సమస్యలు తీరేలా.. ‘స్పెషల్‌’గా

Telangana Minister Harish Rao About Dharani Portal - Sakshi

ధరణి సమస్యల పరిష్కారానికి స్పెషల్‌ డ్రైవ్‌ 

గజ్వేల్‌: ధరణి పోర్టల్‌లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి, ధరణి సబ్‌ కమిటీ చైర్మన్‌ హరీశ్‌రావు తెలిపారు. ఇందుకోసం పైలట్‌ ప్రాజెక్టు కింద సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రాన్ని ఎంపిక చేశామని చెప్పారు. కొద్దిరోజుల్లోనే ఇక్కడి సమస్యలన్నీ పరిష్కరించి, ఇదే విధానం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇబ్బందులు తీరుస్తామని వివరించారు.

మంగళవారం ములుగులో ధరణి సమస్యలపై పలువురు సీనియర్‌ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి క్షేత్రస్థాయి అధ్యయనం జరిపారు. రైతులతో నేరుగా మాట్లాడి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. రైతులతో ముఖాముఖి సమావేశం ముగిసిన తర్వాత ధరణిలో ఉన్న లోపాల పరిష్కారానికి కొత్త మాడ్యూళ్లు ప్రవేశపెట్టే అంశంపై ప్రధానంగా చర్చించారు. ధరణి పోర్టల్‌  వల్ల 95 శాతానికి పైగా రైతులు సంతోషంగా ఉన్నారని, కేవలం ఐదు శాతం మందికి మాత్రమే సమస్యలు వస్తున్నాయని హరీశ్‌రావు చెప్పారు.    

9 లక్షల మంది రిజిస్ట్రేషన్‌: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు ధరణి పోర్టల్‌లో 9 లక్షల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని చెప్పారు. ఈ పోర్టల్‌లో 33 మాడ్యూళ్లు ఉన్నాయని, వీటి ద్వారా ప్రతి సమస్యను పరిష్కరించుకోవచ్చన్నారు. ములుగులో కేవలం 186 సమస్యలు ఉన్నాయని, వీటిని పరిష్కరిస్తే ఇక సమస్యలుండవని చెప్పారు. సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, ఉన్నతాధికారులు శేషాద్రి, రాహుల్‌బొజ్జా, టీఎస్‌ టెక్నికల్‌ సర్వీసెస్‌ చైర్మన్‌ వెంకటేశ్వరరావు, సిద్దిపేట కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్, ‘గడా’ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top