
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అంశానికి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. ఈరోజు(సోమవారం, ఆగస్టు 4వ తేదీ) తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ఉత్తమ్ ఆ సమావేశం బ్రీఫింగ్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రజాధనం దుర్వినియోగం అయినట్లు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిందని ఆయన తెలిపారు.
మేడిగడ్డ బ్యారేజ్‌లో చాలా లోపాలున్నట్లు సీడబ్యూసీ చెప్పిందని, తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదనడం సరైంది కాదని ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో స్పష్టమైనట్లు ఆయన పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్దని హై పవర్ కమిటీ ఇచ్చిన నివేదికను కేసీఆర్ పట్టించుకోలేదని ఈ సందర్భంగా ఉత్తమ్ విమర్శించారు.
ప్రజాధనం దుర్వినియోగం చేశారు..
‘మేడిగడ్డ కుంగిపోవడానికి కేసీఆర్ ప్రధాన కారణమని పీసీ ఘోష్ కమిషన్ నిర్ధారించింది. మొత్తం ఆర్థిక అవతవకలు, అవినీతి, ప్లానింగ్, డిజైనింగ్ అంతా కేసీఆర్ పర్యవేక్షణలోనే జరిగింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడేలా మేడిగడ్డ బ్యారేజ్ అంచనాలు పెంచి నిర్మించారు. కాళేశ్వరం కమిషన్‌కు హరీష్‌రావు సరైన సమాచారం ఇవ్వలేదు. మేడిగడ్డ కరెక్ట్ ప్రదేశంలో కట్టలేదు. కాంట్రాక్టర్స్‌కు ఫేవర్‌గా చూడటానికి ప్రజాధనం దుర్వినియోగం చేశారు’ అని ఉత్తమ్ తెలిపారు.
ఇష్టానుసారం ప్రాజెక్టుల డిజైన్ మార్చేశారు..
‘కాగ్, ఎన్‌డీఎస్‌ఏ నివేదికలను ఘోష్ కమిషన్ పరిశీలించింది. కమిషన్ నివేదికపై కేబినెట్‌లో చర్చించాం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పునాదుల్లోనే సమస్యలు. కేసీఆర్ ఇష్టానుసారం ప్రాజెక్ట్ డిజైన్ మార్చేశారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టును గతంలోనే నిర్ణయించారు. 16 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చేలా డిజైన్ చేశారు. కేసీఆర్ ఇష్టానుసారం ప్రాజెక్టు డిజైన్‌లు మార్చేశారు. అధిక వడ్డీకి ఎన్‌బీఎఫ్ దగ్గర లోన్లు తెచ్చారు. అధిక వడ్డీలకు రూ. 84 వేల కోట్ల ురుణాలు తీసుకొచ్చారు. రుణాలు తెచ్చే విషయంలో అవతవకలకు పాల్పడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాళేశ్వరంపై విచారణ. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను 25 పేజీలకు కుదించాం’ అని ఉత్తమ్ పేర్కొన్నారు.