జూన్‌లోనే టీచర్ల బదిలీలు?

Telangana: Process of Teacher Transfers is Likely to be Further Delayed - Sakshi

అనుకున్నదానికన్నా ఆలస్యమయ్యే అవకాశం 

ఇంటర్, టెన్త్‌ పరీక్షల తేదీలు పొడిగించడమే కారణం 

ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే.. ప్రత్యక్ష కౌన్సెలింగ్‌ డౌటే! 

హడావుడితో ఎన్నో సమస్యలంటూ టీచర్ల అభ్యంతరాలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. దీనిపై ఇప్పటికే విద్యాశాఖ కసరత్తు మొదలుపెట్టినా.. ఇంకా మార్గదర్శకాలపై తర్జనభర్జన కొనసాగుతోంది. బదిలీల కౌన్సెలింగ్‌ ప్రక్రియను ఏప్రిల్‌ చివరి వారం చేపట్టి, మే రెండో వారానికి ముగించాలని తొలుత భావించారు. కానీ ఈ సమయంలో బదిలీలు చేపట్టడం అసాధ్యమని విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. జేఈఈ మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ మారి.. ఇంటర్‌ పరీక్షలపై ప్రభావం పడటం, దీనితో టెన్త్‌ పరీక్షల తేదీల్లో మార్పు అనివార్యమవడమే కారణం.

తాజా షెడ్యూల్‌ ప్రకారం.. మేలో టెన్త్‌ పరీక్షలు మొదలై ఆ నెల చివరివరకు కొనసాగుతాయి. ఆ తర్వాత మూల్యాంకన ప్రక్రియ జరుగుతుంది. అప్పటివరకు సాధారణ బదిలీలు చేపట్టడం కష్టమని అధికారులే చెప్తున్నారు. ఇక రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో 8వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం విద్యను ప్రవేశపెడుతున్నారు. దానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలు, టీచర్ల హేతుబద్ధీకరణ చేపట్టాల్సి ఉంది. ఆ లెక్క తేలితే తప్ప, టీచర్ల బదిలీల ప్రక్రియ ముందుకెళ్లే పరిస్థితి లేదని అధికారులు అంటున్నారు. మరోవైపు పదోన్నతులపై వస్తున్న డిమాండ్లను పరిశీలించాలని ప్రభుత్వం భావిస్తోంది. అదికూడా బదిలీలపై ప్రభావం చూపే అవకాశముంది. 

మార్గదర్శకాలే కీలకం 
ఉపాధ్యాయుల సాధారణ బదిలీలను ఇంతకుముందు 2018 జూలైలో చేపట్టారు. తర్వాత అడపాదడపా విచక్షణ బదిలీలు మినహా పూర్తిస్థాయి ప్రక్రియ నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో చాలా మంది బదిలీల కోసం నిరీక్షిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇదివరకు మాదిరిగా కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలు చేపట్టడం కష్టమని అధికారులు భావిస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు, 317 జీవో ఆధారంగా ఇటీవల జిల్లాలు మారిన టీచర్లు వంటి అంశాలు బదిలీల ప్రక్రియకు సవాల్‌గా మారుతున్నాయి. ఈ క్రమంలో మార్గదర్శకాలు ఇవ్వడం కష్టంగా ఉందని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.

మొత్తం సర్వీసును ప్రామాణికంగా తీసుకోవాలా? ప్రస్తుత స్థానంలో పనిచేసిన సర్వీసు పాయింట్ల ప్రకారం మార్గదర్శకాలు ఇవ్వాలా? అందరి సర్వీసును కొత్తగా పరిగణించాలా? అనే అంశాలపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. దీనికితోడు ఇటీవల కొత్త జిల్లాలకు వెళ్లిన వారు అదే జిల్లాలో వేరొక బడికి వెళ్లేందుకూ ప్రయత్నిస్తుండటం, పరస్పర బదిలీలు చేసుకున్నవారి సర్వీసును పరిగణనలోకి తీసుకోకపోవడం వంటివి కూడా మార్గదర్శకాల రూపకల్పనలో కీలకంగా మారుతాయని అధికారవర్గాలు అంటున్నాయి. 

హడావుడి బదిలీలు వద్దంటున్న టీచర్లు 
జూన్‌లో కొత్త విద్యా సంవత్సరం మొదలవుతుందని, ఇలాంటి సమయంలో బదిలీలు చేపట్టాలని విద్యాశాఖ భావిస్తోందని.. హడావుడిగా ముందుకెళ్తే కొత్త సమస్యలు వస్తాయని ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. బదిలీలు చేపట్టాలని నిర్ణయించినప్పుడు టెన్త్‌ పరీక్షలను ఏప్రిల్‌లోనే మొదలు పెడితే బాగుంటుందని యూటీఎఫ్‌ నేత చావ రవి అభిప్రాయపడ్డారు. అప్పుడు టీచర్లు కూడా ఆలోచించి అవసరమైన నిర్ణయం తీసుకునే వీలు ఉంటుందన్నారు. 

ఆన్‌లైన్‌పై ఆందోళన 
గతంలో మాదిరిగా ప్రత్యక్ష కౌన్సెలింగ్‌ కాకుండా, ఈసారి ఆన్‌లైన్‌ ద్వారానే బదిలీల ప్రక్రియ చేపట్టాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ తరహా విధానం 317 జీవో అమలు సందర్భంగా అనేక అనుమానాలకు తావిచ్చిందని టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యక్ష కౌన్సెలింగ్‌ చేపట్టాలని కోరుతున్నారు. అయితే ఈ అంశంపై వారంలో స్పష్టత వచ్చే వీలుందని ఓ అధికారి తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top