
ఆగస్టు 1 నుంచే అమల్లోకి రావాల్సిన ప్రక్రియ వాయిదా
ఇంకా ప్రభుత్వం చేతికి అందని థర్డ్ పార్టీ నివేదిక
స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు వాయిదా పడే అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని భూములు, ఆస్తులకు సంబంధించి ప్రభుత్వ విలువల సవరణ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్న విషయంలో స్పష్టత రావడం లేదు. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది ఆగస్టు 1 నుంచే సవరించిన విలువలు అమల్లోకి రావాల్సి ఉన్నప్పటికీ పారదర్శకత పేరుతో థర్డ్ పార్టీ ఏజెన్సీకి ఈ బాధ్యతలు అప్పగించడంతో జాప్యం జరుగుతోంది. ఈ ఏజెన్సీ నివేదిక ఇంకా ప్రభుత్వం చేతికి రాలేదని తెలుస్తోంది.
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాత్రం నవంబర్ నెలలోనే సవరించిన విలువలను అమల్లోకి తేవాలనే యోచనలో ఉన్నా.. థర్డ్ పార్టీ నివేదిక ఎప్పుడు వస్తుందన్న దానిపైనే సాధ్యాసాధ్యాలు ఆధారపడి ఉన్నాయని చెపుతున్నారు. మరోవైపు, స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉన్నందున భూముల ధరలు పెంచడం వల్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశముందన్న అంచనాల నేపథ్యంలో ఆ ఎన్నికలు పూర్తయ్యేవరకు భూముల విలువల సవరణ అమల్లోకి రాదనే వాదన కూడా వినిపిస్తోంది.
నాలుగు నెలల క్రితం..
వాస్తవానికి, భూముల విలువల సవరణ కార్యక్రమాన్ని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఈ ఏడాది జూన్ 14వ తేదీన ప్రారంభించింది. ఇందుకోసం ప్రత్యేక షెడ్యూల్‌ను విడుదల చేసింది. దాని ప్రకారం ఆగస్టు 1వ తేదీ నుంచి సవరించిన విలువలు అందుబాటులోకి రావాల్సి ఉంది. షెడ్యూల్ మేరకు రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు తమ కసరత్తు పూర్తి చేశాయి. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను బట్టి భూముల విలువలను సవరిస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాయి.
అయితే, ఈ ప్రతిపాదనల మేరకు విలువలు సవరించకుండా, ఇతర రాష్ట్రాల్లో జరిగిన అనుభవాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం థర్డ్‌పార్టీకి ఈ కసరత్తు బాధ్యతలను అప్పగించింది. ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ కసరత్తు ఎంత వరకు వచి్చందన్నది అంతుపట్టడం లేదని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలే చెబుతున్నాయి. అసలు ఎప్పుడు నివేదిక ఇస్తుందన్న దానిపై స్పష్టత రావడం లేదని, నివేదిక వచ్చిన తర్వాత కూడా మరోమారు అధికారికంగా ప్రతిపాదనలు చేసి కమిటీల ఆమోదానికి సమయం తీసుకుంటుందని, ఈ నేపథ్యంలో విలువల సవరణ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్న దానిపై తామేమీ చెప్పలేమని ఆ వర్గాలు అంటున్నాయి.