ఎవరెస్ట్‌ మిన్నగా.. ప్రపంచం చిన్నగా.. నా కల నెరవేరింది: అన్వితా రెడ్డి

Telangana Mountaineer Anvitha Reddy Scales MT Everest - Sakshi

ఎవరెస్ట్‌పై నుంచి చూస్తే ప్రపంచం చిన్నగా కనిపించింది 

20 నిమిషాలు శిఖరాగ్రంపై ఉన్నాను ‘సాక్షి’తో పడమటి అన్వితా రెడ్డి 

సాక్షి, యాదాద్రి: ‘ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్‌ శిఖరాగ్రం చేరిన తర్వాత చూస్తే.. ప్రపంచం చాలా చిన్నగా కనిపించింది. ఎప్పటినుంచో ఉన్న ఆశ ఈ సంవత్సరం తీరింది. నా కల నెరవేరింది. వివిధ పర్వతాలు అధిరోహించిన అనుభవంతో ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఎవరెస్ట్‌ ఎక్కగలిగాను. మరో శిఖరాన్ని ఎక్కడానికి ఉత్సా హంగా ఉన్నాను’అంటూ సంతో షం వ్యక్తం చేశారు ఎవరెస్ట్‌ పర్వతం అధిరోహించిన పడమటి అన్వితారెడ్డి. ఈ నెల 16న ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన ఆమె బుధవారం ఉదయం 10.30కి నేపాల్‌లోని బేస్‌క్యాంపునకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఫోన్‌లో ‘సాక్షి’తో చెప్పిన అంశాలు ఆమె మాటల్లోనే.. 

అధైర్యపడలేదు...  
‘‘మొదట ఎంత ఆత్మస్థైర్యం, నమ్మకంతో ప్రారంభమయ్యానో... చివరి వరకు అలాగే ఉన్నా. ఎక్కడా అధైర్యపడలేదు. అంతా సవ్యంగా జరిగింది. బేస్‌ క్యాంపు నుంచి సమ్మిట్‌ వరకు ఎలాంటి అవాంతరాలు లేకుండా చేరుకోగలిగా. డిసెంబర్‌లో మైనస్‌ 30 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో రష్యాలోని ఎల్‌బ్రోస్‌ పర్వతం ఎక్కినప్పుడు చిన్న ఇబ్బందులు తలెత్తాయి. వాటన్నింటినీ అధిగమించి ఆ పర్వతం అధిరోహించాను. అప్పుడు నేర్చుకున్న పాఠాలు ఇప్పుడు ఎవరెస్ట్‌ అధిరోహించడంలో తోడ్పడ్డాయి. వాతావరణం అనుకూలించనప్పుడు కొంత ఇబ్బంది పడ్డాను. కానీ, వాతావరణం అనుకూలించగానే ఎక్కడా ఆగకుండా సాగర్‌మాత (ఎవరెస్ట్‌ శిఖరాన్ని సాగర్‌మాత అంటారు) వరకు చేరుకున్నాను. 

సంతోషంతో కేరింతలు.. 
మే 16న ఉదయం 9.30 గంటలకు ఎవరెస్టును అధిరోహించాను. అక్కడినుంచి చూస్తే ప్రపంచమంతా చిన్నగా కనిపించింది. చుట్టు పక్కల దేశాలు చిన్నగా అనిపించాయి. నా లక్ష్యం నెరవేరిందన్న సంతోషంతో ఎవరెస్ట్‌ ఎక్కిన తర్వాత కేరింతలు కొట్టాను. నా వద్ద ఉన్న కెమెరాతో వీడియో తీశాను. ఫొటోలు తీసుకున్నాను. 15 నుంచి 20 నిమిషాలపాటు శిఖరాగ్రంపై ఉన్నాను. ఆ సమయంలో నా వెంట తెచ్చిన పూజా జెండాలు కట్టడంతోనే సరిపోయింది. భూమి మీదికి వచ్చిన తర్వాత అన్ని పెద్దగా కనిపిస్తున్నాయి.  

మరెన్నో లక్ష్యాలు... 
నాకింకా ఎన్నో లక్ష్యాలు ఉన్నాయి. ప్రపంచంలోని అన్ని ఖండాల్లో ఉన్న పర్వతాలన్నింటినీ అధిరోహించాలి. ఒక్కొక్కటిగా నెరవేర్చకుంటా. నన్ను ప్రోత్సహిస్తున్న నా తల్లిదండ్రులు, కోచ్‌లు, స్పాన్సర్లకు కృతజ్ఞతలు’’ అంటూ అన్విత ఉద్వేగాన్ని పంచుకున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top