సీఎం సార్ యాదికున్నదా! | telangana memorial project stalled no visitor entry | Sakshi
Sakshi News home page

సీఎం సార్ యాదికున్నదా!

Mar 27 2026 7:54 AM | Updated on Mar 27 2026 12:14 PM

telangana memorial project stalled no visitor entry

 ఇప్పటికీ సందర్శకులకు అనుమతించని వైనం  

అతీగతీ లేని మ్యూజియం ఏర్పాటు  

రూ.131 కోట్లతో నిర్మించిన గత ప్రభుత్వం  

పట్టించుకోని ప్రస్తుత కాంగ్రెస్‌ సర్కారు 

కార్యరూపం దాల్చని ప్రతిపాదనలు  

సాక్షి, హైదరాబాద్‌: అమర వీరుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన తెలంగాణ స్మారకజ్యోతి వెలవెలబోతోంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ కట్టడానికి నేడు ఆదరణ కరువైంది. పచ్చటి మొక్కలు ఎండిపోయాయి. రెండేళ్లు దాటినా సందర్శకులకు అనుమతి లభించడం లేదు. అమరుల మ్యూజియంతో పాటు వాయిదాపడిన పనులు ముందుకు సాగడం లేదు. తొలి, మలి దశ ఉద్యమాల్లో అసువులు బాసిన అమరుల త్యాగాలను ఎత్తిపట్టేలా మ్యూజియం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. తెలంగాణ ఉద్యమాలపై రూపొందించిన డాక్యుమెంటరీలను ప్రదర్శించేందుకు ప్రత్యేకమైన హాళ్లను ఏర్పాటు చేశారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఉద్యమాలపై ఓ గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. కానీ ఈ దిశగా  ఒక్క అడుగు ముందుకు పడలేదు. దీంతో ప్రత్యేక తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసేందుకు ప్రాణాలొడ్డిన అమరుల యాది జాడ మసకబారుతోంది.  

ప్రపంచంలో అపురూప కళాఖండం..  
హుస్సేన్‌సాగర్‌ తీరాన లుంబిని పార్కును ఆనుకొని 3.2 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన  తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రపంచంలోనే ఒక అపురూపమైన కళాఖండంగా  నిలిచింది. ఎలాంటి అతుకులు లేని స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో దీన్ని నిర్మించారు. దుబాయ్‌లో ఎంతో పేరొందిన  ఫ్యూచర్‌ మ్యూజియానికి వినియోగించిన స్టీల్‌కు అతుకులు ఉన్నాయి. కానీ  ఈ స్మారకానికి  మాత్రం ఎలాంటి అతుకులు లేకపోవడం విశేషం. 8,5000 చదరపు అడుగుల  విస్తీర్ణంలో సుమారు రూ.131 కోట్లతో గత ప్రభుత్వం  దీన్ని నిర్మించింది. భవనంపై ఉన్న స్మారకజ్యోతి వరకు సందర్శకులు  వెళ్లేందుకు అవకాశం ఉంది. అక్కడే ఒక రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయాలని భావించారు. ఇక భవనం రెండంతస్తుల్లో.. తెలంగాణ అమరవీరుల త్యాగాలను, వీరోచిత పోరాట గాథలను స్మరించుకొనేలా గ్రౌండ్‌ఫ్లోర్‌లో చిత్రపటాలు, చారిత్రక చిహ్నాలను ఏర్పాటు చేయాలని భావించారు. ప్రేక్షకులు  వీక్షించేందుకు లేదా విని తెలుసుకొనేందుకు వీలుగా ఆడియో, వీడియో హాళ్లు, గ్యాలరీలను కూడా గ్రౌండ్‌ఫ్లోర్‌లోనే  ఏర్పాటు చేయాల్సి ఉంది.  

పచ్చదనానికి రక్షణేది? 
మ్యూజియంలో అక్కడక్కడా కియోస్‌్కలు, టచ్‌ స్క్రీన్‌లు ఏర్పాటు చేసి  వాటిద్వారా కూడా ఉద్యమ చరిత్ర, విశేషాలను భావి తరాలకు  తెలియజేయాలని ప్రతిపాదించారు. పైఅంతస్తులో కనీసం 600 మంది కూర్చొనేందుకు వీలైన కన్వెన్షన్‌ హాల్‌ కూడా ఉంది. సాహిత్య సభలు, సమావేశాలు నిర్వహించేందుకు అనువైన హాల్‌ ఇది. ఆర్ట్‌ గ్యాలరీలను కూడా ఏర్పాటు చేయవచ్చు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. దీంతో స్మారకజ్యోతి అలంకారప్రాయంగానే  ఉండిపోయింది. నిర్వహణ లేక పరిసరాలు పూర్తిగా కళ తప్పాయి. మొక్కలు అడ్డదిడ్డంగా పెరిగాయి. ఎంతో పవిత్రంగా ఉండాల్సిన ప్రాంగణం అడవిని తలపిస్తుండగా.. పచ్చదనానికి  రక్షణ లేకుండాపోయింది. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని అమరవీరుల స్మారకాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి సందర్శకులకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.

Advertisement
 
Advertisement
Advertisement