రిజర్వాయర్లకు నయా లుక్‌! | Telangana: New Look For Reservoirs | Sakshi
Sakshi News home page

రిజర్వాయర్లకు నయా లుక్‌!

Aug 8 2021 3:37 AM | Updated on Aug 8 2021 3:38 AM

Telangana: New Look For Reservoirs - Sakshi

కరీంనగర్‌లోని లోయర్‌ మానేరు డ్యాం వద్ద తీగల వంతెన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో హైదరాబాద్‌ మినహా మిగతా ప్రాంతాలు పర్యాటకంగా వెనుకబడే ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలు ఉన్నా సౌకర్యాలు లేకపోవడం, పర్యాటకానికి అనువుగా లేకపోవడమే దీనికి కారణం. ఇలాంటి సమయంలో గోదావరి జలాలతో నిండుతున్న రిజర్వాయర్లు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఆయా ప్రాజెక్టులు పర్యాటకానికి ఆస్కారమిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ కసరత్తు ప్రారంభించింది. గతంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చేసిన ప్రతిపాదనల ఆధారంగా రిజర్వాయర్లు, ప్రాజెక్టుల వద్ద అభివృద్ధి చర్యలు చేపడుతోంది. 


రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌

నాలుగు రిజర్వాయర్ల వద్ద.. 
పర్యాటక అభివృద్ధి కోసం ప్రభుత్వం నాలుగు రిజర్వాయర్లపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో కీలక పట్టణంగా ఎదుగుతున్న సిద్దిపేటకు సమీపంలోని రంగనాయకసాగర్‌ రిజర్వాయర్, సిరిసిల్ల శివార్లలోని అన్నపూర్ణ రిజర్వాయర్, అవకాశాలు ఉండీ ఇన్నాళ్లూ అభివృద్ధికి నోచుకోని అప్పర్, మిడ్‌మానేరు రిజర్వాయర్లను ఎంపిక చేసింది. ఆయా చోట్ల అభివృద్ధి పనులకు సంబంధించి ఇటీవలే పర్యాటకాభివృద్ధి సంస్థ ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన ఇచ్చింది. జాతీయ స్థాయిలో సంస్థలు కాన్సెప్టు, డీపీఆర్‌లతో ఈ నెల 15 నాటికి ప్రతిపాదనలు ఇవ్వాలని కోరింది. పనులు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని పేర్కొంది. వచ్చిన ప్రతిపాదనల్లో మేలైన దాన్ని ఎంపిక చేసి ఆ ఇతివృత్తానికి తగ్గట్టు రిజర్వాయర్లను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో రంగనాయకసాగర్‌ను తొలిదశలో రూ.100 కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 


అనంతగిరి రిజర్వాయర్‌లోని ప్రకృతి అందాలు  

రివర్‌ ఫ్రంట్‌గా లోయర్‌ మానేరు.. 
లోయర్‌ మానేరు డ్యామ్‌ బ్యాక్‌వాటర్‌ ప్రాంతాన్ని రివర్‌ఫ్రంట్‌ పేరుతో అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం నీటిపారుదల శాఖకు రూ.350 కోట్లు కేటాయించింది. ఆ ప్రాంతంలో పర్యాటకులకు  వసతులు, ఆకర్షణీయ పనులు చేసేందుకు పర్యా టక శాఖకు రూ.వంద కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టుకు కన్సల్టెంటు నియామక ప్రక్రియ జరుగుతోంది. దీనితో కలిపి ఐదు ప్రాంతాల్లో పర్యాటక ప్రాజెక్టులు పట్టాలెక్కనున్నాయి. అయితే  పర్యాటక అభివృద్ధి పనులు నిధుల కొరతతో చతికిలబడుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. తాజా ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందన్నది తేలాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement