కోవిడ్‌ వాక్సినేషన్‌లో కరీంనగర్‌ రికార్డు | Telangana: Karimnagar Record In Corona Vaccination | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ వాక్సినేషన్‌లో కరీంనగర్‌ రికార్డు

Jan 26 2022 1:45 AM | Updated on Jan 26 2022 6:29 PM

Telangana: Karimnagar Record In Corona Vaccination - Sakshi

కోవిడ్‌ వాక్సినేషన్‌లో కరీంనగర్‌ రికార్డు సృష్టించింది. మంగళవారం నాటికి జిల్లాలో రెండో డోసు పంపిణీ 100 శాతం పూర్తయింది.

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ వాక్సినేషన్‌లో కరీంనగర్‌ రికార్డు సృష్టించింది. మంగళవారం నాటికి జిల్లాలో రెండో డోసు పంపిణీ 100 శాతం పూర్తయింది. తద్వారా రాష్ట్రంలోనే రెండు డోసులు 100 శాతం పూర్తి చేసుకున్న తొలి జిల్లాగా, దక్షిణాది రాష్ట్రాల్లో రెండో జిల్లాగా రికార్డు సొంతం చేసుకుంది. జిల్లాలో అర్హులైన 7,92,922 మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. మొదటి డోసు లక్ష్యానికి మించి 104 శాతం మందికి వేశారు. ఇప్పటివరకు 8,27,103 డోసులు పంపిణీ చేశారు. ఇదే స్ఫూర్తితో రెండో డోసు సైతం పూర్తిచేశారు.

మంగళవారం నాటికి జిల్లాలో 7,94,404 మందికి రెండో డోసు పంపిణీచేసి 100 శాతం అధిగమించిన తొలి జిల్లాగా రికార్డు సృష్టించారు. దక్షిణాది రాష్ట్రాల్లో రెండు డోసులు పూర్తయిన తొలి జిల్లాగా బెంగళూరు అర్బన్‌ రికార్డు సృష్టించగా, కరీంనగర్‌ రెండో స్థానంలో నిలిచింది. దీనిపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్‌ జిల్లా అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల ప్రకారం, రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఇదే స్ఫూర్తితో వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.

అన్ని జిల్లాలు వందశాతం దిశగా..
మొదటి డోసులో తెలంగాణ ఇప్పటికే 100% లక్ష్యాన్ని అధిగమించిన సంగతి తెలిసిందే. నిజామాబాద్, సూర్యాపేట, కామారెడ్డి, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో వందశాతం పూర్తయితే అన్ని జిల్లాలు రెండు డోసులు వందశాతం పూర్తయిన రికార్డు సొంతం కానున్నది.

Advertisement
 
Advertisement
Advertisement