
తొలిదశలో 45 టీఎంసీల తరలింపునకే ప్రాజెక్టు పరిమితం
నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ అభ్యంతరాల నేపథ్యంలో సర్కారు కొత్త వ్యూహం
మైనర్ ఇరిగేషన్‌లో పొదుపు చేసిన 45 టీఎంసీలతో తొలిదశ ప్రాజెక్టు
కీలకమైన సీడబ్ల్యూసీ ఆమోదం పొందడానికి యత్నాలు
త్వరలో కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక
ఇప్పటికే కేంద్రానికి, కేంద్ర జలశక్తి శాఖకు రాష్ట్రం విజ్ఞప్తులు
ఉమ్మడి వాటా 45 టీఎంసీలు ప్రస్తుతానికి పక్కన పెట్టాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని విభజించి రెండు దశల్లో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టుకు నీటి కేటాయింపుల సమస్య ఎదురుకావడంతో ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. తొలిదశలో 45 టీఎంసీలను తరలించడానికి కొత్త సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సిద్ధం చేసి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదం పొందడానికి ప్రయత్నాలు చేస్తోంది. త్వరలోనే డీపీఆర్‌ను కేంద్రానికి సమర్పించనుంది. సీడబ్ల్యూసీ 45 టీఎంసీలతో ప్రాజెక్టుకు అనుమతినిస్తే ఆ మేరకు సాగునీటి అవసరాల కోసం పనులు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.
90 టీఎంసీలతో ప్రాజెక్టుకు శ్రీకారం
మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నారాయణపేట, వికారాబాద్, నాగర్‌కర్నూల్, నల్లగొండ జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, 1,226 గ్రామాలకు తాగునీటిని అందించడానికి 60 రోజుల్లో రోజుకు 1.5 టీఎంసీల చొప్పున మొత్తం 90 టీఎంసీల కృష్ణా జలాలను తరలించడానికి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా నార్లాపూర్‌లో 8.51 టీఎంసీలు, ఏదులలో 6.55 టీఎంసీలు, వట్టెంలో 16.74 టీఎంసీలు, కరివెనలో 17.34 టీఎంసీలు ఉద్ధండాపూర్‌లో 16.03 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన రిజర్వాయర్ల పనులు తుది దశలో ఉన్నాయి. నార్లాపూర్ రిజర్వాయర్‌తో పాటు పంప్‌హౌస్‌ను పూర్తిస్థాయిలో సిద్ధం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది.
నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ అభ్యంతరాలు
పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను 2022 సెపె్టంబర్ 3న రాష్ట్ర ప్రభుత్వం సీడబ్ల్యూసీకి సమరి్పంచింది. అయితే ప్రాజెక్టుకు రాష్ట్రం కేటాయించిన 90 టీఎంసీల లభ్యతపై సీడబ్ల్యూసీ అభ్యంతరాలు తెలిపింది. అయితే కృష్ణా బేసిన్‌లో మైనర్ జరిగేషన్‌లో 2012–13 నుంచి 2022–23 మధ్య కాలంలో పొదుపు చేసిన 45.68 టీఎంసీలను ఈ ప్రాజెక్టుకు కేటాయించినట్టు తెలంగాణ తెలియజేసింది.
కాగా పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణా బేసిన్‌కు గోదావరి జలాలు తరలిస్తే దానికి బదులుగా నాగార్జునసాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలకు 80 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకునే హక్కు ఉండేలా 1978 ఆగస్టు 4న బచావత్ ట్రిబ్యునల్ ఎదుట ఒప్పందం జరిగింది. దీని ప్రకారం లభించిన జలాల్లో ఎగువ రాష్ట్రాలు వాడుకోగా ఉమ్మడి ఏపీకి మిగిలిన 45 టీఎంసీలు మొత్తం తమ రాష్ట్రానికే చెందుతాయని తెలంగాణ వాదిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ 45 టీఎంసీలను సైతం పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించినట్లు తెలిపింది. ఈవిధంగా మొత్తం 90 టీఎంసీల నీటి లభ్యత ఈ ప్రాజెక్టుకు ఉందని రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్‌లో పేర్కొనగా, దీనిపై సీడబ్ల్యూసీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
అనుమతుల అంశాన్ని పరిశీలించలేమన్న జల సంఘం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో నాగార్జునసాగర్ ఎక్కువ రాష్ట్రాలకు లభ్యతలోకి వచ్చిన జలాల్లో ఉమ్మడి ఏపీ వాటా అయిన 45 టీఎంసీలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు కేంద్రం అప్పగించిన విషయాన్ని సీడబ్ల్యూసీ గుర్తు చేసింది. ట్రిబ్యునల్ పరిధిలో ఉన్న నేపథ్యంలో ఆ నీళ్ల ఆధారంగా ‘పాలమూరు’ ప్రాజెక్టుకు అనుమతుల జారీ అంశాన్ని పరిశీలించలేమని తేల్చి చెప్పింది. అదే సమయంలో మైనర్ ఇరిగేషన్‌లో 45.68 టీఎంసీలను ఎలా పొదుపు చేశారో చెప్పాలని కోరింది. ఈ నేపథ్యంలోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో సాగర్ ఎగువన ఉమ్మడి ఏపీకి అందుబాటులోకి వచ్చిన 45 టీఎంసీల జలాలను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా పక్కన బెట్టింది.
ప్రస్తుతానికి ‘మైనర్ ఇరిగేషన్ 45 టీఎంసీలు’ పైనే దృష్టి
రాష్ట్రంలో మైనర్ ఇరిగేషన్ కింద చెరువులు, క్లస్టర్ల వారీగా నీటి వాడకం వివరాలు, తద్వారా పొదుపు అవుతున్న 45 టీఎంసీల వివరాలను ఇటీవల సీడబ్ల్యూసీకి పంపించింది. అలాగే ఇటీవల కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో ఇరు రాష్ట్రాల సీఎంలతో జరిగిన సమావేశంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీలతో అనుమతినిస్తే డి్రస్టిబ్యూటరీల పనులు చేసుకుంటామని తెలిపింది. దీనికి ముందు ప్రాజెక్టుకు 45 టీఎంసీల నీటితో అనుమతినివ్వాలని కోరుతూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. అలాగే నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, ఈఎన్సీ(జనరల్) కూడా వేర్వేరుగా లేఖలు రాశారు.
ఇప్పటికే అటవీ, తదితర అనుమతులు
ఈ ప్రాజెక్టుకు 2019లో తొలి, రెండోదశ అటవీ అనుమతులు రాగా, 2021 సెపె్టంబర్ 3న వైల్డ్ లైఫ్ క్లియరెన్స్, 2023 మార్చి 17న కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సీఈఏ), 2003లో సీఎస్‌ఆర్‌ఎంఎస్, 2023 జూలై 17న మోటా క్లియరెన్స్, 2023 జూలై 28న కేంద్ర భూగర్భ జల మండలి అనుమతులు లభించాయి. కాగా పర్యావరణ అనుమతుల కోసం నీటి లభ్యత విషయంలో సీడబ్ల్యూసీ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) తీసుకోవాలని గతంలో కేంద్ర పర్యావరణ శాఖ షరతు పెట్టింది. దీంతో సీడబ్ల్యూసీ క్లియరెన్సే ప్రాజెక్టుకు కీలకంగా మారింది.
రెండోదశకు పర్యావరణ అనుమతికి సీడబ్ల్యూసీ క్లియరెన్సే కీలకం
పాలమూరు–రంగారెడ్డికి రెండోదశ పర్యావరణ అనుమతి రావాల్సి ఉంది. వాస్తవానికి ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి పొందడానికి వీలుగా ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలంగాణకు 2017 అక్టోబర్‌లోనే టీఓఆర్ (టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్) జారీ చేసింది. దీంతో 2022 ఆగస్టులో ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. సుదీర్ఘ విరామం అనంతరం పర్యావరణ అనుమతి కోసం దరఖాస్తు చేసింది. రెండోదశ పర్యావరణ అనుమతి వస్తే ప్రాజెక్టు నిర్మాణ పనులకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి. 45 టీఎంసీల ప్రాజెక్టుకు కీలకమైన సీడబ్ల్యూసీ అనుమతి లభిస్తే రెండోదశ పర్యావరణ అనుమతికి కూడా ఇబ్బందులు తొలగిపోతాయి.