ్జెట్‌లో రూ.2,21,242.23 కోట్లు రాబడులు వస్తాయని ప్రతిపాదించారు. ఇది 2023–24లో రూ.1,69,089.59 కోట్లు, 2022–23లో రూ.1,27,468.63 కోట్లు మాత్రమే) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement